కలిసి కదిలారు!
ABN , Publish Date - Jun 23 , 2026 | 03:35 AM
తెలంగాణ రాజకీయాల్లో సోమవారం అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. హైదరాబాద్ మెట్రో రుణం బదిలీపై కొద్ది రోజులుగా పరస్పర విమర్శలు చేసుకున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి.......
కిషన్‌రెడ్డితో వెళ్లి కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కలిసిన సీఎం రేవంత్
హైదరాబాద్ మెట్రో రుణంపై చర్చించేందుకు అపాయింట్‌మెంట్ తీసుకున్న కిషన్‌రెడ్డి
రెండు గంటల పాటు సాగిన సమావేశం
కష్టపడి జపాన్ రుణం సాధించామన్న సీఎం
కేంద్ర సంస్థ రుణ బదిలీ ఆపేసిందని వెల్లడి
చర్చలు సానుకూలమన్న సీఎం రేవంత్
నేడు పట్టణాభివృద్ధి మంత్రి ఖట్టర్‌తో భేటీ
నేటి భేటీకి కూడా ఇద్దరూ కలిసి హాజరు
రుణం, రెండో దశపై స్పష్టతకు అవకాశం
న్యూఢిల్లీ, జూన్ 22 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాజకీయాల్లో సోమవారం అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. హైదరాబాద్ మెట్రో రుణం బదిలీపై కొద్ది రోజులుగా పరస్పర విమర్శలు చేసుకున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఈ సమస్యపై కలిసికట్టుగా కదిలారు. సోమవారం రాత్రి కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో దాదాపు రెండు గంటలపాటు సమావేశమయ్యారు. ఈ సమావేశం అపాయింట్మెంట్ కూడా సికింద్రాబాద్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్‌రెడ్డే తీసుకున్నారు. మొత్తం మీద సమావేశం సానుకూలంగా సాగిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మెట్రో రుణం బదిలీ, రెండో దశ విస్తరణ.. ఈ రెండు అంశాలపై ఇద్దరు నేతలు మంగళవారం పట్టణాభివృద్ధి మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌తో సమావేశం కానున్నారు. మంగళవారం ఉదయం పదిన్నర గంటలకు సమావేశం ఉంటుందని ముఖ్యమంత్రి వెల్లడించారు. హైదరాబాద్ మెట్రో రైలు మొదటి దశను స్వాధీనం చేసుకోవడంలో కీలకమైన కొత్త రుణం మంజూరుపై మంగళవారం సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. హైదరాబాద్ మెట్రో రైలు మొదటి దశ స్వాధీనం కోసం రాష్ట్రానికి రావాల్సిన రుణాన్ని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆపేశారని, ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్(ఐఆర్‌ఎఫ్‌సీ) ఖాతాలో జమయిన రూ.13,600 కోట్లను రాష్ట్రప్రభుత్వానికి ఇవ్వకుండా నిలిపివేయించారని గత వారం సీఎం రేవంత్ తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ప్రాజెక్టులను ఆపే సంస్కృతి బీజేపీకి లేదని, కేంద్ర మంత్రులతో సీఎ రేవంత్ భేటీకి తాను కూడా వస్తానని కిషన్‌రెడ్డి బదులిచ్చారు. ఈ నేపథ్యంలో మెట్రో అంశంపై కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో సమావేశం ఏర్పాటు చేయించాలని కిషన్‌రెడ్డికి సీఎం రేవంత్ రెండుసార్లు లేఖలు రాశారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రులను కలిసేందుకు ముఖ్యమంత్రి ఆదివారం రాత్రి ఢిల్లీకి రాగా, కిషన్‌రెడ్డి రైల్వే మంత్రి అపాయింట్‌మెంట్ తీసుకున్నారు. సోమవారం సాయంత్రం రైల్వే భవన్‌లో కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో సీఎం రేవంత్ భేటీ ఖరారు కాగా, ఈ సమావేశంలో కిషన్‌రెడ్డి కూడా పాల్గొన్నారు.

సాయంత్రం 6.30 గంటల నుంచి రాత్రి 8:30 వరకు దాదాపు రెండు గంటల పాటు ఈ సమావేశం జరిగింది. హైదరాబాద్ మెట్రో రైలు మొదటి దశ స్వాధీనం కోసం రావాల్సిన ఐఆర్‌ఎఫ్‌సీ రుణంపై అశ్వినీ వైష్ణవ్‌తో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సుధీర్ఘంగా చర్చించారు. మెట్రో మొదటి దశ స్వాధీనం కోసం ఎల్ అండ్ టీ తమ ప్రభుత్వ ఒప్పందంతో పాటు భవిష్యత్తులో మెట్రో విస్తరణపై తమ ప్రభుత్వ ప్రణాళికలను ముఖ్యమంత్రి వివరించారు. మొదటి దశను స్వాధీనం చేసుకోవాలంటే ఎల్ అడ్ టీ సంస్థ బ్యాంకుల నుంచి తెచ్చుకున్న అప్పును తమ ప్రభుత్వం తీర్చాల్సి ఉంటుందని చెప్పారు. జపాన్ సంస్థను ఒప్పించి కేవలం 4 శాతం వడ్డీతో రూ.13,600 కోట్ల రుణాన్ని తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం చేసిన కృషిని వివరించారు. మెట్రో రుణం సొమ్మును బదలాయించాలంటూ హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్(హెచ్‌ఎంఆర్‌ఎల్) కేంద్ర ప్రభుత్వ సంస్థ ఐఆర్‌ఎఫ్‌సీకి రెండు సార్లు ఇన్వాయిస్ నోటీసులు పంపిన విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. ఈ నెల 12న మొదట ఇన్వాయిస్ పంపగా 15వ తేదీతో దాని గడువు ముగిసిందన్నారు. 16వ తేదీన మరోసారి ఇన్వాయిస్ మెట్రో రైల్ పంపిందని వివరించారు. జపాన్ సంస్థ నుంచి రుణం ఐఆర్‌ఎఫ్‌సీకి బదిలీ అయినప్పటికీ తమకు బదలాయించడంపై స్పందించడం లేదని చెప్పారు. రుణం అత్యవసరమని ముఖ్యమంత్రి స్పష్టం చేసినట్లు తెలిసింది. అశ్వినీ వైష్ణవ్‌తో భేటీ అనంతరం ముఖ్యమంత్రి తుగ్లక్ రోడ్‌లోని తన అధికారిక నివాసానికి చేరుకున్నారు. అనంతరం మర్నాడు జరిగే సమావేశం గురించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో భేటీ అయ్యారు.