హుజూరాబాద్ బీఆర్ఎస్‌లో సెగలు.. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై బీఆర్ఎస్ నేతల తిరుగుబాటు
ABN , Publish Date - Mar 21 , 2026 | 01:09 PM
హుజూరాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి. గత కొంత కాలంగా కౌశిక్ రెడ్డి ఒంటెద్దు పోకడలపై స్థానిక నాయకత్వం తిరుగుబావుటా ఎగురవేసింది. వివరాల్లోకి వెళితే..
హుజూరాబాద్, మార్చి 21: హుజూరాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్(BRS) పార్టీలో అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి. గత కొంత కాలంగా కౌశిక్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు, వ్యవహారశైలిపై విసిగిపోయిన స్థానిక నేతలు, అనుచరులు త్వరలో పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే భవిష్యత్ కార్యాచరణపై జమ్మికుంటలో రహస్య సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో సుమారు వందమందికిపైగా పాల్గొన్నట్లు సమాచారం. ఈ పరిణామాలు నియోజకవర్గ రాజకీయాల్లో పెను సంచలనంగా మారాయి.
శుక్రవారం రాత్రి జరిగిన రహస్య సమావేశంలో పలువురు నేతలు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యవహార శైలిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇటీవల కౌశిక్ రెడ్డి నిర్ణయాల వల్ల నియోజకవర్గంలో పార్టీ ప్రతిష్ఠ దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కోసం కష్టపడే వారిని కాదని, తన సొంత అజెండాను అమలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరం కలిసికట్టుగా ఉండి పార్టీని, తమ రాజకీయ భవిష్యత్ ను కాపాడుకుంటామని తీర్మానించినట్లు తెలుస్తోంది.
మరోవైపు ఈ ముసలం కాస్త పార్టీ ఫిరాయింపుల వైపు దారితీసేలా కనిపిస్తోంది. ఇప్పటికే అసంతృప్తి నేతలు కొందరు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. త్వరలోనే జిల్లా మంత్రి సమక్షంలో భారీ సంఖ్యలో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు హస్తం గూటికి చేరే అవకాశం ఉందని అంటున్నారు. మరి ఈ వ్యవహారంపై గులాబీ బాస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.
ఈ వార్తలు కూడా చదవండి:
రంజాన్ పండగ వేళ తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక ప్రార్థనలు..
Read Latest Telangana News and National News