Share News

Chicken: నాన్‌ వెజ్‌ ప్రియులకు కష్టకాలం.. కొండెక్కిన కోడిమాంసం

ABN , Publish Date - Jan 14 , 2026 | 11:57 AM

కోడిమాంసం దరలు రోజురోజుకు పెరుగుతుండడంతో.. సామాన్యులు చికెన్ కొని వండుకొని తినే పరిస్థితి లేకుండా పోతోంది. ప్రస్తుతం చికెన్ రేట్లు మాంసంతో పోటీపడుతున్నాయి. పనిలోపనిగా మరోపక్క మేడారం మహాజాతర కూడా రావడంతో ఇక కోళ్ల రేట్లు ఒక్కసారిగా పెరిగిపోయాయి.

Chicken: నాన్‌ వెజ్‌ ప్రియులకు కష్టకాలం.. కొండెక్కిన కోడిమాంసం

- నాలుగంకెల మార్కుకు మటన్‌ ధర

- మేడారం జాతరతో చికెన్‌, మటన్‌కు ఫుల్‌ డిమాండ్‌

- విపరీతంగా పెరిగిన పొట్టేళ్ళ ధరలు

వరంగల్: సంక్రాంతి పండుగకు ప్రియంగా ఆరగించే మాంసాహారం మరింత పిరమైంది. కోడి కూర కొండెక్కి కూర్చుంటే, పొట్టేలు మాంసం రేటు నాలుగంకెల ధరకు వచ్చింది. పండుగ వచ్చిందంటే మటన్‌, చికెన్‌లకు యమ క్రేజ్‌ ఉంటుంది. పొట్టేళ్ళ మాంసానికి మరీ ఎక్కువ డిమాండ్‌ ఉండటంతో మార్కెట్‌లో వాటి ధరలు విపరీతంగా పెరిగాయి. దీనికి తోడు మేడారం జాతర ఉండటంతో పది కేజీల మాంసం ఉండే పొట్టేలు ధర సంతల్లోనే పది వేల నుండి 14 వేలు పలుకుతోంది. దీంతో కేజీ మటన్‌ రేటు రూ. 1000కి చేరింది. ఐదేళ్ళ నుంచి రూ.900కు అమ్ముతున్న మటన్‌ ధర లు దసరా పండుగకి తొలిసారి నాలుగంకెల(రూ. 1000) ధర పలికింది. మళ్లీ ఇపుడు అదే రేంజ్‌కు చేరుకుంది.


chicken1.jpgమేడారం ఎఫెక్ట్‌..

మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఉండటంతో పొట్టేళ్ళకు, కోళ్ళకు విపరీతమైన డిమాండ్‌ ఏర్పడింది. జాతర సందర్భంగా అత్యధికంగా ప్రాధాన్యత ఇచ్చేది సుక్క, ముక్కకే. ఎక్సైజ్‌ శాఖ అధికారులు సరిపడా మద్యం నిల్వలను అందుబాటులో ఉంచారు. కాని వినియోగదారులకు సరిపడా మాంసం ఉత్పత్తి రాష్ట్రంలో లేదనే చెప్పాలి. దసరాతో ఉన్న పొట్టేళ్ళు అయిపోయాయి. ఆ తర్వాత ఉగాది సమయంలో యాటలు అమ్మకానికి కావాల్సిన సైజ్‌కు వస్తాయి. దీంతో ప్రస్తుతం ఇతర రాష్ట్రాల నుంచే సగం యాటలను తీసుకువస్తున్నారు.


పాలమూరు యాటలకు డిమాండ్‌..

మటన్‌లో తెలంగాణ, మహారాష్ట్ర, చత్తీస్‏ఘడ్‌ రాష్ట్రాల యాటల మాంసం రుచిగా ఉంటుందనే నమ్మకంతో ఈ ప్రాంతాల యాటలకు విపరీతమైన డిమాండ్‌ ఉంది. తెలంగాణ జాతి గొర్రెలుగా ప్రసిద్ధి చెందిన పాలమూరు యాటలకు దేశంలోనే అత్యధిక డిమాండ్‌ ఉంటుంది. ఈ జాతి పిల్లలు సంక్రాంతి నుంచి జూన్‌ వరకు వస్తాయి. వీటి మాంసం చాలా రుచిగా ఉండటంతో పాటు వంట చేసుకునేందకు సులువుగా ఉంటుందని మాంసం ప్రియుల అభిప్రాయం. రైతులు కూడా ఎలాంటి మందులు వాడకుండా పాలమూరు జాతి జీవాలను తక్కువ సమయంలో ఎక్కువ మాంసం వచ్చేలా పెంచుతారు.


mutton.jpg

తెలంగాణలో డిమాండ్‌ పెరుగుతుండటంతో మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌, బీహార్‌ ప్రాంతాల నుంచి లారీల్లో జీవాలనుతీసుకు వచ్చి ఇక్కడ సంతల్లో అమ్ముతున్నారు. మరోవైపు కోళ్ళ ఫామ్‌లలో సైతం పెం పకానికి అయ్యే వ్యయం పెరగడంతో కోడి కూర కిలో రూ. 300కి చేరుకుంది. రిటైల్‌ షాపుల్లో కోడి లైవ్‌ రూ. 180 నుండి 200 ఉండగా స్కిన్‌లెస్ చికెన్‌ రూ. 300లకు అమ్ముతున్నారు. మేడారం జాతరకు మరింత పెరిగినా ఆశ్చర్యపోవాల్సింది ఏమీ లేదని చికెన్‌ సెంటర్‌ వ్యాపారులు చెబుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి.

స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

‘10 నిమిషాల’ డెలివరీ..ఇక రద్దు!

Read Latest Telangana News and National News

Updated Date - Jan 14 , 2026 | 11:57 AM