Share News

నాదీ భరోసా!

ABN , Publish Date - Oct 30 , 2026 | 02:11 AM

‘‘తెలంగాణలో పెట్టే ప్రతి రూపాయి పెట్టుబడికీ పూర్తి భద్రత కల్పిస్తాం. పారిశ్రామికవేత్తలకు మా ప్రభుత్వం పూర్తి మద్దతుగా నిలుస్తుంది.

నాదీ భరోసా!
CM Revanth Reddy

rv9.jpg

  • ప్రతి రూపాయి పెట్టుబడికీ భద్రత నా బాధ్యత

  • మీ పెట్టుబడులకు సంరక్షకుడిగా ఉంటాను

  • వ్యాపార వృద్ధి, లాభాల అంచనాలను రెట్టింపు చేసుకోవడానికి పెట్టుబడినీ రెట్టింపు చేయండి

  • తెలంగాణ రైజింగ్‌లో భాగస్వాములు కండి

  • విధానపరమైన మార్పులు సహా పెట్టుబడిదారులకు కావాల్సినవన్నీ అందిస్తాం

  • మీకున్న అడ్డంకుల్ని తొలగించడమే నా బాధ్యత

  • మీరూ మేము కలిస్తే చరిత్ర సృష్టించగలం

  • అభివృద్ధిలో కేంద్రం మాకు సహకరిస్తోంది

  • ‘ఇన్వెస్ట్‌ తెలంగాణ’ సన్నాహక సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి

న్యూఢిల్లీ, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): ‘‘తెలంగాణలో పెట్టే ప్రతి రూపాయి పెట్టుబడికీ పూర్తి భద్రత కల్పిస్తాం. పారిశ్రామికవేత్తలకు మా ప్రభుత్వం పూర్తి మద్దతుగా నిలుస్తుంది. రాష్ట్రంలో పెట్టే ప్రతి పెట్టుబడికీ నాది భరోసా’’ అని సీఎం రేవంత్‌ హామీ ఇచ్చారు.తెలంగాణ రైజింగ్‌లో భాగస్వాములు కావాలని అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. మీ పెట్టుబడులకు సంరక్షకుడిగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఫ్యూచర్‌సిటీలో డిసెంబరు 7, 8, 9 తేదీల్లో నిర్వహించనున్న ‘ఇన్వెస్ట్‌ తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌-2026’ సన్నాహక కార్యక్రమాన్ని గురువారం ఢిల్లీలో నిర్వహించారు. కార్యక్రమానికి కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడారు. ‘‘మీ ఎదుట సుదీర్ఘ ప్రసంగం చేయడానికి నేను రాలేదు. మీ అభిప్రాయాలు తెలుసుకోవడానికి వచ్చాను. వ్యాపార, వాణిజ్య రంగంలో పారిశ్రామికవేత్తలకు మాకంటే ఎక్కువ అనుభవం ఉంది. వారి నుంచి నేర్చుకుని, సూచనలను అర్థం చేసుకుని అమలు చేసేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. తెలంగాణలో ఎంత పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్నారో తుది నిర్ణయం తీసుకోండి. వ్యాపార వృద్ధి, లాభాల అంచనాలను రెట్టింపు చేసుకోవడానికి మీ పెట్టుబడులను కూడా రెట్టింపు చేయండి’’ అని వ్యాఖ్యానించారు.


పారిశ్రామికవేత్తలు తమ లక్ష్యాలను చేరుకోవడానికి ప్రభుత్వం నుంచి ఏం కావాలో చెప్పాలని, విధానపరమైన మార్పుల నుంచి అవసరమైన సహకారం వరకు అన్నింటినీ అందించేందుకు వ్యక్తిగతంగా తాను బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు. పారిశ్రామికవేత్తలు విజయాలు సాధించే మార్గంలో ఉన్న అడ్డంకులను తొలగించడమే తన బాధ్యతని తెలిపారు. ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు నగరాలతో హైదరాబాద్‌ పోటీ పడడం లేదని, న్యూయార్క్‌, లండన్‌, టోక్యో, సియోల్‌, దుబాయ్‌ వంటి ప్రపంచ నగరాలతోనే పోటీ పడుతోందని చెప్పారు. ప్రపంచస్థాయి ఆలోచనలు, మెరుగైన విధానపరమైన సూచనలను పారిశ్రామికవేత్తలు అందించాలని కోరారు. వారి సూచనలను ప్రభుత్వ విధానాల్లోకి తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ‘‘ప్రగతి పథంలో తెలంగాణ ముందుకు సాగుతోంది. ఈ ప్రయాణంలో ప్రపంచ పెట్టుబడిదారులు భాగస్వాములు కావాలి. అంతా కలిసి ముందుకు సాగితే చరిత్ర సృష్టించగలం’’ అని ఆశాభావం వ్యక్తం చేశారు.

కేంద్రంతో కలిసి రాష్ట్రాభివృద్ధి

కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై పెట్టుబడిదారులకు సందేహాలు ఉండొచ్చని, అయితే, అభివృద్ధి విషయంలో రాజకీయాలకు తావు లేదని సీఎం రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ ముఖ్య అతిథిగా హాజరుకావడమే ఇందుకు నిదర్శనమని అన్నారు. దేశంలో ఏడు హైస్పీడ్‌ రైలు కారిడార్ల ఏర్పాటుకు కేంద్రం నిర్ణయించగా, వాటిలో హైదరాబాద్‌ నుంచి చెన్నై, బెంగళూరు, పుణెకు మూడు కారిడార్లు రాష్ట్రానికి కేటాయించారని, వరంగల్‌, ఆదిలాబాద్‌లలో కొత్త విమానాశ్రయాల ఏర్పాటుకు కూడా కేంద్రం సహకరిస్తోందని వివరించారు. రీజినల్‌ రింగ్‌ రోడ్డు, మెట్రో రైలు విస్తరణ, నేవీ లో ఫ్రీక్వెన్సీ రాడార్‌ స్టేషన్‌తోపాటు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో కేంద్రం నుంచి సహకారం అందుతోందని సీఎం తెలిపారు. దేశాభివృద్ధి, ప్రజాసేవ విషయంలో రాజకీయాలకు అతీతంగా కలిసి పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. అభివృద్ధి విషయంలో ప్రభుత్వ అతి జోక్యానికి బదులు సమర్థ పాలన అవసరమని అభిప్రాయపడ్డారు.


రాజీవ్‌ గాంధీ, పీవీల సంస్కరణలే పునాది

ప్రపంచంలోనే మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు భారత్‌ సిద్ధమవుతున్న తరుణంలో దేశాభివృద్ధికి బాటలు వేసిన నాయకులను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. యువ ప్రధాన మంత్రి రాజీవ్‌ గాంధీ కంప్యూటర్‌, టెలికం రంగాల్లో తీసుకొచ్చిన మార్పులు దేశ ప్రగతికి పునాది వేశాయని కొనియాడారు. నేడు ఫోన్‌, ఇంటర్నెట్‌ లేని జీవితం ఊహించలేని పరిస్థితి ఏర్పడిందంటే అందుకు ఆనాటి ఆయన సంస్కరణలే కారణమన్నారు. రాజీవ్‌ గాంధీ హైదరాబాద్‌లో పైలట్‌ శిక్షణ పొందారని, అందుకే హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆయన పేరు పెట్టామని గుర్తు చేశారు. ఇక, దేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సమయంలో ప్రధానిగా పీవీ నరసింహారావు కీలక సంస్కరణలు తీసుకొచ్చారని, సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ విధానాలతో దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త దిశ చూపారని సీఎం రేవంత్‌ కొనియాడారు. హైదరాబాద్‌ జీవన విధానంలోనే ప్రపంచ దృక్పథం ఉందని, సంస్కరణలు, పారిశ్రామిక అభివృద్ధి, వ్యాపార స్ఫూర్తి తెలంగాణ ప్రజల జీవన విధానంలో భాగమని అన్నారు. హైదరాబాద్‌కు 400 ఏళ్ల కిందటే ప్రపంచ నగరంగా గుర్తింపు ఉందని, ప్రపంచీకరణ అనే మాట ప్రాచుర్యంలోకి రాకముందే అనేక దేశాల నుంచి వ్యాపారులు వచ్చి చార్మినార్‌ పరిసరాల్లో ముత్యాలు, సుగంధ ద్రవ్యాలు, నఖాసీ వస్తువుల వ్యాపారం చేశారని గుర్తు చేశారు. 1991 నుంచి వివిధ రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్నప్పటికీ, హైదరాబాద్‌లో పెట్టుబడులకు అన్ని ప్రభుత్వాలు తమ వంతు సహకారం అందించాయని వ్యాఖ్యానించారు.


హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌లో చదువుకున్న సత్య నాదెళ్ల (మైక్రోసాఫ్ట్‌), అజయ్‌ బంగా (ప్రపంచ బ్యాంకు), శంతను నారాయణ్‌ (అడోబ్‌), ప్రేమ్‌ వత్స వంటి వారు ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందారని పేర్కొన్నారు. ప్రపంచ పెట్టుబడులను ఆకర్షించడంతోపాటు అంతర్జాతీయ స్థాయి ప్రతిభావంతులను అందించడంలో హైదరాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, వాకిటి శ్రీహరి, వివేక్‌, ఎంపీలు అభిషేక్‌ మను సింఘ్వీ, రేణుకా చౌదరి, డాక్టర్‌ మల్లు రవి, వేం నరేందర్‌ రెడ్డి, చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి, బలరాం నాయక్‌, సురేశ్‌ షెట్కార్‌, రామసహాయం రఘురాంరెడ్డి, అనిల్‌కుమార్‌ యాదవ్‌, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏపీ జితేందర్‌ రెడ్డి, సీఎస్‌ సంజయ్‌ జాజు, అంతర్జాతీయ స్థాయి పారిశ్రామికవేత్తలు, విధాన నిర్ణేతలు, అధికారులు పాల్గొన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

ఉత్తర్‌ప్రదేశ్‌లో సంచలనం.. ఇంట్లో పాతిపెట్టిన మూడు డ్రమ్ముల్లో భారీగా నగదు..!

ఢిల్లీ టీటీడీలో వైభవంగా ప్రారంభమైన వార్షిక పవిత్రోత్సవాలు

Updated Date - Oct 30 , 2026 | 02:13 AM