Share News

లంగర్ హౌస్‌లో హోంగార్డుపై రాళ్ల దాడి.. వెలుగులోకి సీసీ టీవీ దృశ్యాలు..

ABN , Publish Date - Jan 20 , 2026 | 05:47 PM

ఇద్దరు యువకులు గొడవ పడుతున్నారని హోంగార్డు ఆలీంకు సమాచారం అందింది. దీంతో అతడు గొడవ ఆపడానికి వెళ్లాడు. గొడవ పడుతున్న యువకులకు సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు. అయితే వారు అతడి మాటలు లెక్కచేయలేదు..

లంగర్ హౌస్‌లో హోంగార్డుపై రాళ్ల దాడి.. వెలుగులోకి సీసీ టీవీ దృశ్యాలు..
Langer House fight

హైదరాబాద్‌: నగరంలోని లంగర్‌హౌస్‌లో ఆదివారం గొడవ చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. గొడవను ఆపడానికి వెళ్లిన హోంగార్డు గాయాలపాలయ్యాడు. ఇక, ఈ సంఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో దాడికి సంబంధించిన దృశ్యాలు ఉన్నాయి. హోంగార్డ్ కొంతమంది యువకులతో కలిసి వీధిలో నిల్చుని ఉన్నాడు. గొడవపడుతున్న యువకుల వైపు చూస్తున్నాడు.


ఇంతలో యువకుల వైపు నుంచి ఓ రాయి బలంగా హోంగార్డు వైపు దూసుకొచ్చింది. అతడు ఆ రాయినుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. అయినా లాభం లేకుండా పోయింది. ఆ రాయి సరిగ్గా అతడి ముఖానికి తగిలింది. రాయి తగిలిన వెంటనే హోంగార్డు కుప్పకూలిపోయాడు. ముఖం నుంచి రక్తం కారుతూ ఉంది. అక్కడ ఉన్న ఓ వ్యక్తి హోంగార్డును పైకిలేపాడు. తన స్కూటీ దగ్గరకు తీసుకెళ్లాడు. ఆయనను స్కూటీ వెనకాల కూర్చోబెట్టుకుని అక్కడినుంచి తీసుకెళ్లిపోయాడు.


ఇంతకీ ఏం జరిగిందంటే.. లంగర్ హౌస్‌లోని బాగ్దాత్ కాలనీలో ఇద్దరు యువకులు గొడవ పడుతున్నారని హోంగార్డు ఆలీంకు సమాచారం అందింది. దీంతో అతడు గొడవ ఆపడానికి వెళ్లాడు. గొడవ పడుతున్న యువకులకు సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు. అయితే, వారు అతడి మాటలు లెక్కచేయలేదు. హోంగార్డుపై ఆగ్రహంతో ఊగిపోయి.. రాళ్లతో దాడి చేశారు. రాయి ఆలీం ముఖానికి తగిలి తీవ్ర గాయం అయింది. ప్రస్తుతం అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. ఇక, ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

చలాన్లపై ట్రాఫిక్‌ పోలీసులకు తెలంగాణ హైకోర్టు ఆదేశాలు

టెకీ మృతి ఘటన.. నొయిడా సొసైటీ బిల్డర్ అరెస్టు

Updated Date - Jan 20 , 2026 | 06:52 PM