Share News

‘స్వచ్ఛ సర్వేక్షణ్‌’లో జీహెచ్‌ఎంసీకి జాతీయ అవార్డు

ABN , Publish Date - Nov 12 , 2026 | 06:04 AM

పారిశుద్ధ్య నిర్వహణలో గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ)కు జాతీయ స్థాయి గుర్తింపు లభించింది.

‘స్వచ్ఛ సర్వేక్షణ్‌’లో జీహెచ్‌ఎంసీకి జాతీయ అవార్డు
Ponnam Prabhakar

  • పారిశుద్ధ్య నిర్వహణ, పట్టణ సేవల్లో అరుదైన గుర్తింపు

  • రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకున్న మంత్రి పొన్నం

న్యూఢిల్లీ, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): పారిశుద్ధ్య నిర్వహణలో గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ)కు జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. నగరంలో పరిశుభ్రత, మెరుగైన పట్టణ సేవలందించడంలో కనబరిచిన ఉత్తమ పనితీరుకు ప్రతిష్ఠాత్మక ‘స్వచ్ఛ సర్వేక్షణ్‌ 2025-26’ జాతీయ పురస్కారాన్ని దక్కించుకుంది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో బుధవారం న్యూఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా హైదరాబాద్‌ ఇన్‌చార్జ్‌ మంత్రి పొన్నం ప్రభాకర్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్వీ కర్ణన్‌, హెచ్‌ఎండీఏ కమిషనర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ ఈ పురస్కారాన్ని అందుకున్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌ పోటీల్లో దేశవ్యాప్తంగా వందలాది నగరాలు పోటీ పడగా, గ్రేటర్‌ హైదరాబాద్‌ తనదైన ముద్ర వేసింది. ఈ ఏడాది ఏప్రిల్‌, మే నెలల్లో హైదరాబాద్‌ జంట నగరాల్లో థర్డ్‌ పార్టీ ద్వారా క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహించారు. మొత్తం 10,500 మార్కుల ప్రతిపాదికన పది ప్రధాన విభాగాల్లో నగరాల పనితీరును అంచనా వేశారు. పారిశుద్ధ్య నిర్వహణ, చెత్త సేకరణ, ఘన వ్యర్థాల శుద్ధి, మురుగునీటి నిర్వహణ, పరిశుభ్రత, ప్రజల భాగస్వామ్యం వంటి ప్రధాన అంశాల ఆధారంగా నిర్వహించిన మూల్యాంకనంలో జీహెచ్‌ఎంసీ ఉత్తమ పనితీరును ప్రదర్శించింది. ఇటు స్వచ్ఛ షెహర్‌ జోడీ కార్యక్రమంలో భాగంగా మంథని, చేర్యాల మునిసిపాలిటీలకు జీహెచ్‌ఎంసీ మెంటార్‌ సిటీగా వ్యవహరిస్తోంది. ఈ మేరకు ఆయా మునిసిపాలిటీలతో అవగాహన ఒప్పందాలు చేసుకొని పారిశుద్ధ్య ప్రమాణాలు మెరుగుపరిచేందుకు శిక్షణ కార్యక్రమాలు, సామర్థ్య పెంపు వర్క్‌షా్‌పలు నిర్వహించింది. కాగా, స్వచ్ఛ సర్వేక్షణ్‌లో జీహెచ్‌ఎంసీకి జాతీయ అవార్డు దక్కడం హైదరాబాద్‌ ప్రజలకు, అధికారులకు, పారిశుద్ధ్య కార్మికులకు గర్వకారణమని మంత్రి పొన్నం అన్నారు. నగరాన్ని మరింత పరిశుభ్రంగా, సుందరంగా తీర్చిదిద్దేందుకు ఈ గుర్తింపు మరింత ప్రోత్సాహాన్నిస్తుందని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి..

వివాహేతర బంధంపై అభ్యంతరం.. ప్రియుడితో కలిసి కుమారుడిని చంపిన తల్లి

దీపావళి వస్తేనే కాలుష్యం గుర్తుకొస్తోందా.. సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక వ్యాఖ్యలు

Updated Date - Nov 12 , 2026 | 06:05 AM