Share News

గంజాయి నెట్‌వర్క్‌పై పోలీసుల ఉక్కుపాదం.. ఆటో డ్రైవర్ అరెస్ట్

ABN , Publish Date - Jun 14 , 2026 | 02:00 PM

హైదరాబాద్ ఐటీ కారిడార్ పరిధిలోని నానక్‌రామ్‌గూడలో ఓ కిరాణా షాప్ ముసుగులో సాగుతున్న భారీ గంజాయి విక్రయాల నెట్‌వర్క్‌ను మాదాపూర్ ఎన్‌ఓటీ, స్థానిక పోలీసులు సంయుక్తంగా చేధించారు. ఈ ఆపరేషన్‌లో ఆటో డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు.

గంజాయి నెట్‌వర్క్‌పై పోలీసుల ఉక్కుపాదం.. ఆటో డ్రైవర్ అరెస్ట్
Hyderabad Drug Bust

హైదరాబాద్, జూన్ 14: నగరంలోని ఐటీ కారిడార్‌ పరిధిలోని నానక్‌రామ్‌గూడలో కిరాణా షాప్ ముసుగులో యథేచ్ఛగా సాగుతున్న మాదకద్రవ్యాల విక్రయాలపై పోలీసులు కొరడా ఝుళిపించారు. గంజాయి డాన్‌గా పేరొందిన నీతూబాయికి చెందిన ఓ ఆటోలో భారీగా గంజాయి తరలిస్తుండగా మాదాపూర్ ఎన్‌ఓటీ, స్థానిక పోలీసులు సంయుక్తంగా మెరుపు దాడి చేశారు. ఈ ఆపరేషన్‌లో ఆటో డ్రైవర్‌ను పోలీసులు విజయవంతంగా అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి సుమారు 26 కిలోల నాణ్యమైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని మార్కెట్ విలువ దాదాపు రూ.26 లక్షల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. పట్టుబడిన గంజాయితో పాటు వాహనాన్నీ తదుపరి చర్యల కోసం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారి అయిన గంజాయి డాన్ నీతూబాయి ప్రస్తుతం పరారీలో ఉన్నారు.


ఇటీవల నీతూబాయి నివాసం వద్ద ఈగల్ పోలీసులు నిర్వహించిన ఓ ప్రత్యేక ఆపరేషన్‌లో గంజాయి కొనుగోలు చేసేందుకు వచ్చిన 47 మంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగులను పోలీసులు అదుపులోకి తీసుకోవడం నగరంలో కలకలం రేపింది. పోలీసుల ప్రాథమిక విచారణలో ఈ ముఠా రోజూ దాదాపు 400 మంది వినియోగదారులకు గంజాయి విక్రయిస్తున్నట్లు తేలింది. ఐటీ ఉద్యోగులే లక్ష్యంగా సాగుతున్న నెట్‌వర్క్‌ను పూర్తిగా చేధించేందుకు, పరారీలో ఉన్న నీతూబాయిని పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి దర్యాప్తు చేపట్టారు.


ఇవి కూడా చదవండి:

బల్క్ డీజిల్ కొనుగోళ్లపై ఆంక్షలు.. ఆసుపత్రుల్లో ఆందోళన

చరిత్ర సృష్టించిన టీమిండియా వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్

Updated Date - Jun 14 , 2026 | 02:05 PM