Share News

పాలిచ్చే పశువులకు చికెన్‌, మటన్‌ వ్యర్థాలు!

ABN , Publish Date - Jan 22 , 2026 | 05:29 AM

సాధారణంగా పాడి పశువులైన ఆవులు, గేదెలకు పచ్చగడ్డి, ఎండుగడ్డి, దాణా ప్రధాన ఆహారం. దాణాలో తవుడు, బియ్యం కడిగిన నీళ్లు, అప్పుడప్పుడు ఇళ్లలో మిగిలిన కొద్దిపాటి అన్నాన్ని కుడితిలో కలిపి పెట్టేవారు....

పాలిచ్చే పశువులకు చికెన్‌, మటన్‌ వ్యర్థాలు!

  • దాణాగా హోటళ్లలో మిగిలిపోయిన ఆహారం, వ్యర్థాలు

  • పాల దిగుబడి పెంపు, దాణా ఖర్చు తగ్గించుకునే ఉద్దేశంతో అడ్డదారులు

  • నిత్యం గ్రామాలకు హోటల్‌ వ్యర్థాలు

  • పాల నాణ్యతలో తేడా, పశువులకు రోగాలు

  • ఘట్‌కేసర్‌ పరిసరాల్లో పెంపకందారుల వింతపోకడ

  • ఆ పాలతో ప్రమాదమంటున్న వైద్యులు

ఘట్‌కేసర్‌, జనవరి 21 (ఆంధ్ర జ్యోతి): సాధారణంగా పాడి పశువులైన ఆవులు, గేదెలకు పచ్చగడ్డి, ఎండుగడ్డి, దాణా ప్రధాన ఆహారం. దాణాలో తవుడు, బియ్యం కడిగిన నీళ్లు, అప్పుడప్పుడు ఇళ్లలో మిగిలిన కొద్దిపాటి అన్నాన్ని కుడితిలో కలిపి పెట్టేవారు. కానీ ఇటీవలికాలంలో హోటళ్లలో మిగిలే వ్యర్థాలు ఆహారంగా పెడుతున్నారు. హైదరాబాద్‌, ఇతర నగరాలు, శివారు ప్రాంతాల్లోని హోటళ్లు, రెస్టారెంట్లలో మటన్‌, చికెన్‌, చేపలు, కూరలు, బిర్యానీ, ఇతర ఆహార వ్యర్థాలు మిగిలిపోతుంటాయి. హోటళ్ల నిర్వాహకులు వాటిని డ్రమ్ముల్లో పడేసి నిల్వ చేస్తే.. డెయిరీల నిర్వాహకులు, పశువుల పెంపకందారులు వచ్చి తీసుకెళుతున్నారు. ఇందుకోసం హోటళ్లు, రెస్టారెంట్ల వారితో ముందే ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఆ ఆహార వ్యర్థాలను పశువులకు ఆహారంగా పెడుతున్నారు.

పశువులకు వ్యాధులు.. మనకు ప్రమాదం

వ్యర్థాలను ఆహారంగా ఇవ్వడంతో మొదట్లో పాల దిగుబడి పెరిగినా వాటి జీర్ణ వ్యవస్థ దెబ్బతింటోంది. తర్వాతి దశలో పశువులు వివిధ రకాల వ్యాధుల బారినపడుతున్నాయి. వాటి సంతానోత్పత్తి సామర్థ్యం లేకుండా పోతోంది. వ్యాధులతో చిక్కిపోవడం, పాల దిగుబడి తగ్గడంతో చివరికి ఆ పశువులను కబేళాలకు విక్రయిస్తున్నారు.

ఆ పశువుల పేడ కంపు!

ఆవులు, గేదెల పేడకు మన సంస్కృతిలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. గతంలో పేడతోనే ఇళ్లు అలికేవారు. ఇళ్ల ముందు కల్లాపి చల్లేవారు. ఇప్పుడిదంతా తగ్గినా పొలాల్లో, ఉద్యానవనాల్లో ఎరువుగా వాడటం కోసం పశువుల పేడకు డిమాండ్‌ ఉంది. కానీ హోటళ్ల ఆహార వ్యర్థాలు తినడం వల్ల పశువుల పేడ.. మనుషుల మలం తరహాలో మారిపోయి, విపరీతంగా దుర్వాసన వెదజల్లుతోంది. ఆ పేడను ముట్టుకోవడానికి కూడా ఇష్టపడక పైపులతో నీళ్లు కొడుతూ డ్రైనేజీలలోకి వదిలేస్తున్నారు. హైదరాబాద్‌ శివార్లలోని ఘట్‌కేసర్‌ మండలం పరిధిలోని మూసీ పరీవాహక గ్రామాల్లో ఇలాంటి వాటితో డ్రైనేజీలు మూసుకుపోయిన సందర్భాలు అనేకం ఉన్నాయి.

వ్యర్థాల వినియోగం ప్రమాదం

పశువులకు హోటళ్ల ఆహార వ్యర్థాలను పెట్టడం ప్రమాదకరం. వాటితో పశువుల జీర్ణాశయంపై తీవ్ర ప్రభావం పడుతుంది. మొదట్లో పాల దిగుబడి కొంత పెరుగుతుంది. పశువులు కాస్త బలిష్టంగా మారుతాయి. కానీ తర్వాత వాటిని అనేక రకాల జబ్బులు చుట్టుముడతాయి. ఆ పశువుల పాలు ఆరోగ్యానికి హానికరం. దీనిపై అందరికీ అవగాహన కల్పించడం అవసరం.

- పద్మిని, పశువైద్యాధికారి, ఘట్‌కేసర్‌

Updated Date - Jan 22 , 2026 | 05:29 AM