నా కుటుంబానికి పెద్దన్న అందెశ్రీ: సీఎం రేవంత్
ABN , Publish Date - Jul 18 , 2026 | 07:38 PM
తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందెశ్రీ స్మృతివనానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అందెశ్రీతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్న సీఎం, ఆయన తనకు ఆత్మబంధువని, కుటుంబ సభ్యుడిగా, పెద్దన్నగా భావించానని అన్నారు.
హైదరాబాద్, జులై 18: తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందెశ్రీ స్మృతివనానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అందెశ్రీతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్న సీఎం, ఆయన తనకు ఆత్మబంధువని, కుటుంబ సభ్యుడిగా, పెద్దన్నగా భావించానని అన్నారు. అందెశ్రీ పాటలు లక్షలాది మందిలో తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని నింపాయని, తనలోనూ ఉద్యమ చైతన్యాన్ని రగిలించాయని పేర్కొన్నారు. గడీల ముందు మోకరిల్లనని చెప్పిన కవి అందెశ్రీ ఎప్పుడూ దొరల గడప తొక్కలేదని, ఆయన గానంలో గొప్పతనం, సమాజానికి మార్గనిర్దేశం చేసే శక్తి ఉందన్నారు. ఒకప్పుడు నిర్బంధానికి గురైన అందెశ్రీ పాటే నేడు తెలంగాణ రాష్ట్ర గీతంగా మారడం చారిత్రక విషయమని చెప్పారు. ఆనాటి ప్రభుత్వం అందెశ్రీని అవమానించిందని, అలాగే ప్రజాకవి గద్దర్‌ను ప్రగతిభవన్ ఎదుట ఎండలో నిలబెట్టిన ఘటనను కూడా సీఎం గుర్తు చేశారు.
ఈ సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. గ్రూప్ పరీక్షలు నిర్వహించి నిజంగా ఉద్యోగాలు ఇచ్చారా అని ప్రశ్నించారు. కేవలం నోటిఫికేషన్లు ఇచ్చి పేపర్లు లీక్ చేయడం ద్వారా కోట్లు సంపాదించారని ఆరోపించారు. తమ కుటుంబ సభ్యులు, బంధువులకే ఉద్యోగాలు, పదవులు కట్టబెట్టారని, కష్టపడి చదివిన నిరుద్యోగులను నిరాశపరిచారని విమర్శించారు. గతంలో ఉద్యోగాల కోసం నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలను ప్రస్తావించిన సీఎం, తెలంగాణను శవాలమయంగా మార్చింది ఎవరో ప్రజలకు తెలుసని అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే 70 వేల ఉద్యోగాలు కల్పించామని పేర్కొన్న ఆయన, గత ప్రభుత్వం రాష్ట్రానికి రూ.8 లక్షల కోట్ల అప్పులు మిగిల్చి ఫామ్‌హౌస్ రాజకీయాలు చేసిందని మండిపడ్డారు.
ఇవి కూడా చదవండి
దేశ అంతరిక్ష కలలకు చిరునామాగా తెలంగాణ: సీఎం రేవంత్ రెడ్డి
గంజాయి పండిస్తున్న సాధువు.. అరెస్ట్ చేసిన పోలీసులు