Share News

హస్తం హవా!

ABN , Publish Date - Feb 12 , 2026 | 03:14 AM

రాష్ట్రంలో మునిసిపాలిటీలపైనా కాంగ్రెస్‌ జెండా ఎగిరే అవకాశం కనిపిస్తోంది. పంచాయతీ ఎన్నికల్లో మెజారిటీ సర్పంచ్‌ స్థానాలను దక్కించుకుని గ్రామీణ తెలంగాణపై పట్టు సాధించిన అధికార పార్టీ..

హస్తం హవా!

  • 70 శాతం మునిసిపాలిటీల్లో కాంగ్రెస్‌ ఆధిక్యానికి అవకాశం

  • 7 కార్పొరేషన్లలో 5 కాంగ్రెస్‌ ఖాతాలోకే!

  • కరీంనగర్‌, నిజామాబాద్‌లో

  • బీజేపీకి లభించనున్న మెజారిటీ?

  • ఈ ఎన్నికల్లోనూ కారు జోరు అంతంతే

  • ఉమ్మడి మెదక్‌లో మాత్రమే స్వల్ప ఆధిపత్యం

  • కేసీఆర్‌ ఇలాకా గజ్వేల్‌లోనూ క్లిష్టమే

  • సిరిసిల్లలో ఎగరనున్న గులాబీ జెండా!

హైదరాబాద్‌, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మునిసిపాలిటీలపైనా కాంగ్రెస్‌ జెండా ఎగిరే అవకాశం కనిపిస్తోంది. పంచాయతీ ఎన్నికల్లో మెజారిటీ సర్పంచ్‌ స్థానాలను దక్కించుకుని గ్రామీణ తెలంగాణపై పట్టు సాధించిన అధికార పార్టీ.. మునిసిపల్‌ ఎన్నికల్లోనూ అదే జోరు కొనసాగించే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. క్షేత్ర స్థాయి పరిశీలన ప్రకారం.. 70 శాతానికి చేరువలో మునిసిపాలిటీలు, 5 కార్పొరేషన్లలో హస్తం పార్టీకి స్పష్టమైన ఆధిక్యం లభించే అవకాశాలున్నాయి. ఇక మిగిలిన మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో ప్రత్యర్థి పార్టీలతో కాంగ్రె్‌సకు గట్టిపోటీ ఎదురుకానున్నట్లు తెలుస్తోంది. కాగా, రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్‌ఎ్‌సకు.. ఈ ఎన్నికల్లోనూ ఆశించిన ఫలితాలు దక్కకపోవచ్చని అంచనాలు చెబుతున్నాయి. గత మునిసిపల్‌ ఎన్నికల్లో దాదాపు 95 శాతానికి పైగా సీట్లు దక్కించుకున్న గులాబీ పార్టీ.. ఈసారి మాత్రం ఉమ్మడి మెదక్‌ జిల్లా వరకే తన పట్టు కాస్త నిలుపుకోగలిగింది. అయితే ఈ జిల్లాలోనూ మాజీ సీఎం కేసీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోని గజ్వేల్‌ మునిసిపాలిటీలో ఆ పార్టీ ఆశించిన స్థాయిలో ఫలితాలు వచ్చే సూచనలు కనిపించడంలేదు. ఇక ఎన్నికలు జరిగిన ఏడు కార్పొరేషన్లలో అన్ని చోట్లా బీఆర్‌ఎ్‌సకు ఆశాజనకమైన ఫలితాలు రాకపోవచ్చని తెలుస్తోంది. వీటిలో మూడు కార్పొరేషన్లలోనైతే పార్టీ ఉనికి నామమాత్రమే కానుందని స్పష్టమవుతోంది. కాగా, ఉత్తర తెలంగాణలోని కార్పొరేషన్లు, మునిసిపాలిటీలను పక్కాగా దక్కించుకోవాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన బీజేపీ.. ఈ ప్రాంతంలోని రెండు కార్పొరేషన్లలో అధికార కాంగ్రె్‌సకు నువ్వా? నేనా? అన్నట్లుగా గట్టిపోటీనిచ్చింది.


కాంగ్రెస్‌ స్పష్టమైన ఆధిపత్యం..

రాష్ట్ర వ్యాప్తంగా 116 మునిసిపాలిటీల్లో ఎన్నికలు జరగగా.. వీటిలో 70 శాతం మునిసిపాలిటీలను కాంగ్రెస్‌ పూర్తి ఆధిక్యంతో దక్కించుకునే అవకాశం కనిపిస్తోంది. మరో 20 శాతం మునిసిపాలిటీల్లో ప్రత్యర్థి పార్టీలతో గట్టిపోటీ నెలకొన్నా.. ఎక్స్‌ అఫీషియో ఓట్లతో వాటిలోనూ అత్యధికం కాంగ్రెస్‌ ఖాతాలోకే చేరే సూచనలు కనిపిస్తున్నాయి. కార్పొరేషన్లలో మహబూబ్‌నగర్‌, నల్లగొండ, కొత్తగూడెం, మంచిర్యాల, రామగుండం.. కాంగ్రె్‌సకు దక్కడం ఖాయమని అంచనాలు వెల్లడిస్తున్నాయి. మొత్తంగా మునిసిపల్‌ ఎన్నికలు జరిగిన ఉమ్మడి 8 జిల్లాల్లోనూ కాంగ్రెస్‌ ఆధిపత్యం ప్రదర్శించిన పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు బీజేపీకి నిజామాబాద్‌, కరీంనగర్‌ కార్పొరేషన్లలో మెజారిటీ సీట్లు వచ్చే అవకాశం ఉంది. నిజామాబాద్‌ కార్పొరేషన్‌లో మొత్తం 60 డివిజన్లు ఉంటే.. ఇందులో మ్యాజిక్‌ ఫిగర్‌ 30కి చాలా దగ్గరగా బీజేపీ రావచ్చనే అంచనాలున్నాయి. కాంగ్రె్‌సకు 20కి అటు ఇటుగా, ఎంఐఎంకు పదికి అటు ఇటుగా డివిజన్లు వచ్చే అవకాశం ఉంది. అయితే మేయర్‌ ఎన్నిక నాటికి ఎక్స్‌ అఫీషియో ఓట్లు, ఇతర సమీకరణాలు కీలకమవుతాయని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. కాగా, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఒక మునిసిపాలిటీ బీజేపీ దక్కవచ్చని అంచనాలు వెలువడుతున్నాయి.

బీఆర్‌ఎ్‌సకు కేసీఆర్‌ సొంత జిల్లాలోనే..

గత మునిసిపల్‌ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించిన బీఆర్‌ఎ్‌సకు ఈసారి ప్రతికూల ఫలితాలే వచ్చేలా కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో మొత్తం మునిసిపాలిటీలకుగాను కేవలం 8 శాతం మునిసిపాలిటీల్లోనే గులాబీ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం రావచ్చని తెలుస్తోంది. ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లలో గులాబీ జెండా ఎగరడం ఖాయమని తెలుస్తోంది. ఇక బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ సొంత జిల్లా అయిన ఉమ్మడి మెదక్‌ జిల్లాలో మూడింట చెరో వంతుగా మునిసిపాలిటీల్లో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ స్పష్టమైన ఆధిక్యత సాధించే అవకాశాలు ఉండగా.. మిగిలిన చోట్ల నువ్వా? నేనా? అనే పరిస్థితులు ఉన్నాయని అంచనాలు చెబుతున్నాయి.

Updated Date - Feb 12 , 2026 | 03:14 AM