పాత వీడియోతో తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. కేటీఆర్ వ్యాఖ్యలకు ఎంపీ అర్వింద్ కౌంటర్
ABN , Publish Date - Oct 24 , 2026 | 08:15 PM
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ కుటుంబ చరిత్రపై తీవ్ర విమర్శలు చేసిన ఆయన.. ముస్లిం మైనారిటీలతో మాట్లాడిన తన పాత వీడియోను వైరల్ చేస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.
నిజామాబాద్, అక్టోబర్ 24: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ తీవ్రంగా స్పందించారు. కేటీఆర్ కుటుంబ చరిత్ర హీనమైనదని విమర్శించారు. ఆ కుటుంబం దోపిడీలు.. హత్యలకు పాల్పడిందని ఆరోపించారు. తనపై కూడా హత్యాయత్నం జరిగిందని అర్వింద్ పేర్కొన్నారు. రాజకీయంగా తనను ఎదుర్కొనే క్రమంలో గతంలో తాను మాట్లాడిన మాటలను వక్రీకరించి ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ముఖ్యంగా ముస్లిం మైనారిటీలతో తాను మాట్లాడిన పాత వీడియోను ప్రస్తుతం వైరల్ చేస్తూ ప్రజల్లో అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆ వీడియోకు సంబంధించిన అంశాలపై ఆయన వివరణ ఇచ్చారు.
2024 ఎన్నికల సమయంలో ముస్లిం మైనారిటీలతో మాట్లాడిన మాటలను ప్రస్తావించిన అర్వింద్.. కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న ముస్లింలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మద్దతు ఇవ్వాలని తాను సూచించినట్లు తెలిపారు. అదే సమయంలో, వారు తనకు ఓటు వేసినా, వేయకపోయినా నిజామాబాద్‌లో తానే విజయం సాధిస్తానని చెప్పినట్లు వివరించారు. అయితే.. ఎవరికి ఓటు వేసినా బీజేపీనే గెలుస్తుందని తాను అన్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు. తన వ్యాఖ్యల వెనుక ఉన్న సందర్భాన్ని పక్కనపెట్టి.. పాత వీడియోను వైరల్ చేయడం ద్వారా తనపై విమర్శలు చేస్తున్నారని అర్వింద్ ఆరోపించారు. కేటీఆర్ వ్యాఖ్యలకు సమాధానంగా ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు నిజామాబాద్ రాజకీయాల్లో చర్చకు దారితీశాయి.
ఇవి కూడా చదవండి..
బొత్స చైతన్యపై జనసేన ఫిర్యాదు.. జెడ్పీటీసీ నామినేషన్‌పై అభ్యంతరం
స్థానిక ఎన్నికలను ఆపేందుకు 59 పిటిషన్లు.. వైసీపీపై సీఎం చంద్రబాబు ఆగ్రహం
Read Latest AP News And Telugu News