Share News

తుంగభద్ర జలాలపై సీఎం రేవంత్ కీలక సమీక్ష.. ఆర్డీఎస్ కాలువ ఆధునికీకరణకు గ్రీన్ సిగ్నల్

ABN , Publish Date - Jun 24 , 2026 | 09:25 PM

తుంగభద్ర జలాలపై నిర్వహించిన సమీక్ష సమావేంలో సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

తుంగభద్ర జలాలపై సీఎం రేవంత్ కీలక సమీక్ష.. ఆర్డీఎస్ కాలువ ఆధునికీకరణకు గ్రీన్ సిగ్నల్
Tungabhadra Water Dispute

హైదరాబాద్, జూన్ 24: తుంగభద్ర జలాలపై నిర్వహించిన సమీక్ష సమావేంలో సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తుంగభద్ర నదీ జలాల్లో తెలంగాణకు దక్కాల్సిన న్యాయబద్ధమైన నీటి వాటా, జోలిబండ డైవర్షన్ స్కీమ్ (RDS) కింద ఆయకట్టును కాపాడుకోవడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. తుంగభద్ర నుంచి రాష్ట్రానికి రావాల్సిన 15.9 టీఎంసీల నీరు పూర్తి స్థాయిలో అందడం లేదని, ప్రస్తుతం కేవలం 5 నుంచి 6 టీఎంసీలకే పరిమితం కావడంపై సీఎం తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్రాష్ట్ర జల వివాదాలు, సమన్వయ లోపం కారణంగా తెలంగాణ రైతాంగానికి జరుగుతున్న అన్యాయాన్ని అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర జల సంఘం (CWC) ఆధ్వర్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల మధ్య సమన్వయాన్ని పెంపొందిస్తూ తుంగభద్ర బోర్డును మరింత పటిష్టం చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేయాలన్నారు.


ఆర్డీఎస్ కాలువ కింద ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని 75 గ్రామాలకు చెందిన దాదాపు 83,987 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందాల్సి ఉందని, ఈ విషయంలో ఏ మాత్రం అలసత్వం వహించవద్దని సీఎం అధికారులను ఆదేశించారు. ఆర్డీఎస్ ఆనకట్ట భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన ఆయన.. అక్కడ అత్యవసర పనులను తక్షణమే ప్రారంభించాలని స్పష్టం చేశారు. అయితే, ఆర్డీఎస్ ఆధునికీకరణకు సంబంధించిన ప్యాకేజీ-1, ప్యాకేజీ-2 పనులు ఇప్పటికీ ప్రారంభం కాలేదని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి, రాజోలిబండ డైవర్సన్ కాలువ ఆధునికీకరణ పనులను యుద్దప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆర్డీఎస్ వద్ద భారీగా పూడిక పేరుకుపోవడం వల్ల తెలంగాణకు నీటి మళ్లింపు ప్రక్రియ దెబ్బతింటోందని ఇంజనీర్లు నివేదించారు.


ఈ సమస్య పరిష్కారానికి పూడిక తొలగింపు పనులు చేపట్టాల్సి ఉందని, ఇందుకు కేంద్ర ప్రభుత్వంతో పాటు కర్ణాటక సహకారం కోరాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే 2004 నాటి నిపుణుల కమిటీ సిఫార్సులను తక్షణమే అమలు చేయాలని కేంద్రానికి వినతిపత్రం పంపనున్నారు. తుంగభద్ర ఎత్తిపోతల పథకం ద్వారా గరిష్టంగా నీటిని వినియోగించుకునేలా ఉన్న ప్రత్యామ్నాయాలను పరిశీలించడంతో పాటు, మల్లమ్మకుంట బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ సామర్థ్యాన్ని పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రానున్న రోజుల్లో కేంద్ర జలశక్తి మంత్రి సమక్షంలో ముగ్గురు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో జరిగే సమావేశంలో ఆర్డీఎస్ అంశాన్ని ప్రధాన అజెండాగా చేర్చి, రాష్ట్ర హక్కుల కోసం గట్టిగా పోరాడాలని సీఎం స్పష్టం చేశారు.


Also Read:

న్యూజిలాండ్‌ క్రికెట్‌‌లో విషాదం.. ఐకానిక్ ప్లేయర్ మృతి

SIR జాబితా నుంచి పేరు తొలగిస్తే రేషన్ ఇవ్వరా?.. సుప్రీంకోర్టు ఆశ్చర్యం

Updated Date - Jun 24 , 2026 | 09:58 PM