హైదరాబాద్‌లో రెటాట్రుటైడ్ ఇంజెక్షన్ల అక్రమ విక్రయాలు.. డెకాయ్ ఆపరేషన్‌తో గుట్టురట్టు
ABN , Publish Date - Nov 24 , 2026 | 09:21 AM
బరువు తగ్గాలనే ఆశను ఆసరాగా చేసుకుని ఆన్లైన్లో అనుమతి లేని వెయిట్ లాస్ ఇంజెక్షన్ల విక్రయాలు సాగిస్తున్నారు కొందరు అక్రమార్కులు. హైదరాబాద్‌లో వెలుగుచూసిన ఈ దందాను డ్రగ్ కంట్రోల్ అధికారులు డెకాయ్ ఆపరేషన్‌తో బయటపెట్టారు.
హైదరాబాద్, నవంబరు 24: నగరంలో అక్రమ వెయిట్ లాస్ డ్రగ్స్ దందా వెలుగులోకి వచ్చింది. రెటాట్రుటైడ్ పేరుతో అనుమతి లేని వెయిట్ లాస్ ఇంజెక్షన్లను ఆన్లైన్లో విక్రయిస్తున్న ముఠాపై హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. కాన్పూర్‌కు చెందిన వ్యాపారి శిఖర్ సింగ్ ఈ వ్యవహారంలో నిందితుడిగా ఉన్నాడు. టీజీ సేఫ్ డ్రగ్ ఇన్స్పెక్టర్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన అధికారులు.. పెప్టిగ్రిడ్ వెబ్‌సైట్‌తో పాటు వాట్సాప్ బిజినెస్ అకౌంట్ ద్వారా సాగుతున్న విక్రయాల గుట్టురట్టు చేసేందుకు డెకాయ్ ఆపరేషన్ నిర్వహించారు. కస్టమర్ల మాదిరిగా ఇంజెక్షన్లను ఆర్డర్ చేయగా.. నిందితులు నేరుగా అధికారులకే ఇంజెక్షన్లను డెలివరీ చేశారు. ఇంజెక్షన్లతో పాటు 12 పేజీల ప్రత్యేక మాన్యువల్‌ను కూడా పంపినట్లు అధికారులు గుర్తించారు. రీసెర్చ్ పెప్టైడ్ పేరుతో ఈ విక్రయాలు కొనసాగిస్తున్నట్లు వెల్లడైంది.
భారత్‌లో రెటాట్రుటైడ్ వినియోగానికి ఇంకా అనుమతి లేకపోవడంతో పాటు.. ఈ ప్రయోగాత్మక ఔషధం ప్రస్తుతం క్లినికల్ ట్రయల్స్ దశలోనే ఉంది. అయినప్పటికీ ఎలాంటి అనుమతులు లేకుండా ఆన్లైన్లో విక్రయాలు సాగించడంపై అధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఈ అక్రమ దందా వెనుక ఉన్న నెట్‌వర్క్‌పై సీసీఎస్ పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇంజెక్షన్లు ఎక్కడ తయారవుతున్నాయి? ఎక్కడి నుంచి సరఫరా అవుతున్నాయి? ఈ వ్యవహారంలో ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉంది? అనే కోణాల్లో విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే ఇలాంటి ఇంజెక్షన్లు కొనుగోలు చేసినవారు, వినియోగించినవారి వివరాలను సేకరించే పనిలో అధికారులు ఉన్నారు. అనుమతి లేని ప్రయోగాత్మక ఔషధాల ఆన్లైన్ విక్రయాలు ప్రజల ఆరోగ్యానికి ముప్పుగా మారే ప్రమాదం ఉందని ఈ ఘటన ఆందోళన కలిగిస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి:
కరీంనగర్ వైద్య కాలేజీ నిర్మాణంలో జాప్యమేంటి?
Read Latest AP News And Telangana News