Share News

మాస్టర్‌ ప్లాన్‌ సిద్ధం!

ABN , Publish Date - Nov 10 , 2026 | 04:30 AM

అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యంత ఆధునిక నగరంగా రూపుదిద్దుకోనున్న ‘ఫ్యూచర్‌ సిటీ’ మాస్టర్‌ ప్లాన్‌ సిద్ధమైంది.

మాస్టర్‌ ప్లాన్‌ సిద్ధం!
Future City Hyderabad

  • అంతర్జాతీయ హంగులతో ఫ్యూచర్‌ సిటీ

  • 71 గ్రామాలు, 1.80 లక్షల ఎకరాల్లో అభివృద్ధి

  • పర్యావరణ పరిరక్షణకు పెద్ద పీట

  • ప్లాన్‌ సిద్ధం చేసిన సింగపూర్‌ సంస్థ

  • తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌లో ఆవిష్కరణ

  • జోన్లవారీగా భూకేటాయింపులపై స్పష్టత

  • లైఫ్‌సైన్సెస్‌ హబ్‌కు 4,000 ఎకరాలు,

  • నివాస ప్రాంతాలకు 2,477 ఎకరాలు

హైదరాబాద్‌, నవంబరు9 (ఆంధ్రజ్యోతి): అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యంత ఆధునిక నగరంగా రూపుదిద్దుకోనున్న ‘ఫ్యూచర్‌ సిటీ’ మాస్టర్‌ ప్లాన్‌ సిద్ధమైంది. సింగపూర్‌కు చెందిన ‘డీపీ ఆర్కిటెక్ట్స్‌’ ఈ బృహత్తర ప్రణాళికను రూపొందించింది. 7 మండలాలు, 71 రెవెన్యూ గ్రామాలు, 867 చదరపు కిలోమీటర్ల పరిధిలో.. 1.80 లక్షల ఎకరాల విస్తీర్ణంతో ఫ్యూచర్‌ సిటీ రూపుదిద్దుకోనుంది. త్వరలో జరిగే గ్లోబల్‌ సమ్మిట్‌లో దీన్ని ఆవిష్కరించనున్నట్టు సమాచారం. నగర అస్తవ్యస్త విస్తరణకు చెక్‌ పెడుతూ, పర్యావరణ సమతుల్యతను కాపాడుతూ, ఫ్యూచర్‌ సిటీ డెవల్‌పమెంట్‌ అథారిటీ (ఎఫ్‌సీడీసీ- దక్షిణ హైదరాబాద్‌) పరిధిలో సమగ్ర అభివృద్ధికి వీలుగా మాస్టర్‌ ప్లాన్‌ను రూపొందించినట్లు పురపాలక శాఖ అధికారులు తెలిపారు. ఎఫ్‌సీడీఏ మాస్టర్‌ ప్లాన్‌లో ప్రధానంగా ఐదు అంశాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. భూ వినియోగ ప్రణాళిక కింద.. వ్యవసాయం, నివాస, పారిశ్రామిక, వాణిజ్య, పర్యావరణ పరిరక్షణ ప్రాంతాలను స్పష్టంగా విభజిస్తారు. సమతుల్య అభివృద్ధి కింద పరిశ్రమలు, పెట్టుబడులకు ప్రాధాన్యం ఇస్తూనే.. ఉద్యోగుల నివాసాలు, విద్య, వైద్యం, సామాజిక వసతుల కల్పన చేపడతారు. పర్యావరణ పరిరక్షణ కోసం..సహజ నీటి వనరులు, పచ్చదనానికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు.


2047 నాటికి పెరిగే జనాభా, పారిశ్రామిక, రవాణా అవసరాలకు అనుగుణంగా నగర విస్తరణకు వీలు కల్పించేలా ఈ ప్రణాళికలో దృష్టి పెట్టినట్లు సమాచారం. అలాగే, ఫ్యూచర్‌ సిటీ మాస్టర్‌ ప్లాన్‌లో.. రోడ్ల అనుసంధానతకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డు, ప్రతిపాదితరేడియల్‌ రోడ్లు, రీజినల్‌ రింగ్‌రోడ్డు, జాతీయ రహదారులు, గ్రామీణ రహదారులను అనుసంధానించే ప్రతిపాదనలున్నాయి. అంతర్గత రవాణా, లాజిస్టిక్స్‌ వ్యవస్థలను అనుసంధానించడం మాస్టర్‌ప్లాన్‌లో కీలక అంశంగా ఉంది. ఫ్యూచర్‌ సిటీ అభివృద్ధికి సంబంధించి పర్యావరణ అనుమతులపై నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌లో పిటిషన్‌ దాఖలైంది. దీంతో.. మాస్టర్‌ ప్లాన్‌లో చెరువులు, నాలాలు, అటవీ ప్రాంతాలు, సహజ జలవనరుల పరిరక్షణకు స్పష్టమైన మార్గదర్శకాలు ఉండాల్సిన అవసరం ఉందని ఎఫ్‌సీడీఏ గుర్తించింది. దీంతో పారిశ్రామిక అభివృద్ధి, పట్టణీకరణ కారణంగా స్థానిక గ్రామాలు, పరిసర ప్రాంతాలపై పర్యావరణ ప్రభావం పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకునేలా మాస్టర్‌ప్లాన్‌ రూపొందించారు.

ప్రత్యేక జోన్లు.. కేటాయింపులు..

ఫ్యూచర్‌సిటీలో అత్యధికంగా లైఫ్‌ సైన్సెస్‌ హబ్‌ కోసం 4,000 ఎకరాలను ప్రతిపాదించారు. నివాస ప్రాంతాలకు 2,477 ఎకరాలు కేటాయించారు. అయితే, మాస్టర్‌ ప్లాన్‌లో తమ భూములను ఏ జోన్‌ పరిధిలో పెడతారోనన్న ఆందోళన రైతులు, భూ యజమానులు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల్లో నెలకొంది. రైతుల హక్కులు, భూ సేకరణ, పరిహారం, పర్యావరణ పరిరక్షణ అంశాలకు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని అధికారులు భావిస్తున్నారు.

ప్యూచర్ సిటీలో భూములు కేటాయింపులు ఇలా...

జోన్ విస్తీర్ణం (ఎకరాల్లో)

లైఫ్ సైన్సెస్ హబ్ 4,000

నివాస ప్రాంతాలు 2,477

విద్యుత్తు వాహనాలు,

ఎనర్జీ పార్కులు 1,976

హెల్త్‌ సిటీ 594

ఏఐ సిటీ 403

డేటా సెంటర్‌ హబ్‌ 313

ఎడ్యుకేషన్‌ హబ్‌ 255


ఇవి కూడా చదవండి..

బిహార్ ఎమ్మెల్యే కూతురి పెళ్లికి 4 లక్షల మంది.. ప్రధాని మోదీకీ ఆహ్వానం!

ప్రపంచంలోనే అత్యంత కలుషిత నగరాల్లో యూపీ పట్టణం లోనీ

Updated Date - Nov 10 , 2026 | 04:41 AM