రూ. 5 వేల కోట్లతో హైదరాబాద్- బెంగళూరు హైవే!
ABN , Publish Date - Aug 11 , 2026 | 06:30 AM
హైదరాబాద్- బెంగళూరు జాతీయ రహదారి (ఎన్‌హెచ్- 44) విస్తరణకు ఎట్టకేలకు మోక్షం లభించింది. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న ఈ రహదారి విస్తరణ అంశంపై జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) కీలక అడుగు వేసింది.
బ్రౌన్‌ఫీల్డ్ విధానంలో 176.37 కి.మీ. మార్గం విస్తరణ
హైదరాబాద్ నుంచి కర్నూలు వరకు సిద్ధమైన అలైన్‌మెంట్
సెప్టెంబరు చివర్లో కేంద్రానికి డీపీఆర్
కొత్తగా భూసేకరణ లేకుండానే
6 వరుసలు, సర్వీసు రోడ్లు
మూడు టోల్‌ప్లాజాలు.. 8 మేజర్, 62 మైనర్ జంక్షన్లు
హైదరాబాద్, (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్- బెంగళూరు జాతీయ రహదారి (ఎన్‌హెచ్- 44) విస్తరణకు ఎట్టకేలకు మోక్షం లభించింది. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న ఈ రహదారి విస్తరణ అంశంపై జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) కీలక అడుగు వేసింది. ఈ మార్గంలో హైదరాబాద్ నుంచి కర్నూలు వరకు ప్రస్తుతమున్న 176.37 కిలోమీటర్ల 4 వరుసల రహదారిని 6 లేన్ల పాక్షిక యాక్సెస్ కంట్రోల్డ్ హైవేగా అభివృద్ధి చేసేలా అలైన్‌మెంట్‌ను రూపొందించి కేంద్రానికి పంపింది. రూ. 5 వేల కోట్ల ప్రాథమిక అంచనా వ్యయంతో బ్రౌన్ ఫీల్డ్ (ప్రస్తుత రోడ్డునే అభివృద్ధి, విస్తరణ చేయడం) విధానంలో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్టు సమగ్ర నివేదిక (డీపీఆర్) కూడా తుది దశకు చేరుకుందని, సెప్టెంబర్ చివరి వారంలో కేంద్రానికి పంపే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే, రహదారి నిర్మాణ పనులకు టెండర్లను పిలిచే నాటికి అంచనాలు పెరిగే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
గ్రీన్‌ఫీల్డ్ నుంచి బ్రౌన్‌ఫీల్డ్‌కు మారిన రోడ్డు
నాగ్‌పూర్- హైదరాబాద్ మార్గంలో గ్రీన్‌ఫీల్డ్ విధానంలో హైస్పీడ్ కారిడార్ నిర్మించాలని భావించిన ఎన్‌హెచ్‌ఏఐ ఇందుకు సంబంధించిన డీపీఆర్ తయారీ బాధ్యతలను ఓ సంస్థకు అప్పగించింది. అయితే, ప్రస్తుతం ఉన్న మార్గంతో పాటు ప్రతిపాదిత గ్రీన్‌ఫీల్డ్ మార్గాలపై సమగ్ర సర్వే చేయాలని కేంద్రం మరో సంస్థను నియమించింది. ప్రస్తుతం ఉన్న రోడ్డుకు 60 మీటర్ల వెడల్పుతో ‘రైట్ ఆఫ్ వే’ (ఆర్‌వోడబ్ల్యూ) భూమి ఇప్పటికే అందుబాటులో ఉన్నట్లు సదరు సంస్థ తన నివేదికలో స్పష్టం చేసింది. కాబట్టి ఈ స్థలంలోనే ఎలాంటి కొత్త భూసేకరణ అవసరం లేకుండా ప్రస్తుత 4 లేన్ల రహదారిని 6 లేన్లతో యాక్సెస్ కంట్రోల్డ్ హైవేగా అభివృద్ధి చేయొచ్చని నివేదికలో పొందుపర్చింది. రెండు వైపులా సర్వీస్ రోడ్లనూ సౌకర్యవంతంగా ఏర్పాటు చేయవచ్చని పేర్కొంది. దాంతో కొత్త గ్రీన్‌ఫీల్డ్ హైవే కోసం భూసేకరణ చేయడం కంటే.. అందుబాటులో ఉన్న భూమితో బ్రౌన్‌ఫీల్డ్ విధానంలో ముందుకెళ్లాలని ఎన్‌హెచ్‌ఏఐ నిర్ణయించింది. ఆ మేరకే తాజాగా ఈ మార్గం అలైన్‌మెంట్‌ను ఖరారు చేసింది.
ఎంతదూరం ప్రయాణిస్తే అంతే రుసుము
హైదరాబాద్ (శంషాబాద్ ఎయిర్‌పోర్టు సమీపం) కొత్తూరు సమీపం నుంచి కర్నూలు వరకు చేపట్టబోయే 6 లేన్ల విస్తరణకు సంబంధించిన అలైన్‌మెంట్ ‘ఆంధ్రజ్యోతి’కి లభించింది. తెలంగాణ పరిధిలో ఈ మార్గం కొత్తూరు, షాద్‌నగర్, బాలానగర్, జడ్చర్ల, భూత్పూర్, అన్నాసాగర్, జానంపేట, మూసాపేట, అడ్డాకల్, కనిమెట్ల, బీచుపల్లి, పుల్లూర్ మీదుగా కర్నూలుకు చేరుకుంటుంది. మొత్తం రహదారిపై 3 చోట్ల టోల్ ప్లాజాలు, 8 మేజర్, 62 మైనర్ జంక్షన్లతో పాటు 10 మేజర్, 74 మైనర్ బ్రిడ్జిలు నిర్మించాల్సి ఉంది. మొత్తం 86 అండర్ పాస్‌లు ఏర్పాటు చేస్తుండగా.. వీటిలో కొన్ని ఇప్పటికే అందుబాటులో ఉండగా, కొత్తగా ప్రతిపాదించినవి కొన్ని ఉన్నాయి. 3 చోట్ల రైల్వే క్రాసింగ్‌లు రానున్నాయి. ఈ మార్గంలో ఏర్పాటు చేయబోయే 3 టోల్‌ప్లాజాల్లోనూ.. ప్రయాణించిన దూరం మాత్రమే రుసుము చెల్లించేలా కొత్త సాంకేతికతను వినియోగించనున్నారు. వాహనం హైవే పైకి ఎక్కిన చోట, దిగిన చోట ఉండే ఆటోమేటిక్ స్కానర్లు ప్రయాణించిన దూరాన్ని లెక్కించి నేరుగా ఫాస్టాగ్ నుంచి రుసుమును మినహాయించుకుంటాయి. ప్రస్తుత రహదారిపై గంటకు 80 కిలో మీటర్ల వేగానికి అనుమతి ఉండగా.. విస్తరణ అనంతరం వాహనాలు గంటకు 100-120 కి.మీ వేగంతో ప్రయాణించేందుకు వీలవుతుంది. హైదరాబాద్- బెంగళూరు మధ్య ప్రయాణ సమయం గరిష్ఠంగా తగ్గనుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
ఇవి కూడా చదవండి:
ఫిట్‌నెస్ కోసం 17 కిలోలు తగ్గాడు.. సర్ఫరాజ్ ఖాన్ ఈసారైనా నిరూపించుకుంటాడా?
2027 వన్డే ప్రపంచకప్.. జట్టులో చేరేందుకు సిద్ధంగా ఉన్నా: భువనేశ్వర్ కుమార్