Share News

30లక్షల బోర్లు ఉంటే.. 6 లక్షల బోర్లు ఎండిపోయాయి

ABN , Publish Date - Oct 23 , 2026 | 04:21 AM

ఎల్‌నినోప్రపంచ విపత్తు అని, దీని ప్రభావం దక్షిణాది రాష్ట్రాలపై ఎక్కువగా ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.

30లక్షల బోర్లు ఉంటే.. 6 లక్షల బోర్లు ఎండిపోయాయి
tummala nageshwarrao

  • 30లక్షల బోర్లు ఉంటే.. 6 లక్షల బోర్లు ఎండిపోయాయి

  • ఎల్‌నినో అనేది ప్రపంచ విపత్తు తక్కువ నీటితో పండే పంటలేవేయాలి: మంత్రి తుమ్మల

  • నవంబరు 30దాకా ఖేత్‌ బచావో అభియాన్‌

హైదరాబాద్‌/రాజేంద్రనగర్‌, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో ప్రపంచ విపత్తు అని, దీని ప్రభావం దక్షిణాది రాష్ట్రాలపై ఎక్కువగా ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. తెలంగాణలో 30లక్షల బోర్లు ఉండగా, 6 లక్షల బోర్లు ఎండిపోయాయన్నారు. వచ్చే సీజన్‌లో తక్కువ నీటితో పండే పంటలే వేసుకోవాలని రైతులకు సూచించారు. పంట వేసి నష్టపోయే కంటే.. పంట వేయకుండా ఉండడమే మంచిదని అభిప్రాయపడ్డారు. రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ వర్సిటీలో గురువారం ఖేత్‌ బచావో అభియాన్‌(సాగు భూమి సంరక్షణ), ‘రైతు పొలాల్లోకి ఆవిష్కరణలు’ కార్యక్రమాలను గురువారం ఆయన ప్రారంభించారు. అంతకుముందు రైతు నేస్తం కార్యక్రమంలో ఖేత్‌ బచావో అభియాన్‌ గురించి రైతులకు వివరించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో నవంబరు 30 వరకు ఖేత్‌ బచావో అభియాన్‌ను అమలు చేయనున్నట్లు తెలిపారు. నేల తల్లిని సంరక్షించుకుంటేనే భవిష్యత్‌ తరాలకు ఆహార భద్రత ఉంటుందని అభిప్రాయపడ్డారు. నేల ఆరోగ్యం పాడైతే ఆశించిన దిగుబడులు రావని, ఆహార ధాన్యాల నాణ్యత కూడా దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తంచేశారు. రసాయన ఎరువులు, పురుగుల మందుల వాడకం తగ్గించాలని, ప్రతి రైతు భూసార పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. సాంకేతి పరిజ్ఞానం, యంత్రాల వాడకంతో రైతుల శ్రమ, పెట్టుబడి తగ్గుతుందన్నారు. అర్హులైన రైతులతోపాటు రైతు ఉత్పత్తిదారుల సంఘాలుఎఫ్ పీవో)లకూ వ్యవసాయ పనిముట్లు అందజేస్తామని తెలిపారు.


పరిశోధన కేంద్రాల్లో శాస్త్రవేత్తలు చేపడుతున్న పరిశోధనలను నేరుగా రైతు పొలాల్లోకి తీసుకెళ్లాలన్న ఆలోచన ప్రశంసనీయమన్నారు. వ్యవసాయ వర్సిటీ వీసీ అల్దాస్‌ జానయ్య మాట్లాడుతూ పరిశోధన ఫలితాలను నేరుగా రైతుల పొలాల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించామన్నారు. మొదటి విడతలో 50, రెండో విడతలో 50 గ్రామాల చొప్పున అమలు చేస్తామని, ఒక్కో శాస్త్రవేత్త 25 మంది రైతులకు అవగాహన కల్పిస్తారని చెప్పారు.

పత్తి కొనుగోళ్లు వెంటనే ప్రారంభించాలి

ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించిన పత్తి కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో మార్కెటింగ్‌ శాఖ అధికారులతో పత్తి సాగు, ఉత్పత్తి, మార్కెట్‌ ధరలు, సీసీఐ ఏర్పాట్లపై ఆయన సమీక్షించారు. నిరుడు 28.33 లక్షల టన్నుల పత్తి రాగా, ఈసారి 29.43 లక్షల టన్నుల పత్తి వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. పత్తి మద్దతు ధర క్వింటాల్‌కు రూ.8,667గా ఉంటే... మార్కెట్‌లో రూ.9 వేలపైగా ధర పలకడం శుభపరిణామమన్నారు. రాష్ట్రంలో 356 జిన్నింగ్‌ మిల్లులు ఉంటే.. 335మిల్లులను సీసీఐ కేంద్రాలుగా నోటిఫై చేసినట్లు తెలిపారు. పత్తి కొనుగోళ్లపై రాష్ట్ర, జిల్లా స్థాయి పర్యవేక్షణ కమిటీలు ఎప్పటికప్పుడు ధరలు, కొనుగోళ్ల పురోగతిని పర్యవేక్షిస్తాయని తెలిపారు. పత్తి రైతులకు సమాచారం అందించేందుకు 18005995779 టోల్‌ ఫ్రీ నంబర్‌, 8897281111 వాట్సాప్‌ నంబర్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు.

ఈ వార్తలు కూడా చదవండి

ఓటు హక్కు తొలగింపు చిన్న విషయమా?

భారత టెలికాంపై బడా గుత్తాధిపత్యం!

Updated Date - Oct 23 , 2026 | 04:27 AM