Share News

ఈ-సిగరెట్ల దందాపై ఈగల్ ఫోర్స్ దాడులు.. ముగ్గురి అరెస్ట్..

ABN , Publish Date - Sep 04 , 2026 | 07:38 PM

హైదరాబాద్ నగరంలో జోరుగా సాగుతున్న నిషేధిత ఈ-సిగరెట్ల దందాపై ఈగల్‌ఫోర్స్ పంజా విసిరింది. మాదాపూర్‌లో ఆకస్మిక దాడులు చేసి భారీ మొత్తంలో నిషేధిత ఈ-సిగరెట్లను స్వాధీనం చేసుకుంది.

ఈ-సిగరెట్ల దందాపై ఈగల్ ఫోర్స్ దాడులు.. ముగ్గురి అరెస్ట్..

హైదరాబాద్, సెప్టెంబరు 4: నగరంలోని మాదాపూర్‌లో జోరుగా సాగుతున్న నిషేధిత ఈ-సిగరెట్ల దందాపై ఈగల్‌ ఫోర్స్ పంజా విసిరింది. ఈ-సిగరెట్స్ విక్రయదారులపై ఆకస్మిక దాడులు చేసింది. వారి నుంచి 152 నిషేధిత ఈ-సిగరెట్లను స్వాధీనం చేసుకుని సీజ్ చేసింది. ఈ దాడిలో పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేయగా, ఇద్దరు యజమానులు పరారీలో ఉన్నారు. ఈ- సిగరెట్ల నిల్వ, అక్రమరవాణా, విక్రయాలపై ఈగల్‌ ఫోర్స్ దృష్టి సారించింది. నిషేధిత ఈ-సిగరెట్ల(వేప్స్)విక్రయాలు జరుగుతున్నాయన్న సమాచారం అందుకున్న పోలీసులు మాదాపూర్‌లోని రెండు ఔట్‌లెట్లపై దాడులు చేశారు. ఈ దాడుల్లో 152 నిషేధిత ఈ-సిగరెట్లను పోలీసులు సీజ్ చేశారు. వారి నుంచి 34 ఫారిన్ సిగరెట్ ప్యాకెట్లు, 3 స్కానర్లు, రూ.9,500 నగదును స్వాధీనం చేసుకున్నారు.


ఈ నిషేధిత సిగరెట్లు(వేప్స్)విక్రయాలు వెబ్‌సైట్ ద్వారా నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వాట్సప్ ద్వారా ఆర్డర్లు తీసుకుని పోర్టర్, రాపిడో ద్వారా డెలివరీ చేస్తున్నట్లు వారు తెలిపారు. వీటి చెల్లింపులు క్యూ‌ఆర్ కోడ్‌ల ద్వారా జరిగినట్లు వారు గుర్తించారు. నిందితులకు చెందిన రెండు బ్యాంకు ఖాతాల్లో రూ.2.31 కోట్లకు పైగా లావాదేవీలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఈ లావాదేవీలను పరిశీలించిన పోలీసులు హైదరాబాద్‌లో 130 మంది ఈ-సిగరెట్ల వినియోగదారులు ఉన్నట్లు, 351 మంది కొనుగోలుదారులు ఉన్నట్లు గుర్తించారు. ఈ-సిగరెట్లను కొనుగోలు చేయడం కూడా చట్టప్రకారం నేరమే అవుతుందని, వారిపై తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.


సాధారణ సిగరెట్లలో నికోటిన్ పొగాకు రూపంలో ఉండగా, ఈ-సిగరెట్లలో నికోటిన్, కొన్ని రసాయనాల మిశ్రమం ద్రవ రూపంలో ఉంటుంది. సాధారణ సిగరెట్లను కాల్చినపుడు పొగ వస్తుంది. కానీ, ఈ-సిగరెట్లను కాల్చడం ఉండదు. ఇవి బ్యాటరీతో పనిచేసే ఎలక్ట్రానిక్ పరికరాలు. ఇవి రసాయన ద్రవాన్ని వేడి చేసి ఆవిరిగా మారుస్తాయి. ఈ నికోటిన్ ఆవిరిని వినియోగదారులు పీల్చుతారు. ఇవి చూడడానికి పెన్ను మాదిరిగా ఉంటాయి. అందుకే వీటిని వేప్స్ లేదా వేప్స్ పెన్నులు (ఆవిరి పెన్నులు) అంటారు.


Also Read:

రాత్రంతా మొబైల్‌ చూస్తున్నారా? నిద్రలేమితో ఈ ముప్పులు తప్పవు!

భారత్-జపాన్ మధ్య చారిత్రక టీ20 మ్యాచ్.. ఎప్పుడంటే?

కొండా సురేఖను బీఆర్ఎస్‌లోకి రానివ్వం: జగదీశ్‌రెడ్డి

Updated Date - Sep 04 , 2026 | 07:38 PM