Share News

Hyderabad: సర్వజన సంజీవయ్య.. ఆ పార్కులో ఆంక్షల ఎత్తివేత

ABN , Publish Date - Jan 02 , 2026 | 09:39 AM

ఆ పార్కులో ఆంక్షల ఎత్తివేశారు. దీంతో ఇక అందరూ అక్కడకు వెళ్లవచ్చు. నగరంలోని హుస్సేన్‌సాగర్‌ తీరాన రెండు దశాబ్దాల క్రితం అందుబాటులోకి వచ్చిన సంజీవయ్య పార్కు తిరిగి సర్వజన స్రవంతిగా మారింది. కొత్త సంవత్సరం మొదటి రోజే అమల్లోకి తీసుకొచ్చింది.

Hyderabad: సర్వజన సంజీవయ్య.. ఆ పార్కులో ఆంక్షల ఎత్తివేత

- అన్ని వయస్సుల వారికీ అనుమతి

- ఆరేళ్లుగా ప్రేమికులకు అనుమతివ్వకుండా పిల్లల పార్కుగా నిర్వహణ

హైదరాబాద్‌ సిటీ: హుస్సేన్‌సాగర్‌(Hussain Sagar) తీరాన రెండు దశాబ్దాల క్రితం అందుబాటులోకి వచ్చిన సంజీవయ్య పార్కు(Sanjeevaiah Park) తిరిగి సర్వజన స్రవంతిగా మారింది. పార్కులోకి ప్రవేశానికి ఉన్న ఆంక్షలను ఎత్తివేశారు. పిల్లలు, పెద్దలు తేడా లేకుండా అందరికీ అనుమతిస్తూ హెచ్‌ఎండీఏ నిర్ణయం తీసుకుంది. కొత్త సంవత్సరం మొదటి రోజే అమల్లోకి తీసుకొచ్చింది. సంజీవయ్య పిల్లల ఉద్యానవనంగా ఉన్న పేరును కూడా సంజీవయ్య పార్కుగా మార్పు చేశారు. దీంతో నిన్నటి వరకు జనాలు లేకుండా వెలవెలబోయిన పార్కుకు గురువారం పెద్దఎత్తున జనాలు బారులు తీరారు.


city6.3.jpg

2019లో ఆంక్షలు

హుస్సేన్‌సాగర్‌ తీరాన దాదాపు 92 ఎకరాల విస్తీర్ణంలో అతిపెద్ద పార్కుగా సంజీవయ్య పార్కు నిలిచింది. పార్కులో భారీ జాతీయ జెండాతోపాటు, హర్బల్‌ పార్కు, రోజ్‌ గార్డెన్‌, బటర్‌ఫ్లై పార్కులు ఉన్నాయి. అప్పట్లో రోజు వారీగా వచ్చే సందర్శకులతో ఆదాయం వేలల్లోనే ఉండేది. 2019 ఆగస్టు 28న అప్పటి ప్రభుత్వం ఆంక్షలు పెట్టి పద్నాలుగు ఏళ్లలోపు పిల్లలకు, వారి వెంట వచ్చిన తల్లిదండ్రులు, సంరక్షులకు మాత్రమే ప్రవేశం కల్పించారు.


పార్కును సంజీవయ్య పిల్లల ఉద్యానవనంగా మార్పు చేశారు. ప్రవేశ టికెట్‌ ధర రూ.10 మాత్రమే చేశారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల బృందానికి ఉచిత ప్రవేశాన్ని కల్పించారు. ఆ తర్వాత ప్రేమికులు రాకుండా చేసేందుకు ఆంక్షలు విధించారనే విమర్శలు వచ్చాయి. పార్కులో మితీమిరీ వ్యవహరించే ప్రేమికులను కట్టడి చేయకుండా పార్కులోకి యువత, పెద్దలకు అనుమతించకపోవడమేమిటని ప్రశ్నలు తలెత్తాయి.


city6.2.jpg

కొత్త సంవత్సరం వేళ...

నూతన సంవత్సరం వేళ పార్కులోకి అందరికీ అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్నారు. పార్కులోకి వచ్చే పెద్దలకు టికెట్‌ రూ.20లు, పిల్లలకు రూ.10లు, వాకర్లకు రూ.5లుగా నిర్ణయించారు. వాకర్లకు నెల పాస్‌ రూ.75 చేశారు. పార్కు సమయం ఉదయం 9 నుంచి సాయంత్రం 6గంటల వరకు ప్రవేశం ఉండనుండగా, తెల్లవారుజామున 5.30 నుంచి ఉదయం 8.30గంటల వరకు వాకింగ్‌, వ్యాయామం చేసుకోవచ్చు.


ఈ వార్తలు కూడా చదవండి..

గాలి జనార్దన్‌రెడ్డిపై హత్యాయత్నం

మరో 3.5 కిలోల బంగారం రికవరీ

Read Latest Telangana News and National News

Updated Date - Jan 02 , 2026 | 10:17 AM