Share News

8 ఏళ్లలో హైదరాబాద్‌ నెట్‌ జీరో సిటీ

ABN , Publish Date - Feb 19 , 2026 | 05:22 AM

తెలంగాణను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. ప్రపంచ పర్యావరణ పరిరక్షణలో హరిత ఇంధనమే కీలకమని తెలిపారు. రాష్ట్రంలో హరిత ఇంధనానికి ప్రాధాన్యమిస్తున్నామన్నారు.....

8 ఏళ్లలో హైదరాబాద్‌ నెట్‌ జీరో సిటీ

  • పర్యావరణ పరిరక్షణలో హరిత ఇంధనమే కీలకం

  • తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలుపుతాం

  • అదే మా ప్రభుత్వ లక్ష్యం

  • రాష్ట్రాన్ని ‘క్యూర్‌, ప్యూర్‌, రేర్‌’ జోన్లుగా విభజించాం

  • చైనా+1కు ప్రత్యామ్నాయంగా నిలుపుతాం

  • ముంబై ‘క్లైమేట్‌ వీక్‌’ సదస్సులో సీఎం రేవంత్‌రెడ్డి

  • ఢిల్లీలో ప్రధాని విందులో పాల్గొన్న ముఖ్యమంత్రి

  • రేవంత్‌ను ఆప్యాయంగా పలకరించిన మోదీ

  • రేపు ఏఐ సమ్మిట్‌లో ప్రసంగించనున్న రేవంత్‌

  • నేడు తెలంగాణ కాంగ్రెస్‌ నేతలతో అధిష్ఠానం భేటీ

  • మల్లికార్జున ఖర్గే, రాహుల్‌ నేతృత్వంలో సమావేశం

  • పాల్గొననున్న సీఎం, మీనాక్షి, మహేశ్‌, మంత్రులు

హైదరాబాద్‌/న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి): తెలంగాణను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. ప్రపంచ పర్యావరణ పరిరక్షణలో హరిత ఇంధనమే కీలకమని తెలిపారు. రాష్ట్రంలో హరిత ఇంధనానికి ప్రాధాన్యమిస్తున్నామన్నారు. ముంబైలో మహారాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘క్లైమేట్‌ వీక్‌’ సదస్సులో బుధవారం సీఎం రేవంత్‌ పాల్గొని మాట్లాడారు. దేశంలోని పట్టణాలు, నగరాల అభివృద్ధి, వాతావరణ మార్పులకు అనుగుణంగా చేపట్టాల్సిన చర్యల విషయంలో తెలంగాణ దృక్కోణాన్ని వివరించారు. బొగ్గు, సంప్రదాయ ఇంధన వనరుల వినియోగాన్ని.. సౌర, హరిత ఇంధనం వైపు మార్చడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. 2034 నాటికి హైదరాబాద్‌ను నెట్‌ జీరో సిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా నిర్దేశించుకున్నామని చెప్పారు. పట్టణాభివృద్ధిలో భాగంగా కార్బన్‌ ఫుట్‌ ప్రింట్‌ ఆడిట్‌ చేపట్టనున్న తొలి భారత నగరంగా హైదరాబాద్‌ నిలవబోతుందన్నారు. వచ్చే ఐదేళ్లలో కోర్‌ అర్బన్‌ రీజియన్‌ (క్యూర్‌)లో దాదాపు పరిశ్రమలు ఉండవని స్పష్టంచేశారు. అభివృద్ధి వ్యూహంలో తయారీ రంగం, పర్యావరణ పరిరక్షణ కీలకంగా మారాయని రేవంత్‌ అన్నారు.


ఏ ఆర్థిక వ్యవస్థకైనా విద్యుత్‌ ఉత్పాదక వనరులే అసలైన కరెన్సీ అని చెప్పారు. విద్యుదుత్పత్తి, వినియోగం.. అభివృద్ధికి కొలమానంగా నిలుస్తాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి లక్ష్యాలను ప్రస్తావిస్తూ.. 2047 నాటికి 3 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే తమ లక్ష్యమన్నారు. రాష్ట్ర వ్యూహాత్మక అభివృద్ధి కోసం తెలంగాణను క్యూర్‌, పెరి అర్బన్‌ రీజియన్‌ ఎకానమీ (ప్యూర్‌), రూరల్‌ అగ్రి రీజియన్‌ ఎకానమీ(రేర్‌) జోన్లుగా విభజించామని తెలిపారు. ప్యూర్‌ను అతిపెద్ద తయారీ కేంద్రంగా అభివృద్ధి చేసి ‘చైనా+1’కు ప్రత్యామ్నాయంగా రాష్ట్రాన్ని నిలబెట్టడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఈ తయారీ వృద్ధి హరిత ఇంధనం ఆధారంగా సాగుతుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో రోజుకు సగటున 16,610 మెగావాట్ల విద్యుత్తును వినియోగిస్తున్నట్లు తెలిపారు. 2034 నాటికి గరిష్ఠ డిమాండ్‌ 34 వేల మెగావాట్లకు చేరుతుందన్న అంచనా ఉందన్నారు. రాష్ట్రంలో ఉత్పత్తయ్యే విద్యుత్తులో సుమారు 25 శాతం వరకు హరిత వనరుల నుంచే వస్తుందని తెలిపారు. హైదరాబాద్‌లోని క్యూర్‌ పరిధిలో ఎలక్ట్రిక్‌ వాహనాలపై పన్నులు తొలగించడంతో వాటి వినియోగం బాగా పెరిగిందన్నారు. అలాగే తెలంగాణలోనే ఈవీల తయారీ కోసం పలు సంస్థలతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. ప్రజా రవాణా వ్యవస్థను పర్యావరణహితంగా మార్చే దిశగా 2 లక్షలకు పైగా ఆటోలను రిట్రోఫిట్‌ చేస్తుండగా, 3000 పైగా ఆర్టీసీ బస్సులను ఎలక్ట్రిక్‌ బస్సులుగా మారుస్తున్నామని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడిదారులు, డేటా సెంటర్లు, పరిశ్రమలు హరిత ఇంధనాన్ని కోరుకుంటున్నాయని రేవంత్‌ తెలిపారు. తెలంగాణ ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్న క్రమంలో వనరుల పెరుగుదలలో హరిత ఇంధనం కీలకంగా ఉండాలన్నదే తన సంకల్పమని తెలిపారు. వాతావరణ మార్పులు, కొవిడ్‌ ప్రభావాలను ప్రస్తావిస్తూ.. ప్రస్తుత పరిస్థితిని ‘క్లైమేట్‌ ఎమర్జెన్సీ’గా సీఎం అభివర్ణించారు. అభివృద్ధి, పెట్టుబడులు, ఉపాధి, ఉత్పత్తి, వినియోగం పెంపులతో పాటు పర్యావరణ పరిరక్షణకూ ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మూసీ నది పునరుద్ధరణ, చెరువుల సంరక్షణ, వాటర్‌ గ్రిడ్‌, వనరుల నిర్వహణ ప్రణాళికలను సీఎం రేవంత్‌ వివరించారు. హైడ్రా రూపంలో ప్రత్యేక పోలీసు దళాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. 2047 లక్ష్యాన్ని అర్థం చేసుకోవాలంటే 1947 నుంచి భారతదేశ అభివృద్ధి ప్రయాణాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉందని అన్నారు. 1991 నుంచి 2020 వరకు కీలక సంస్కరణలతో భారత్‌ సేవా రంగంలో శక్తిమంతమైన దేశంగా ఎదిగిందని చెప్పారు. ప్రపంచంలో అధిక అంతర్జాతీయ సామర్థ్య కేంద్రాలు మనదేశంలోనే ఉన్నాయన్నారు.


ప్రధాని విందులో సీఎం రేవంత్‌రెడ్డి

‘ఇండియా ఏఐ ఇంపాక్ట్‌ సమ్మిట్‌-2026’ సందర్భంగా ప్రధాని మోదీ బుధవారం రాత్రి విందు ఏర్పాటు చేశారు. ఇందులో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. వివిధ దేశాల అధినేతలు, అంతర్జాతీయ టెక్‌ దిగ్గజాలు పాల్గొని సందడి చేశారు. ఈ సందర్భంగా రేవంత్‌ను ప్రధాని ఆప్యాయంగా పలకరించారు. తెలంగాణను గ్లోబల్‌హబ్‌గా మార్చాలనే సంకల్పంతో పనిచేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం ఏఐ సమ్మిట్‌లో ప్రసంగించనున్నారు. రాష్ట్రంలో కృత్రిమ మేధలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, ప్రభుత్వం కల్పిస్తున్న వసతులను వివరించనున్నారు.

నేడు తెలంగాణ కాంగ్రెస్‌ నేతలతో అధిష్ఠానం భేటీ

తెలంగాణ కాంగ్రెస్‌ నేతలతో పార్టీ అధిష్ఠానం గురువారం ఉదయం కీలక సమావేశం నిర్వహించనుంది. ఏఐసీసీ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే, రాహుల్‌ గాంధీల నేతృత్వంలో ఈ సమావేశం జరగనుంది. సీఎం రేవంత్‌రెడ్డితో పాటు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి, పీసీసీ చీఫ్‌ మహేశ్‌గౌడ్‌, మంత్రులు, ఏఐసీసీ కార్యదర్శులు ఢిల్లీ చేరుకున్నారు. రేవంత్‌ నేతృత్వంలో తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ, ప్రభుత్వ పనితీరుపై అధిష్ఠానం సమీక్షించనుంది. కాగా, మంత్రి వాకిటి శ్రీహరి బుధవారం కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌ గాంధీలను మర్యాదపూర్వకంగా కలిశారు.

2.jpg

ముస్లింలకు సీఎం రేవంత్‌ రంజాన్‌ శుభాకాంక్షలు

రంజాన్‌ మాసం ప్రారంభమైన సందర్భంగా రాష్ట్రంలోని ముస్లింలకు సీఎం రేవంత్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్‌ మాసం సంతోషంగా జరుపుకుని, అల్లా దీవెనలు పొందాలని ఆకాంక్షించారు. పవిత్ర మాసంలో ముస్లింలు ఆచరించే ఉపవాస దీక్షలు, ప్రార్థనలు ఆధ్యాత్మికతను పెంపొందించడంతో పాటు క్రమశిక్షణను పెంచుతాయన్నారు. మంత్రి కోమటిరెడ్డి కూడా ముస్లింలకు రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపారు.

Updated Date - Feb 19 , 2026 | 05:48 AM