Share News

హైదరాబాద్ పాతబస్తీలో విషాదం.. లైసెన్స్ తుపాకీతో వ్యక్తి ఆత్మహత్య

ABN , Publish Date - Oct 16 , 2026 | 09:46 PM

హైదరాబాద్ పాతబస్తీలోని హుస్సేనీ ఆలం పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆటో గ్యారేజీ యజమాని తన వద్ద ఉన్న లైసెన్స్ కలిగిన తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్ పాతబస్తీలో విషాదం.. లైసెన్స్ తుపాకీతో వ్యక్తి ఆత్మహత్య
Hyderabad Old City

హైదరాబాద్‌, అక్టోబర్ 16: నగరంలోని హుస్సేనీ ఆలం పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటు చేసుకుంది. మహమ్మద్ అలీమ్ ఉద్దీన్ (50) అనే వ్యక్తి తన వద్ద ఉన్న లైసెన్స్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆటో గ్యారేజీ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్న ఆయనకు ముగ్గురు కుమార్తెలు, ముగ్గురు కుమారులు ఉన్నారు.

సమాచారం అందుకున్న వెంటనే హుస్సేనీ ఆలం పోలీసులు క్లూస్ టీమ్‌తో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక దర్యాప్తు చేపట్టారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఘటనా స్థలంలో లభించిన రక్త నమూనాలతో పాటు, ఆయన ఉపయోగించిన తుపాకీని స్వాధీనం చేసుకుని అన్ని కోణాల్లోనూ దర్యాప్తును ముమ్మరం చేశారు.


కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గత కొన్ని నెలలుగా అలీమ్ ఉద్దీన్ తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మానసికంగా కుంగిపోయారు; ఈ క్రమంలోనే ఆయన గతంలో మూడుసార్లు ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు తెలిసింది. శుక్రవారం సాయంత్రం ఆయన తన కుమారులతో కలిసి స్వయంగా తన తండ్రి సమాధి వద్దకు వెళ్లి, ‘నేను చనిపోతే, నా మృతదేహాన్ని మా నాన్న సమాధి పక్కనే ఖననం చేయండి’ అని వారితో చెప్పి ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఇంటికి తిరిగి వచ్చిన కొద్దిసేపటికే ఆయన ఒంటరిగా తన పార్కింగ్ గదిలోకి వెళ్లి, తన వద్ద ఉన్న తుపాకీతో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న హుస్సేనీ ఆలం పోలీసులు, ఇది అనారోగ్య సమస్యల వల్ల జరిగిన బలవన్మరణంగా భావిస్తూ లోతుగా విచారణ జరుపుతున్నారు.


ఇవి కూడా చదవండి...

హైదరాబాద్‌లో ఆపరేషన్ ‘కవచ్’.. పోలీసుల విస్తృత తనిఖీలు

వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డిపై కేసు నమోదు

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 16 , 2026 | 09:56 PM