మెట్రో కొత్త మలుపు!
ABN , Publish Date - Jun 24 , 2026 | 04:14 AM
హైదరాబాద్ మెట్రో రైలు మొదటి దశకు రుణం మంజూరు, రెండో దశ విస్తరణకు సంబంధించిన వ్యవ హారం కొత్త మలుపు తిరిగింది. ఒక్కో దశకు విడివిడిగా కాకుండా రెండు దశలకు కలిపే రుణం మంజూరయ్యేలా చేసేందుకు కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు ఒక కార్యాచరణను రూపొందించాయి.
2 దశలకు కలిపి ఒకే సంస్థ నుంచి రుణం.. సమకూర్చే బాధ్యతను కేంద్రం తీసుకుంటుంది
ఇప్పటికే ఓకే అయిన జపాన్ రుణం రద్దు
2 దశల మెట్రోల విలువలు మరోసారి మదింపు
ఎవాల్యుయేషన్ బాధ్యత ఎస్‌బీఐ క్యాప్స్‌కు
రెండు నెలల్లో నివేదిక ఇవ్వాలని గడువు
రెండు దశల్లో వాటాదారుగా ఉంటానన్న కేంద్రం
చర్చకు అంగీకరించిన ముఖ్యమంత్రి రేవంత్
అందుకోసమే మెట్రోపై మరోసారి మదింపు
వడ్డీ 4 శాతం దాటకుండాచూడాలని షరతు
ఖట్టర్, వైష్ణవ్, కిషన్‌రెడ్డిలతో రేవంత్ చర్చలు
జపాన్ అప్పు కోసం చెల్లించిన 84కోట్లు వెనక్కి
తాజా పరిణామాలపై ఎల్‌అండ్‌టీతో త్వరలో భేటీ
హైదరాబాద్, న్యూఢిల్లీ, జూన్ 23 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ మెట్రో రైలు మొదటి దశకు రుణం మంజూరు, రెండో దశ విస్తరణకు సంబంధించిన వ్యవ హారం కొత్త మలుపు తిరిగింది. ఒక్కో దశకు విడివిడిగా కాకుండా రెండు దశలకు కలిపే రుణం మంజూరయ్యేలా చేసేందుకు కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు ఒక కార్యాచరణను రూపొందించాయి. ఈ మేరకు మంగళవారం కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ సమక్షంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, రాష్ట్రానికే చెందిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి జరిపిన చర్చలు ఫలవంతం అయ్యాయి. కొత్త కార్యాచరణ ఖరారు కావడంతో మెట్రో మొదటి దశ స్వాధీనానికి ఎల్ అండ్ టీ కంపెనీకి చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికిజపాన్ నుంచి భారత ప్రభుత్వరంగ సంస్థ ఐఆర్‌ఎఫ్‌సీ ద్వారా మంజూరైన రూ.13,600 కోట్ల రుణం ప్రక్రియ నిలిచిపోనుంది. దానికి బదులుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉమ్మడి ఆధ్వర్యంలో పాత మెట్రోను కొనడం, కొత్తగా విస్తరించడం చేయాలని నిర్ణయించారు. ఉమ్మడి ప్రాజెక్టు కాబట్టి మొత్తం మెట్రో వ్యవహారాన్ని తాజాగా మొదలు పెడతారు. దీనికోసం ఎస్‌బీఐ క్యాప్స్‌ను కన్సల్టెన్సీ సంస్థగా నియమించాలని .నిర్ణయించారు.
మొదటి దశ ఆస్తుల విలువను నిర్ధారించడం, రెండో దశ నిర్మాణానికి ఎంత ఖర్చవుతుందో తేల్చడం, ఆ రుణాలను తక్కువ వడ్డీకి ఇచ్చే సంస్థలను అన్వేషించి, అనుసంధానం చేయడం ఎస్‌బీఐ క్యాప్స్ బాధ్యత. ఇది రెండు నెలల్లో నివేదిక ఇస్తుంది. రెండు దశలకు అవసరమైన రుణం ఇచ్చే ఆర్ధిక సంస్థలను ఎంపిక చేసి, వాటితో సంప్రదింపులు జరిపి, రెండు దశలకు కలిపి రుణం మంజూరుకు మార్గం సుగమం చేస్తుంది. రెండు దశలకు కలిపి రుణం తీసుకోవాలని భావిస్తున్న నేపథ్యంలోనే మరోసారి పాత మెట్రో ఆస్తులు, అప్పుల విలువను మదింపు చేయాలని నిర్ణయించారు. మెట్రో మొదటి, రెండో దశల్లో కూడా వాటాదారుగా ఉంటానని కేంద్రం చెప్పినట్లు విశ్వసనీయంగా తెలిసింది. వాటా ఇచ్చేందుకు తమకేమీ అభ్యంతరం లేదని, ఆస్తులతో పాటు అప్పుల్లోనూ కేంద్రం బాధ్యత తీసుకోవాలని, ఈక్విటీ వాటాదారుగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. ఈ లెక్కల తర్వాత కేంద్రం వాటా ఎంత అనేది తేలనుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రుణానికి సంబంధించిన వడ్డీ రేట్ల మీద పట్టుబట్టినట్టు సమాచారం. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఐఆర్‌ఎఫ్‌సీ ద్వారా జపాన్ నుంచి 4 శాతం వడ్డీకే రుణం వచ్చేట్లు మాట్లాడుకున్నామని, కొత్త రుణం కూడా ఇదే రేటుతో ఉంటేనే రాష్ట్ర ప్రభుత్వానికి లాభదాయకంగా ఉంటుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. దీనికి కేంద్రమంత్రులు కూడా అంగీకరించినట్టు సమాచారం.
రెండు నెలల్లో పూర్తయ్యేలా
హైదరాబాద్ మెట్రో రెండో దశను చేపట్టడానికి నిర్వహణ సంస్థ ఎల్ అండ్ టీ సిద్ధంగా లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం మొత్తం మెట్రోను స్వాధీనం చేసుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఫేజ్-1 స్వాధీనానికి రూ.13,600 కోట్లు అవసరం అయ్యింది. జపాన్ నుంచి ఐఆర్‌ఎ్‌ఫసీ ద్వారా తీసుకొనేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. నిధులు చివరి దశలో నిలిచి పోయాయి. నిజానికి మొదటి దశ ఆస్తులను, రెండో దశ ఖర్చులను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఐడీబీఐ ద్వారా అంచనా వేయించింది. వాటి ఆధారంగానే ఎల్ అండ్ టీతో ఒప్పందం, జపాన్ రుణం ఖరారయ్యాయి. కేంద్ర మంత్రులతో ముఖ్యమంత్రి చర్చల్లో చివరకు మెట్రో మొదటి ఆస్తులను, రెండో దశ విస్తరణ ఖర్చులను మరోసారి మదింపు చేయాలని అంగీకారానికి వచ్చారు. రెండు దశలకు ఒకే సంస్థ/కన్సార్టియం నుంచి రుణం తీసుకోవాలన్న ఆలోచనతో పాటు మొదటి దశ రుణం సజావుగా సాగేందుకు పునర్ మదింపు ఉపయోగ పడుతుందని భావించారు. ఐడీబీఐ గతంలో చేసిన మదింపును కూడా ఎస్‌బీఐ క్యాప్స్ పరిగణనలోకి తీసుకుంటుంది. రెండు దశల ఉమ్మడి విలువను తేల్చడంతో పాటు మొదటి దశను ఎల్ అండ్ టీ నుంచి తీసుకోవడానికి వెంటనే ఎన్ని నిధులు అవసరమో కూడా తేలుస్తారు. ప్రక్రియ మొత్తాన్ని రెండు నెలల్లోపే పూర్తి చేస్తారు. మెట్రో రెండు దశలకు కలిపి ఒకే సంస్థ నుంచి రుణాన్ని మంజూరు చేయించడంతో పాటు వడ్డీ రేటు విషయంలోనూ కేంద్రమే కీలకంగా వ్యవహ రించనుంది. కేంద్ర మంత్రులు 4 శాతం కంటే తక్కువ వడ్డీరేటుకే రుణం ఇప్పించేలా సహకరిస్తామని ముఖ్యమంత్రికి చెప్పినట్లు తెలుస్తోంది. ఆర్ధికంగానూ రాష్ట్ర ప్రభుత్వానికి ఇది కొంత ఉపశమనమని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. రాష్ట్ర మెట్రోలో భాగస్వామిగా ఉండాలని కేంద్రం గట్టిగా బావిస్తోంది. మెట్రోలో వాటాదారుగా ఉంటానని చెబుతోంది. రెండు దశల మెట్రోల విలువల మదింపు తర్వాత మరోసారి సమావేశమై కేంద్రం వాటాపై చర్చిస్తారు. కేంద్రం ఆస్తులతో పాటు అప్పుల్లో కూడా వాటాదారుగా ఉంటుంది. కేంద్రమే భాగస్వామి కావడంతో రుణం మంజూరు, వడ్డీరేట్లు తేలడం వేగంగా జరుగుతాయని అంటున్నారు.
ఫీజు రూ.84 కోట్లు వెనక్కి
తాజా పరిణామాల నేపథ్యంలో జపాన్ రుణం ఆగిపోయినట్లే. ఆ రుణం మంజూరు కోసం కేంద్ర ప్రభుత్వ సంస్థ ఐఆర్‌ఎఫ్‌సీకి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించిన రూ.84 కోట్లను వెనక్కి ఇచ్చేందుకు సదరు సంస్థ అంగీకరించింది. బ్యాంకు ఖాతా నంబరు ఇస్తే నిధులను బదిలీ చేస్తామని కూడా చెప్పింది. ఎల్ అండ్ టీ ఎంఆర్‌హెచ్‌ఎల్ ఇదే రుణం కోసం చెల్లించిన రూ.11 కోట్లను ఐఆర్‌ఎఫ్‌సీ ఇప్పటికే తిరిగి ఇచ్చేసింది. రెండు దశలను మదించడం కోసం ఐడీబీఐకు చెల్లించిన రూ.4.6 కోట్లు మాత్రం తిరిగిరావు. తాజా పరిణామాలను వివరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఎల్ అండ్ టీ ప్రతినిధులతో సంప్రదింపులు జరపనుంది.
సమన్వయానికి ఇద్దరు అధికారులు
ఎస్‌బీఐ క్యాప్స్ కన్సల్టెన్సీఅధ్యయనం సమయంలో సమన్వయపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక అధికారి, రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ది శాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రతినిధులుగా ఉండాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ అధికారులు అధ్యయన ప్రక్రియ వేగంగా పూర్తయి నివేదిక ఇచ్చేందుకు కృషి చేస్తారు. సోమవారం కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చర్చలు జరిపిన తర్వాత మంగళవారం ముగ్గురూ వెళ్లి కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. మెట్రో రెండో దశ వేగంగా పూర్తవ్వాలనే ఏకైక లక్ష్యంతో చర్చలు కొనసాగాయి. ఎస్‌బీఐ క్యాప్స్‌కు గతంలో పూనే రింగ్ రోడ్ ప్రాజెక్టు, ముంద్రా పెట్రో కెమ్ ప్రాజెక్టు, పెట్రోనెట్ ఎల్ ఎన్ జి లిమిటెడ్ ప్రాజెక్టు, మహారాష్ట్ర మౌలిక సదుపాయాల అభివృద్దికి చెందిన యాన్యుటీ ప్రాజెక్టు, డ్రక్ గ్రీన్ పవర్ ప్రాజెక్టుతో పాటు ఆదానీ ఎంటర్ ప్రైజెస్, ఎల్‌ఐసీ, హాల్దియా పెట్రో కెమికల్స్, జియో ప్లాట్ ఫారమ్స్ కు సంబంధించిన వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులను ఎస్‌బీఐ క్యాప్స్ పర్యవేక్షిస్తోంది.