Share News

తెలంగాణలో స్టీల్‌ప్లాంట్‌

ABN , Publish Date - Jan 22 , 2026 | 05:16 AM

డక్టయిల్‌ ఐరన్‌(డీఐ) పైపుల తయారీలో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన రష్మి గ్రూప్‌... తెలంగాణ రాష్ట్రంలో స్టీల్‌ ఉత్పత్తి యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది....

తెలంగాణలో స్టీల్‌ప్లాంట్‌
Telangana Investments

  • 12,500 కోట్ల పెట్టుబడితో ఏర్పాటుకు రష్మి గ్రూప్‌ ఎంవోయూ

  • 12 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు

  • 6వేల కోట్లతో రాష్ట్రంలో ‘స్లోవేకియా’ రియాక్టర్‌ ప్లాంట్‌

  • 1,000 కోట్ల పెట్టుబడికి అమెరికా సంస్థ సర్గాడ్‌ ఎంవోయూ

  • దావోస్‌ వేదికగా తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ

  • రెండో రోజూ సీఎం బృందం బిజీబిజీ

  • ప్రతి జూలైలో హైదరాబాద్‌లో ఫాలో అప్‌ సదస్సు: రేవంత్‌రెడ్డి

  • టాటా గ్రూపు చైర్మన్‌ చంద్రశేఖరన్‌, రేవంత్‌ మధ్య కీలక భేటీ

  • సదస్సులో ఆకర్షణగా చిరంజీవి

హైదరాబాద్‌, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): డక్టయిల్‌ ఐరన్‌(డీఐ) పైపుల తయారీలో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన రష్మి గ్రూప్‌... తెలంగాణ రాష్ట్రంలో స్టీల్‌ ఉత్పత్తి యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. స్విట్జర్లాండ్‌లోని దావో్‌సలో జరుగుతున్న ‘ప్రపంచ ఆర్థిక వేదిక(డబ్ల్యూఈఎఫ్‌)-2026’ సదస్సులో భాగంగా బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని బృందం రష్మి గ్రూప్‌తో కలిసి రూ.12,500 కోట్ల పెట్టుబడితో యూనిట్‌ ఏర్పాటుకు అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్ట్‌ ద్వారా రాష్ట్రంలో 12 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. కాగా, స్టీల్‌ ప్లాంట్‌.. లేబర్‌-ఇంటెన్సివ్‌ తయారీ విధానంతో పని చేస్తుందని, పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని రష్మి గ్రూప్‌ ప్రమోటర్‌ సజ్జన్‌ కుమార్‌ పట్వారి, డైరెక్టర్‌ సంజీబ్‌కుమార్‌ పట్వారి తెలిపారు. గ్రీన్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌, సర్క్యులర్‌ ఎకానమీ వంటి రంగాల్లో తెలంగాణ ప్రభుత్వంతో భాగస్వామ్యంపై కూడా వీరితో చర్చలు జరిగాయి. దీంతోపాటు వివిధ సంస్థల ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సారథ్యంలోని ‘తెలంగాణ రైజింగ్‌’ బృందం వివిధ సంస్థల ప్రతినిధులతో సమావేశమైంది. ఈ సందర్భంగా రూ.6వేల కోట్లతో రాష్ట్రంలో ‘స్లోవేకియా’ రియాక్టర్‌ విద్యుత్తుప్లాంట్‌ అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వానికి ఈవోఐ సమర్పించింది. రూ.1,000 కోట్ల పెట్టుబడికి అమెరికాకు చెందిన సర్గాడ్‌ సంస్థ, ‘లోరియల్‌’వారి ప్రపంచంలోనే మొట్టమొదటి బ్యూటీ టెక్‌ జీసీసీ ఏర్పాటుకు ఆర్‌ అండ్‌ డీ సెంటర్‌ విస్తరణకు బ్లేజ్‌ కంపెనీ ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. కొన్ని సంస్థలు భారీగా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చాయి. ఇంకా కొన్ని సంస్థలు తమ యూనిట్లను విస్తరించడానికి సంసిద్ధత వ్యక్తం చేశాయి. అంతేకాకుండా.. టాటా గ్రూపు చైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖరన్‌ దావో్‌సలో సీఎం రేవంత్‌రెడ్డితో భేటీ అయ్యారు. పలు కార్యక్రమాల్లో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ఆసక్తి కనబరిచారు. మొత్తంగా దావో్‌సలో రెండో రోజు కూడా తెలంగాణ రాష్ట్ర బృందం బిజీ బిజీగా గడిపింది. ప్రముఖ టాలీవుడ్‌ నటుడు చిరంజీవి కూడా సదస్సులో మెరవడం ప్రత్యేకత సంతరించుకుంది.


రాష్ట్రంలో రియాక్టర్‌ విద్యుత్‌ ప్లాంట్‌..

న్యూక్లియర్‌ క్లీన్‌ ఎనర్జీ రంగంలో తెలంగాణ మరో ముందడుగు వేసింది. రూ.6 వేల కోట్ల పెట్టుబడితో స్మాల్‌ మాడ్యులర్‌ రియాక్టర్‌(ఎ్‌సఎంఆర్‌) ఆధారిత విద్యుత్తు ప్రాజెక్ట్‌ అభివృద్ధికి స్లోవేకియాకు చెందిన న్యూక్లియర్‌ ప్రొడక్ట్స్‌ సంస్థ ముందుకు వచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆ సంస్థ ఎక్స్‌ప్రెషన్‌ ఆఫ్‌ ఇంట్రె్‌స్ట(ఈవోఐ) సమర్పించింది. దావో్‌సలో సీఎంరేవంత్‌రెడ్డితో ఆ సంస్థ ప్రతినిధులు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, ఐక్యూ క్యాపిటల్‌ గ్రూప్‌ చైర్మన్‌ జాన్‌ బాబిక్‌, గ్రూప్‌ సీఈవో, డైరెక్టర్‌ అనిల్‌కుమార్‌ బావిషెట్టి, గ్రీన్‌ హౌస్‌ ఎన్విరో సీఈవో, డైరెక్టర్‌ మొలుగు శ్రీపాల్‌రెడ్డి, స్లోవాక్‌ రిపబ్లిక్‌ కాన్సూల్‌ మాటుస్‌ జెమెస్‌ పాల్గొన్నారు. స్లోవేకియాకు చెందిన ఐక్యూ క్యాపిటల్‌, భారత్‌కు చెందిన గ్రీన్‌ హౌస్‌ ఎన్విరో సంయుక్త భాగస్వామ్యంలో న్యూక్లియర్‌ ప్రొడక్ట్స్‌ సంస్థ ఏర్పడింది. గరిష్ఠంగా 300 మెగావాట్ల సామర్థ్యంతో తెలంగాణలో కొత్త విద్యుత్తు ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలిస్తోంది. ఈ ప్రాజెక్ట్‌ మొత్తం పెట్టుబడి విలువ 600 మిలియన్‌ యూరోలు(సుమారు రూ.6,000 కోట్లు). మరోవైపు విమానయాన రంగంలో పేరొందిన అమెరికాకు చెందిన సర్గాడ్‌ సంస్థ తెలంగాణలో మెయింటెనెన్స్‌ అండ్‌ రిపేర్‌ యూనిట్‌ను నెలకొల్పనుంది. రాబోయే 3 నుంచి 5 ఏళ్లలో దశలవారీగా రూ.1,000 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వంతో ఆ సంస్థ ఎంవోయూ కుదుర్చుకుంది. ఈ మేరకు సర్గాడ్‌ సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో శ్రీనివాస్‌ తోట.. సీఎం రేవంత్‌రెడ్డితో భేటీ అయ్యారు. తెలంగాణలో విమానాల నిర్వహణ, మరమ్మతులు, పునరుద్ధరణ(ఎంఆర్‌వో) కేంద్రం ఏర్పాటు చేయాలన్న ఆసక్తిని సంస్థ ప్రతినిధులు వ్యక్తం చేశారు.


రేవంత్‌తో టాటా గ్రూపు చైర్మన్‌ భేటీ..

సీఎం రేవంత్‌రెడ్డితో టాటా గ్రూపు చైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖరన్‌ దావో్‌సలో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా రాష్ట్రంలో ఉన్న పారిశ్రామిక అనుకూల వాతావరణాన్ని టాటా చైర్మన్‌కు సీఎం వివరించారు. భవిష్యత్తు అవసరాలకు తగిన ప్రణాళికాబద్ధమైన ఆలోచన విధానాన్ని టాటా చైర్మన్‌ చంద్రశేఖరన్‌ ప్రశంసించారు. స్పోర్ట్స్‌ స్టేడియాల అభివృద్ధిలో భాగస్వామ్యమయ్యేందుకు, ప్రభుత్వంతో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లో చేపడుతున్న మూసీ నది పునరుజ్జీవ ప్రాజెక్టుపైనా ఆయన ఆసక్తి చూపారు. మేడారం, వేములవాడ, భద్రాచలం వంటి ఆలయ ప్రాంతాల్లో హోటళ్ల ఏర్పాటుకూ టాటా గ్రూప్‌ ఆసక్తి చూపింది. శ్రీశైలం రహదారి వెంబడి అంతర్జాతీయ స్థాయి రిసార్ట్‌ల ఏర్పాటుపై సానుకూలంగా స్పందించింది. ఏఐ డేటా సెంటర్లు, సెమీ కండక్టర్‌, ఈవీ తయారీ రంగాల్లో తెలంగాణలో కొత్త పరిశ్రమల నెలకొల్పే అవకాశాలపై టాటా చైర్మన్‌ ఆసక్తి కనబరిచారు.కాగా, ప్రతి ఏడాది జూలైలో హైదరాబాద్‌లో డబ్ల్యూఈఎఫ్‌ ఫాలో-అప్‌ సదస్సును నిర్వహించాలని సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిపాదించారు. దావో్‌సలో జరిగిన ‘జాయిన్‌ ది రైజ్‌’ కార్యక్రమంలో ఈ ప్రతిపాదనకు గ్లోబల్‌ బిజినెస్‌ లీడర్లు, పాలసీ నిర్ణేతలు ఏకగ్రీవంగా మద్దతు తెలిపారు. ఈ రోజుల్లో పెట్టుబడుల ఒప్పందాలు, వ్యాపార వాణిజ్య నిర్ణయాలకు ఒక సంవత్సరం చాలా ఎక్కువ సమయమని రేవంత్‌ అన్నారు. అందుకే ప్రతి ఏటా జూలై లేదా ఆగస్టులో హైదరాబాద్‌లో ఫాలో-అప్‌ సదస్సు నిర్వహించాలని వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌ ప్రతినిధులకు సూచించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైజింగ్‌ 2047 విజన్‌ డాక్యుమెంట్‌ లక్ష్యాలను ప్రదర్శించారు. అదే వేదికపై తెలంగాణ ఏఐ ఇన్నోవేషన్‌ హబ్‌(టీఏఐహెచ్‌), తెలంగాణ నెక్స్ట్‌-జెన్‌ లైఫ్‌ సైన్సెస్‌ పాలసీ-2026-30ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నటుడు చిరంజీవి పాల్గొని, ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ముఖ్యమంత్రితో కలిసి ఆయన విందులో పాల్గొన్నారు. ప్రపంచంలోనే తొలి బ్యూటీ-టెక్‌ గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్‌(జీసీసీ)ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్నట్లు లోరియల్‌ సంస్థ ప్రకటించింది. ఈ అత్యాధునిక కేంద్రాన్ని ఈ ఏడాది నవంబరులో ప్రారంభించనుంది. దావో్‌సలో సీఎం రేవంత్‌రెడ్డి, లోరియల్‌ సీఈవో నికోలస్‌ హియోరోనిమస్‌ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జరిగిన చర్చలో హైదరాబాద్‌లో భారీ పెట్టుబడులతో బ్యూటీ-టెక్‌ జీసీసీని ఏర్పాటు చేసే నిర్ణయాన్ని వెల్లడించారు. ఈ జీసీసీ ఏర్పాటుతో లోరియల్‌కు గ్లోబల్‌ ఇన్నోవేషన్‌, టెక్నాలజీ, డేటా, సప్లై చైన్‌ కార్యకలాపాలకు హైదరాబాద్‌ కీలక కేంద్రంగా నిలవనుంది.


డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌, ఏఐ, అనలిటిక్స్‌ రంగాల్లో రూపొందించే సాంకేతిక పరిష్కారాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న లోరియల్‌ యూనిట్లకు అందిస్తామని హియెరోనిమస్‌ తెలిపారు. రాష్ట్రంలో ఉన్న మౌలిక వసతులు, పరిశ్రమల ఎకోసిస్టమ్‌ను దృష్టిలో ఉంచుకుని భవిష్యత్తులో తయారీ రంగంలోనూ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. మరోవైపు హైదరాబాద్‌లో రీసెర్చ్‌ అండ్‌ డెవల్‌పమెంట్‌ సెంటర్‌ విస్తరణకు కాలిఫోర్నియాకు చెందిన బ్లేజ్‌ సంస్థతో తెలంగాణ ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకుంది. వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం సదస్సులో బ్లేజ్‌ కో-ఫౌండర్‌, సీఈవో దినకర్‌ మునగాల.. సీఎం రేవంత్‌రెడ్డితో ప్రత్యేకంగా సమావేశమై ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇప్పటికే బ్లేజ్‌ సంస్థ హైదరాబాద్‌లో రీసెర్చ్‌ అండ్‌ డెవెల్‌పమెంట్‌, ఇంజినీరింగ్‌ సెంటర్‌ను నిర్వహిస్తోంది. దీనిని విస్తరించే పెట్టుబడులు, ప్రణాళికలపై ఈ సందర్భంగా చర్చలు జరిగాయి.

దావోస్‌ సదస్సులో మెరిసిన చిరంజీవి

ప్రముఖ టాలీవుడ్‌ నటుడు చిరంజీవి దావోస్‌ సదస్సులో మెరిశారు. తన కుటుంబంతో వెకేషన్‌లో భాగంగా చిరంజీవి స్విట్జర్లాండ్‌కు వెళ్లారన్న విషయం తెలియడంతో సీఎం రేవంత్‌రెడ్డి ఆయనను ప్రత్యేకంగా సదస్సుకు ఆహ్వానించారు. ఇద్దరూ పక్కపక్కనే కూర్చుని సదస్సులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.


ఏబీ ఇన్‌బెవ్‌ యూనిట్‌ విస్తరణకు సిద్ధం

ప్రపంచంలో అతిపెద్ద బీరు తయారీ సంస్థగా పేరుగాంచిన ఏబీ ఇన్‌బెవ్‌(ఏబీ ఇన్‌బెవ్‌), తెలంగాణలో ఇప్పటికే ఉన్న తమ తయారీ యూనిట్‌ను విస్తరించేందుకు భారీగా పెట్టుబడి పెట్టనున్నట్లు తెలిపింది. దావో్‌సలో సీఎం రేవంత్‌రెడ్డి బృందం.. ఏబీ ఇన్‌బెవ్‌ చీఫ్‌ లీగల్‌ అండ్‌ కార్పొరేట్‌ అఫైర్స్‌ ఆఫీసర్‌ జాన్‌బ్లడ్‌తో సమావేశమయ్యారు. తెలంగాణలో ప్రస్తుతం రెండు తయారీ యూనిట్లు నిర్వహిస్తున్న ఏబీ ఇన్‌బెవ్‌.. సుమారు 600 మందికి ఉపాధి కల్పిస్తోంది. సమావేశంలో సర్క్యులర్‌ వాటర్‌ వినియోగం, మహిళా సాధికారత, విద్య వంటి అంశాల్లో తెలంగాణతో కలిసి పని చేసే అవకాశాలపై కూడా చర్చించారు. కాగా, తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టాస్క్‌, యంగ్‌ ఇండియా స్కిల్స్‌ వర్సిటీ యువతకు ఉద్యోగాలు వచ్చేలా, నైపుణ్యాలు నేర్పించాలనే ఉద్దేశంతో ప్రారంభించిందని, ఇది చాలా గొప్ప ఆలోచన అని సిస్కో గ్లోబల్‌ ఇన్నోవేషన్‌ ఆఫీసర్‌ గై డీడ్రిచ్‌ ప్రశంసించారు. దావో్‌సలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బృందం సిస్కో సంస్థ ప్రతినిధులతో సమావేశమైంది. ఈ సమావేశంలో తెలంగాణలో సిస్కో చేపట్టబోయే పనులపై చర్చించారు. మరోవైపు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, స్విట్జర్లాండ్‌లోని వాడ్‌(వీఏయూడీ) రాష్ట్ర ముఖ్యమంత్రి క్రిస్టెల్‌ లూసియర్‌ బ్రోడార్‌తో దావో్‌సలో కీలక సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో భారత్‌-స్విట్జర్లాండ్‌ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో రెండు రాష్ట్రాల మధ్య సహకార పెంపుపై చర్చించారు. హైదరాబాద్‌లో ప్రపంచంలోనే తొలిసారి ‘స్విస్‌ మాల్‌’ను ఏర్పాటు చేయాలనే ఆలోచనను ముఖ్యమంత్రి ప్రతిపాదించగా, స్విస్‌ బృందం వెంటనే సానుకూలంగా స్పందించింది. క్రీడా శిక్షణ, మౌలిక వసతుల అభివృద్ధిలో కలిసి పని చేయవచ్చని అభిప్రాయపడ్డారు. మహిళా సాధికారతకు సంబంధించి స్వయం సహాయక సంఘాల కార్యక్రమాలపై స్విస్‌ బృందం ఆసక్తి కనబరిచింది.


ఈ వార్తలు కూడా చదవండి:

పాలిచ్చే పశువులకు చికెన్‌, మటన్‌ వ్యర్థాలు!

10గంటల నుంచి ఆ ఏరియాల్లో కరెంట్ కట్..

Updated Date - Jan 22 , 2026 | 06:54 AM