2029లో రాహుల్‌ను ప్రధానిని చేస్తా
ABN , Publish Date - May 16 , 2026 | 04:58 AM
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీని వచ్చే ఎన్నికల్లో ప్రధానమంత్రిని చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఇండియా కూటమి నుంచి ప్రధాని అభ్యర్థిగా రాహుల్‌గాంధీ పేరును ముందుగా ప్రకటించి..
నేను 2034 వరకు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉంటా
ఆ తర్వాత రాహుల్ ఇచ్చే కుర్చీలో కూర్చుంటా
కేంద్రంతో కలిసి రమ్మని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రధాని కోరారు
మైకుల ముందే మాట్లాడుకున్నాం.. రహస్యమేమీ లేదు
దేశంలో రేవంత్‌కు డిమాండ్ ఉంది.. రాష్ట్ర ప్రజలకిది గౌరవం
గాంధీ కుటుంబంతో చొరవ ఉన్నా.. గీత దాటి ప్రవర్తించను
అందర్నీ మెప్పించలేం.. 75శాతం మంది ఆమోదిస్తే చాలు: సీఎం
బండి సంజయ్.. తన కుమారుడ్ని పోలీసులకు అప్పగించాలి
సాయం చేయాలనుకుంటే పోక్సో కేసు పెట్టం కదా!: రేవంత్
హైదరాబాద్, మే 15 (ఆంధ్ర జ్యోతి): కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీని వచ్చే ఎన్నికల్లో ప్రధానమంత్రిని చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఇండియా కూటమి నుంచి ప్రధాని అభ్యర్థిగా రాహుల్‌గాంధీ పేరును ముందుగా ప్రకటించి.. తరువాత కూటమి పార్టీలను ఒప్పిస్తామని తెలిపారు. కూటమి తరఫున ఒక పాలసీ డాక్యుమెంట్‌ను తీసుకొచ్చి.. తీర్పు ఇవ్వాల్సిందిగా ప్రజలను కోరతామన్నారు. ఇక తెలంగాణలో ప్రజలు 2034 వరకు కాంగ్రెస్‌కు అధికారం ఇస్తారని అన్నారు. తాను 2034 వరకు ముఖ్యమంత్రిగా తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తానని, తరువాత సీఎం పదవిని వదిలేసి.. తర్వాతి తరానికి అవకాశం ఇస్తానని చెప్పారు. ఆపై రాహుల్‌గాంధీ ఇచ్చిన కుర్చీలో కూర్చుంటానని, దేశానికి సేవలందిస్తూ.. తన అనుభవాన్ని దేశం కోసం పంచుతానని తెలిపారు. ఈ మేరకు ముఖ్యమంత్రి శుక్రవారం హైదరాబాద్‌లో ఓ కార్యక్రమంలో మాట్లాడారు. గత పదేళ్లలో రాష్ట్రంలో గాడితప్పిన వ్యవస్థలను పట్టాలెక్కించాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. ప్రతి 15 రోజులకోసారి జిల్లా పర్యటనలకు వెళ్తున్నామని, నిధుల సమీకరణకు ఎక్కువ సమయం కేటాయిస్తున్నామని పేర్కొన్నారు. తాను జడ్పీటీసీగా ఉన్నప్పుడు ఏ ఇంట్లో ఉన్నానో.. ముఖ్యమంత్రి అయ్యాకా అదే ఇంట్లో ఉంటున్నానని చెప్పారు. పార్టీ కోసం కష్టపడ్డ నాయకులకే నామినేటెడ్ పోస్టులు ఇస్తున్నామని తెలిపారు. చాకలి ఐలమ్మ కుటుంబం, శ్రీకాంతాచారి కుటుంబం, కోదండరాం, ఆకనూరి మురళి.. ఇలా అందరినీ గుర్తుపెట్టుకుని పదవులు ఇచ్చామన్నారు. ఎవరు అడ్డొచ్చినా మూసీ ప్రక్షాళన ఆగదని స్పష్టం చేశారు. డ్రగ్స్ తీసుకుంటే ఏ కీలుకు ఆ కీలు తీస్తామని హెచ్చరించారు.
ఆనాటి సీఎం కేంద్రంతో కలిసి పనిచేయలేదు..
ప్రధానిగా మోదీ, తెలంగాణ సీఎంగా తాను అధికారిక కార్యక్రమంలోనే మాట్లాడుకున్నామని రేవంత్ అన్నారు. ఆనాటి సీఎం కేసీఆర్ ఏనాడూ కేంద్రంతో కలిసి పనిచేయలేదన్నారు. నిధుల కోసం తమతో కలిసిరావాలని ప్రధాని మోదీ అన్నారని, ప్రభుత్వాల సహకారం గురించి మాత్రమే చర్చ జరిగిందని తెలిపారు. కేంద్రంతో కలిసి రావాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రధాని కోరారని చెప్పారు. రాజకీయాల్లో తన కమిట్‌మెంట్ గురించి ప్రధానికితెలుసునన్నారు. తామిద్దరం మైకుల ముందే మాట్లాడుకున్నామని, తమ మధ్య రహస్యమేమీ లేదని స్పష్టం చేశారు. దేశంలో రేవంత్‌రెడ్డికి డిమాండ్ ఉందని, ఇది తెలంగాణ ప్రజలకు గౌరవమని చెప్పారు. తాను రాహుల్‌గాంధీ నాయకత్వంలో పనిచేస్తానన్నారు. సోనియా గాంధీ లేకపోతే వెయ్యేళ్లు అయినా తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదన్నారు. తాను కాంగ్రెస్‌లో చేరినప్పుడు పార్టీ అధికారంలో లేదని గుర్తు చేశారు. తన మనసుకు నచ్చినట్లు చేస్తాను తప్ప.. అవకాశవాదిగా మారనన్నారు. నిబద్ధతతో పార్టీలో చేరడం వల్లే గాంధీ కుటుంబం అవకాశం ఇచ్చిందన్నారు. ఆ కుటుంబంతో తనకు చొరవ ఉందని, అయినా.. గీత దాటి ప్రవర్తించనని స్పష్టం చేశారు. టీడీపీలో పదేళ్లు పనిచేశానని, ఆ పార్టీ అధినేత చంద్రబాబును ఇప్పటికీ గౌరవిస్తానని చెప్పారు. కాంగ్రెస్‌ను అధికారంలోకి తేవాలని రాహుల్ గాంధీకి లక్ష్యం ఉన్నా.. ప్రధాని కావాలన్న లక్ష్యం లేదన్నారు. వికారాబాద్‌లో జరిగిన సమావేశంలో రాహుల్‌గాంధీ ప్రధాని పదవి తీసుకోవాలని ప్రతిపాదన చేశానని రేవంత్ చెప్పారు.
నిర్ణయాల్లో స్పష్టత ఉంటే పాజిటివ్ ఎనర్జీ..
కొందరు ఇతరుల వద్ద అధికారం ఉంటే.. దానిని దూరం చేయడానికి ప్రయత్నిస్తారని సీఎం రేవంత్ అన్నారు. అయితే అది జరగకపోతే మనిషిని కుంగదీస్తుందని, దాని వల్ల బలహీనమైపోతారని చెప్పారు. ప్రజాప్రతినిధిగా తన ఆలోచనల్లో స్పష్టత ఉంటుందన్నారు. ‘‘నా ఆలోచనపై కొందరికి భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు. అందరినీ మెప్పించలేం. వంద శాతం ప్రజలను మెప్పించాలని కోరుకుంటే మనకు అసంతృప్తి వస్తుంది. 60 నుంచి 75 శాతం మంది మన ఆలోచనల్ని ఆమోదిస్తే దానిని అతిపెద్ద విజయంగా చెప్పుకోవచ్చు. మనకు అడ్డొచ్చిన వారిని తొలగించాలని చూస్తే.. పాజిటివ్ ఎనర్జీ అంతా అటే పోతుంది’’ అని రేవంత్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్రజలు, పార్టీలు శాశ్వతం అని, ప్రభుత్వాలే మారుతుంటాయని అన్నారు. ప్రభుత్వాలు ఏర్పాటయ్యాక తాత్కాలిక సంక్షేమం, అభివృద్ధికి ప్రణాళికలు వేసుకుంటాయని, దీర్ఘకాలిక విజన్ లేకుండా పోతుందని పేర్కొన్నారు. రాష్ర్టానికి ఒక ప్రణాళిక, భవిష్యత్తు పట్ల స్పష్టత ఉండాలని, కానీ.. దేశంలో ఇప్పటివరకు ఏ రాష్ర్టానికీ పూర్తి స్థాయి ప్రణాళిక లేదని వ్యాఖ్యానించారు. తాను ముఖ్యమంత్రి అయ్యేవరకు 17 ఏళ్లపాటు ప్రతిపక్షంలోనే ఉన్నానని, ప్రజా సమస్యలపైఅవగాహన ఉందని చెప్పారు. ప్రపంచ స్థాయి మేధావులు, కార్పొరేట్ దిగ్గజాలను తెలంగాణ రైజింగ్-2047 పాలసీ డాక్యుమెంట్ రూపకల్పనలో భాగస్వాములను చేశామని వివరించారు. తన భవిష్యత్తును ప్రజలు నిర్ణయిస్తారు తప్ప.. ప్రతిపక్షం వాళ్లు కాదన్నారు.
రియల్ ఎస్టేట్ ఆదాయం తగ్గలేదు..
ప్రపంచ వ్యాప్తంగా రకరకాల కారణాలతో రియల్ ఎస్టేట్ గ్రోత్ తగ్గిందని సీఎం అన్నారు. 2021 నుంచి ఏడేళ్లు తీసుకుంటే.. గతం కంటే ఆదాయం పెరిగింది తప్ప.. ఎక్కడా తగ్గలేదన్నారు. కొంత మంది సోషల్ మీడియాలో పెట్టుబడి పెట్టి.. వాళ్లే రాసి.. వాళ్లే చూసి.. వాళ్లే సంతోషిస్తున్నారని ఎద్దేవా చేశారు. వాళ్లు భ్రమల్లో ఉన్నారని, తాను వాస్తవంలో ఉంటానని చెప్పారు. ముఖ్యమంత్రి పదవి వారసత్వంగా వస్తుందని కొందరు కలలు కన్నారని వ్యాఖ్యానించారు. తన కోసం ఏదీ చేయనని, తన జీవితం చాలా సౌకర్యంగా ఉందని, వందశాతం సంతృప్తితో ఉన్నానని తెలిపారు. భవిష్యత్తు తరాల కోసం ఏదైనా చేయాలన్నదే తన ఆలోచన అన్నారు. బుర్రలేని వాళ్లు టెండర్లు, కాంట్రాక్టులు మాత్రమే చూస్తారని, టెండర్లు ఇచ్చి కమీషన్లు తీసుకునేవారి ఆలోచన వేరే ఉంటుందని వ్యాఖ్యానించారు. తన వద్దకు వచ్చి, ‘నీకు ఇంత ఇస్తాం.. పని చేయి’ అని చెప్పే ధైర్యం ఎవరూ చేయలేదన్నారు. రోజూ 18 గంటలు అధికారులతో సమీక్షలు చేస్తున్నానని, గత సీఎం 3 నెలలకోసారి సమీక్ష చేసేవారని తెలిపారు.