Share News

శెభాష్‌.. ఇలాగే పనిచేయండి

ABN , Publish Date - Feb 20 , 2026 | 02:15 AM

తెలంగాణలో రెండేళ్ల పాలనను కాంగ్రెస్‌ అధిష్ఠానం ప్రశంసించింది. పార్టీ పనితీరుపైనా సంతృప్తి వ్యక్తం చేసింది. ప్రభుత్వం, పార్టీ సమన్వయంతో పనిచేస్తున్నాయని కితాబిచ్చింది. ఇలాగే కలిసి ముందుకెళ్లాలని సూచించింది. మున్సిపల్‌, స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించడంపై అభినందనలు తెలిపింది.....

శెభాష్‌.. ఇలాగే పనిచేయండి

  • ప్రభుత్వం-పార్టీ సమన్వయం బాగుంది.. సీఎం, మంత్రులు, పీసీసీ చీఫ్‌తో కాంగ్రెస్‌ అధిష్ఠానం

  • మునిసిపల్‌, స్థానిక సంస్థల్లో విజయంపై అభినందనలు

  • తెలంగాణలో రెండేళ్ల పాలన, పార్టీ పనితీరుపై సంతృప్తి

  • సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను వివరించిన రేవంత్‌

  • బీఆర్‌ఎస్‌ పనైపోయింది.. బీజేపీ బలహీనపడిందన్న సీఎం

  • ఆ రెండు పార్టీలను మరింతగా కట్టడి చేయండి

  • ఆరు గ్యారెంటీలతోపాటు హామీలన్నీ అమలు చేయండి

  • రేవంత్‌రెడ్డి, మహేశ్‌గౌడ్‌లకు రాహుల్‌, ఖర్గే సూచన

  • మేడారంపై జాతీయ స్థాయిలో సినిమా తీయాలి: రాహుల్‌

  • రెండు గంటలకుపైగా జరిగిన సమావేశం

  • రేవంత్‌, మహేశ్‌లతో ప్రత్యేకంగా రాహుల్‌, ఖర్గే భేటీ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో రెండేళ్ల పాలనను కాంగ్రెస్‌ అధిష్ఠానం ప్రశంసించింది. పార్టీ పనితీరుపైనా సంతృప్తి వ్యక్తం చేసింది. ప్రభుత్వం, పార్టీ సమన్వయంతో పనిచేస్తున్నాయని కితాబిచ్చింది. ఇలాగే కలిసి ముందుకెళ్లాలని సూచించింది. మున్సిపల్‌, స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించడంపై అభినందనలు తెలిపింది. 2029లో కేంద్రంలో అధికారంలోకి రావడం, పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయడంపై అధిష్ఠానం దృష్టి సారించింది. అందులో భాగంగా గురువారం ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధికారిక నివాసంలో తెలంగాణ నేతలతో ఖర్గే, రాహుల్‌ గాంధీ, కేసీ వేణుగోపాల్‌లు సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌, మంత్రులు, సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు వంశీచంద్‌రెడ్డి హాజరయ్యారు. సుమారు రెండు గంటలకు పైగా జరిగిన ఈ సమావేశంలో కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలన, పార్టీ పనితీరుపై కూలంకషంగా చర్చించారు.


తెలంగాణలో రెండేళ్ల పాలనపై ప్రజలు సంతోషంగా ఉన్నారని సీఎం రేవంత్‌రెడ్డి వివరించారు. మున్సిపల్‌, స్థానిక సంస్థల ఫలితాలే తమ పాలనకు రెఫరెండమని చెప్పారు. ‘‘తెలంగాణలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 30 లక్షలకు పైగా రేషన్‌ కార్డులు అందించాం. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి కార్డులు పంపిణీ చేశాం. అందరికీ సన్నబియ్యం అందిస్తున్నాం. ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చాం. యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ స్కూళ్లు నిర్మిస్తున్నాం. మహిళలకు ఉచిత బస్సు హామీని నెరవేర్చాం. గృహ అవసరాలకు ఉచిత విద్యుత్తు ఇస్తున్నాం. ఆరోగ్యశ్రీని రూ.10 లక్షలకు పెంచాం. ప్రపంచ స్థాయిలో ఫ్యూచర్‌ సిటీ నిర్మిస్తున్నాం. తెలంగాణ రైజింగ్‌లో భాగంగా రాష్ట్రంలోని ప్రతి నగరాన్నీ అభివృద్ధి చేసేందుకు మాస్టర్‌ ప్లాన్‌ సిద్ధం చేశాం’’ అని రేవంత్‌ వివరించారు. ప్రజలు సంతోషంగా ఉన్నారని.. అందుకే మున్సిపల్‌, స్థానిక సంస్థల ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని కట్టబెట్టారని చెప్పారు. కంటోన్మెంట్‌, జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల్లో ప్రజలు కాంగ్రె్‌సకే పట్టం కట్టారన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన ఆ రెండు స్థానాల్లో విజయం సాధించామని తెలిపారు. పాలనను ప్రజలకు మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో గ్రేటర్‌ హైదరాబాద్‌ను మూడు కార్పొరేషన్లుగా విభజించామని చెప్పారు. ‘మీ ప్రజెంటేషన్‌ బాగుంది. కానీ.. మంత్రులు, పీసీసీ చీఫ్‌ ఏమంటారు?’ అని రాహుల్‌ ప్రశ్నించినట్లు తెలిసింది. ముఖ్యమంత్రి సారథ్యంలో సమష్టిగా పనిచేస్తున్నామని మంత్రులు చెప్పగా.. ప్రభుత్వం, పార్టీ సమన్వయంతో ముందుకెళ్తున్నాయని పీసీసీ చీఫ్‌ బదులిచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

గ్యారెంటీలు, హామీలన్నీ అమలు చేయండి

ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఆరు గ్యారెంటీలు సహా హామీలన్నీ అమలు చేయాలని అధిష్ఠానం సూచించినట్లు తెలిసింది. బీఆర్‌ఎస్‌, బీజేపీ పరిస్థితి ఏంటని రాహుల్‌ అడగ్గా.. బీఆర్‌ఎస్‌ పని అయిపోయిందని, బీజేపీ గతం కంటే మరింత బలహీనపడిందని సీఎం రేవంత్‌ వివరించినట్లు సమాచారం. కరీంనగర్‌ సంగతి ఏంటని రాహుల్‌ ప్రశ్నించగా.. ఆ ఒక్క స్థానంలోనే బీజేపీ గెలిచిందని, స్థానిక పరిస్థితుల ప్రభావంతో అలా జరిగిందని సీఎం, పీసీసీ చీఫ్‌ వివరించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. బీఆర్‌ఎస్‌, బీజేపీని మరింత కట్టడి చేయాలని రాహుల్‌ సూచించినట్లు సమాచారం. 2029 ఎన్నికలపై ఇప్పటి నుంచే దృష్టి సారించాలని చెప్పినట్లు తెలిసింది. ఇలాగే ప్రభుత్వం, పార్టీ కలిసి ముందుకు వెళ్లాలని, రాబోయే మూడేళ్లలో కాంగ్రె్‌సను రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా మార్చాలని సూచించినట్లు సమాచారం. మేడారం జాతర వివరాలను అడిగిన రాహుల్‌.. వన దేవతల ప్రాశస్త్యంపై జాతీయ స్థాయిలో ఒక సినిమా తీస్తే బాగుంటుందని అన్నట్లు తెలిసింది. గిగ్‌ వర్కర్లకు న్యాయం చేసేలా రాష్ట్ర ప్రభుత్వం తీసుకురానున్న కొత్త విధానం గురించి కూడా ఆరా తీశారు. ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ అగ్రస్థానంలో నిలవడాన్ని రాహుల్‌ ప్రశంసించారు. ఇంటిగ్రేటెడ్‌ మోడల్‌ స్కూళ్ల ఆలోచన బాగుందని చెప్పారు. త్వరలో మరోసారి మంత్రులను ఢిల్లీకి పిలుస్తామని అప్పుడు వేర్వేరుగా పిలిచి మాట్లాడతామని రాహుల్‌ చెప్పినట్లు సమాచారం.


రేవంత్‌, మహేశ్‌, ఉత్తమ్‌, భట్టిలతో ప్రత్యేకంగా..

రేవంత్‌రెడ్డి, మహేశ్‌గౌడ్‌, భట్టి విక్రమార్క, ఉత్తమ్‌లతో ఖర్గే, రాహుల్‌, వేణుగోపాల్‌ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. త్వరలో జరగబోయే రాజ్యసభ ఎన్నికలు, అభ్యర్థుల ఖరారు, రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు తదితర అంశాలపై చర్చించారు. ఈ భేటీలో రాజగోపాల్‌రెడ్డి అంశంపై చర్చ జరిగినట్లు తెలిసింది. రాజగోపాల్‌ను ఢిల్లీకి పిలిచి తామే స్వయంగా మాట్లాడతామని రాహుల్‌, ఖర్గే చెప్పినట్లు సమాచారం. మంత్రుల మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నట్లు తరచూ మీడియాలో వస్తోందని, దానిపై శ్రద్ధ పెట్టాలని సూచించినట్లు తెలిసింది. అలాగే, రెండు రాజ్యసభ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపైనా చర్చ జరిగింది. ఒక స్థానంలో మళ్లీ అభిషేక్‌ సింఘ్వీకి అవకాశం ఇవ్వడంపై ఏకాభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. మరో అభ్యర్థిపై వారంలో మళ్లీ పిలుస్తామని, అప్పుడు ఖరారు చేద్దామని రాహుల్‌, ఖర్గే చెప్పినట్లు తెలిసింది. చిన్నచిన్న సమస్యలను పరిష్కరించుకుంటే పదేళ్లపాటు రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ తిరుగులేని శక్తిగా ఉంటుందని పేర్కొన్నట్లు సమాచారం.

Updated Date - Feb 20 , 2026 | 02:15 AM