ఇక సస్పెన్షనే!
ABN , Publish Date - Jun 15 , 2026 | 04:37 AM
వర్షాల సమయంలో అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు.
వర్షాల సమయంలో అలసత్వం వహిస్తే వేటు తప్పదు
ఈ నెల 9నాటి నిర్లక్ష్యానికి ఇప్పటికే సస్పెండ్ చేయాలి
అధికారులపై సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం
పనిచేయాలి కదా.. మరీ ఇంత నిర్లక్ష్యమా!
కుర్చీలోనే కూర్చుంటాం.. కదలం అంటే ఎలా?
రోడ్లపై నీళ్లు నిలవకుండా ఉండేందుకు రెండేళ్లుగా చేసిన కృషిని ఒక్క వర్షానికే వృథా చేశారు
ఆ సమయంలో ఒక్క అధికారైనా రోడ్డుపై ఉన్నారా?
మళ్లీ ఇలాంటివి జరగొద్దు.. అప్రమత్తంగా ఉండాలి
అధికారులు, పోలీసులు అంతా రోడ్లపై ఉండాల్సిందే
అవసరమైతే నేనూ రోడ్డుపైకి వస్తా: సీఎం రేవంత్‌రెడ్డి
వర్ష సన్నద్ధతపై అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష
నేడు విద్యాశాఖపై సీఎం మీడియా సమావేశం
హైదరాబాద్, జూన్ 14 (ఆంధ్రజ్యోతి): వర్షాల సమయంలో అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. అలసత్వంగా వ్యవహరించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ నెల 9న వర్షం కురిసిన రోజు నగరంలో ఏర్పడ్డ ట్రాఫిక్‌జామ్‌తో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని, అందుకు అధికారుల అలసత్వమే కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి అలా జరిగితే సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు. వర్షాకాల సన్నద్ధతపై ఆదివారం ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలోని బోధి పెవిలియన్‌లో ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జూన్ 9న కోర్ అర్బన్ రీజియన్‌లో వర్షం కారణంగా ఏర్పడిన పరిస్థితులపై ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ‘‘మొన్న వర్షం కురిసిన రోజు ఒక్క సీనియర్ అధికారైనా రోడ్డు పైన ఉన్నారా? జూన్ 9న మీ నిర్లక్ష్యానికి ఇప్పటికే మిమ్మల్ని సస్పెండ్ చేయాలి. ఈ సారి సహించను.. సస్పెండ్ చేస్తా. కొంచెమైనా బాధ్యతగా పనిచేయాలి కదా! కుర్చీలోనే కూర్చుంటాం.. కదలం అంటే ఎలా? మరీ ఇంత నిర్లక్ష్యమా? వర్షాలు కురిసిన సమయంలో రోడ్లపై నీళ్లు నిలవకుండా, ట్రాఫిక్‌జామ్ కాకుండా ఉండేలా పకడ్బందీ ఏర్పాట్లు చేశాం. కానీ, మీ అలసత్వం, నిర్లక్ష్యం వల్ల ఒక్క వర్షంతో రెండేళ్ల కష్టం వృథా అయింది. మరోసారి ఇలాంటివి జరిగితే సహించేది లేదు. ఎంత పెద్దవారైనా సరే కఠిన చర్యలు తీసుకుంటా’’ అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
వర్షాల సమయంలో రాష్ట్ర స్థాయి అధికారుల నుంచి కిందిస్థాయి సిబ్బంది వరకు అంతా రోడ్లపై ఉండాల్సిందేనని, అవసరమైతే తాను కూడా రోడ్లపైకి వస్తానని అన్నారు. ఈ నెల 9న వర్షంపై వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినప్పటికీ మునిసిపల్, పోలీసు, ట్రాఫిక్ సిబ్బంది అప్రమత్తం కాలేదని ముఖ్యమంత్రి అసహనం వ్యక్తం చేశారు. వర్షాల సన్నద్ధతపై ఈ నెల 1న సమీక్ష నిర్వహించి స్వయంగా అనేక సూచనలు చేశానని, అయినా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వర్షం సమయంలో మునిసిపల్, పోలీసు అధికారుల మధ్య సమన్వయం లోపించిందన్నారు. ఈ పరిస్థితికి కారణాలను విశ్లేషించి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ సీవీ ఆనంద్‌లను ఆదేశించారు. వాతావరణ శాఖ సూచనల మేరకు వర్షాలపై అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. వర్షం సమయంలో మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్, హైడ్రా, ట్రాఫిక్, జలమండలి సిబ్బందితో పాటు సివిల్ పోలీసులు కూడా క్షేత్రస్థాయిలో ఉండాల్సిందేనన్నారు. పోలీసు కమిషనర్ నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు రోడ్లపైకి రావాల్సిందేనని తేల్చిచెప్పారు. వర్షం కారణంగా ట్రాఫిక్ జామ్ అయితే ఇకపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ట్రాఫిక్ విభాగంలోని ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలని డీజీపీకి సూచించారు. మానవ తప్పిదాల వల్ల సమస్యలు తలెత్తితే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోనన్నారు. వర్షాల సమయంలో ఏర్పడే వాటర్ లాగింగ్ పాయింట్లు, బ్లాక్ స్పాట్లు, ట్రాఫిక్ జామ్ అయ్యే ప్రాంతాల డేటా ఆధారంగా అధికారులు సన్నద్ధం కావాలని సూచించారు. వర్షం కారణంగా పలు చోట్ల చెట్లు కూలిపోవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడటంపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ పునరుద్ధరణ వెంటనే జరగాలని, అవసరమైన చోట్ల మొబైల్ ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేయాలని అన్నారు. వర్షం సమయంలో విద్యుత్ శాఖ సిబ్బంది అంతా క్షేత్రస్థాయిలో పనిచేసేలా చూడాలన్నారు.
అనుమతి లేకుండా ప్రాజెక్టు వదిలి వెళ్లొద్దు
వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టుల వద్ద పటిష్ట చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ అధికారులకు సీఎం సూచించారు. మాన్యువల్ ప్రకారం ప్రాజెక్టుల నిర్వహణ ఉండాలన్నారు. వర్షాకాలంలో ప్రాజెక్టుల వద్ద సంబంధిత ఇంజనీర్లు తప్పనిసరిగా స్థానికంగా ఉండాలని పేర్కొన్నారు. ఉన్నతాధికారుల అనుమతి లేకుండా ప్రాజెక్టులను వదిలి వెళ్లే ఇంజనీర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని నీటిపారుదల శాఖ కార్యదర్శిని ఆదేశించారు.ప్రాజెక్టుల గేట్ల మరమ్మతులు, నిర్వహణకు అవసరమైన నిధులను వెంటనే మంజూరు చేయాలని ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాకు సూచించారు. వ్యవసాయ సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో వ్యవసాయ శాఖ అధికారులు పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలన్నారు. ముఖ్యంగా విత్తనాలు, యూరియా పంపిణీపై దృష్టి సారించాలని, రైతు వేదికల ద్వారా యూరియా పంపిణీ చేయాలని సూచించారు. యూరియా స్టాక్, పంపిణీ కోసం స్థానిక వ్యవసాయ అధికారిని బాధ్యుడిగా నియమించడంతో పాటు రెవెన్యూ సిబ్బందిని కూడా భాగస్వామ్యం చేయాలన్నారు. సన్న వడ్ల కోసం వ్యవసాయ శాఖ ప్రకటించిన ఎనిమిది రకాల విత్తనాలపై రైతులకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.
నేడు విద్యాశాఖపై సీఎం ప్రెస్‌మీట్
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం విద్యాశాఖకు సంబంధించిన అంశాలపై సచివాలయంలో మీడియా సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2 గంటల దాకా నిర్వహించే ఈ సమావేశంలో విద్యార్థుల యూనిఫారాల కొనుగోలు అంశాన్ని సీఎం వివరించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
తాగునీరు కలుషితం కావొద్దు..
వర్షాల కారణంగా తాగునీరు కలుషితం కాకుండా చూడాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. గతంలో జరిగిన ఘటనలను దృష్టిలో ఉంచుకుని ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. ఎప్పటికప్పుడు నీటి పరీక్షలు నిర్వహించాలని జలమండలి అధికారులను ఆదేశించారు. నీరు కలుషితం కావడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున వైద్య ఆరోగ్య శాఖ పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండాలని అన్నారు. సీజనల్ వ్యాధులను దృష్టిలో ఉంచుకుని అవసరమైన మందులను సిద్ధం చేసుకోవాలన్నారు. వర్షాల కారణంగా నీరు నిలిచి అపరిశుభ్ర వాతావరణం ఏర్పడే అవకాశం ఉన్నందున శానిటేషన్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ , జలమండలి, వైద్య ఆరోగ్య శాఖలతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలని సీఎస్ జయేశ్ రంజన్‌కు సూచించారు. పోలీసు, ట్రాఫిక్, ఫైర్, హైడ్రా, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సంస్థలతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించాలని డీజీపీ సీవీ ఆనంద్‌ను ఆదేశించారు.