విశాఖ వైసీపీ నేత విజయ ప్రసాద్‌పై ఈడీ ఫోకస్.. ఐదు చోట్ల ఏకకాలంలో దాడులు
ABN , Publish Date - Aug 05 , 2026 | 09:45 AM
హైదరాబాద్‌లో ఈడీ అధికారుల సోదాలు కలకలం రేపుతున్నాయి. వైసీపీ నేత మళ్ల విజయప్రసాద్ ఇళ్లు, ఆఫీసులపై ఈడీ అధికారులు దాడులు నిర్వహించారు. హైదరాబాద్, విశాఖలో ఐదు చోట్ల ఏకకాలంలో సోదాలు కొనసాగుతున్నాయి.
హైదరాబాద్, ఆగస్టు 5: నగరంలో ఈడీ అధికారుల సోదాలు కలకలం రేపుతున్నాయి. వైసీపీ నేత, వెల్ఫేర్ గ్రూప్ ఆఫ్ కంపెనీ చైర్మన్ మళ్ల విజయప్రసాద్ ఇళ్లు, ఆఫీసులపై ఈడీ అధికారులు దాడులు నిర్వహించారు. హైదరాబాద్, విశాఖలో ఐదు చోట్ల ఏకకాలంలో సోదాలు కొనసాగుతున్నాయి. విజయప్రసాద్ ఇంట్లో బిహార్‌కు చెందిన ఈడీ బృందం సోదాలు చేస్తోంది. వెల్ఫేర్ గ్రూప్ ఆఫ్ కంపెనీల చైర్మన్‌గా అవకతవకలకు పాల్పడిన కేసులో ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. 2019లో విశాఖపట్నం పశ్చిమ నుంచి వైసీపీ అభ్యర్థిగా విజయ ప్రసాద్ పోటీ చేశారు. 2021 అప్పటి ప్రభుత్వంలో ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా పనిచేశారు. 2024 నుంచి వైసీపీ విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్తగా విజయ ప్రసాద్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
వెల్ఫేర్ గ్రూప్ ఆఫ్ కంపెనీలపై క్రిమినల్ కేసులు
వెల్ఫేర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌పై పలు క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయి. విశాఖలోని నాలుగు పోలీస్ స్టేషన్లలో ఎఫ్ఐఆర్లు నమోదు అయ్యాయి. అలాగే దువ్వాడ, ద్వారకా, గోపాలపట్నం, టూ టౌన్ పీఎస్‌లలోనూ కేసులు ఫైల్ అయ్యాయి. జనాల నుంచి వివిధ స్కీముల పేరుతో పెద్ద ఎత్తున డబ్బులను వెల్ఫేర్ గ్రూప్స్ వసూలు చేసింది. స్వర్ణ వికాస్, స్వర్ణలక్ష్మీ, ఎంఐఎస్ లాంటి పలు స్కీమ్‌ల పేరుతో జనాల నుంచి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసిన వెల్ఫేర్ గ్రూప్స్.. మెచ్యూరిటీ తర్వాత పెట్టుబడిదారులకు డబ్బులు చెల్లించకుండా మోసం చేసింది. వెల్ఫేర్ గ్రూప్స్ తీరుతో మోసపోయిన వేలాదిమంది.. వివిధ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. ఐపీసీ 406, 120-Bతో పాటు BUDS చట్టం కింద కేసులు నమోదు అయ్యాయి.
ఇప్పటికే అక్రమ డిపాజిట్ పథకాలపై పోలీసులు దర్యాప్తును వేగవంతం చేసిన విషయం తెలిసిందే. 2007 నుంచి 2018 మధ్య సుమారు రూ.3,041 కోట్లు వెల్ఫేర్ గ్రూప్స్ సమీకరించినట్లు పోలీసుల విచారణలో బయటపడింది. సమీకరించిన డబ్బులను రియల్ ఎస్టేట్, మీడియా, ఇతర వ్యాపారాలకు మళ్లించారన్న ఆరోపణలూ ఉన్నాయి. వివిధ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుల ఆధారంగా ఈడీ అధికారులు రంగంలోకి దిగారు. వెల్ఫేర్ గ్రూప్ డైరెక్టర్ల పాత్రపై ఈడీ ముమ్మర దర్యాప్తు చేపట్టింది. ఈ క్రమంలోనే ఈరోజు విజయ ప్రసాద్ సహా డైరెక్టర్ల ఇళ్లు, కార్యాలయాల్లో ఈడీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు.
ఇవి కూడా చదవండి...
ఆదోనిలో చిరుత సంచారం.. భయాందోళనలో గ్రామస్థులు
Read Latest Telangana News And Telugu News