తెలంగాణ విజయగాథలో భాగస్వాములవుతాం
ABN , Publish Date - Oct 30 , 2026 | 02:59 AM
వాణిజ్య, వ్యాపార, పెట్టుబడి రంగాల్లో తెలంగాణ విజయగాథలో కేంద్ర ప్రభుత్వం భాగస్వామిగా ఉంటుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు
జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్‌తో ఆస్ట్రేలియాకు తాండూరు కందులు
‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్’ కర్టెన్ రైజర్‌లో కేంద్రమంత్రి పీయూష్ గోయల్
ఐఎస్ఎం 2.0లో తెలంగాణను భాగస్వామిని చేయండి: దుద్దిళ్ల
‘ఖేలో ఇండియా’ను ఘనంగానిర్వహించండి: మాండవీయ
న్యూఢిల్లీ, హైదరాబాద్, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): వాణిజ్య, వ్యాపార, పెట్టుబడి రంగాల్లో తెలంగాణ విజయగాథలో కేంద్ర ప్రభుత్వం భాగస్వామిగా ఉంటుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీ), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), లైఫ్ సైన్సెస్ రంగాల్లో హైదరాబాద్ ముందు వరుసలో ఉందని ఆయన గుర్తుచేశారు. జియోగ్రాఫికల్ ఇండికేషన్ (జీఐ) ట్యాగ్‌తో తాండూరు కందులను ఆస్ట్రేలియాకు పంపించినట్లు వివరించారు. ఢిల్లీ తాజ్ ప్యాలెస్ హోటల్‌లో గురువారం జరిగిన ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ - 2026’ కర్టెన్ రైజర్‌లో కేంద్ర మంత్రి పాల్గొని ప్రసంగించారు. దేశంలో దసరా, కర్వాచౌత్, దీపావళి పండుగలు కొనసాగుతున్నాయన్న ఆయన.. ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్’ను మరో పండుగగా అభివర్ణించారు. 700 ఏళ్ల క్రితమే గణపతి చక్రవర్తి నౌకా వాణిజ్యంపై మోటుపల్లి శాసనం వేయించారని గుర్తు చేశారు.
ఆనాడే వ్యాపారులు తమ పెట్టుబడులకు భద్రత, విధాన నిర్ణయాల్లో స్థిరత్వాన్ని కోరుకున్నారని.. ఇప్పుడు పారిశ్రామికవేత్తలూ అవే విధానాలను కోరుకుంటున్నారని చెప్పారు. ‘వికసిత్ భారత్ 2047’ లక్ష్యసాధనకు భారతీయులంతా కలిసి పనిచేయాలని పిలుపునిచ్చిన ఆయన.. ఆ దిశగా 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యాన్ని స్వాగతిస్తున్నట్లు వెల్లడించారు. కాగా.. ఇండియా సెమీకండక్టర్ మిషన్ (ఐఎ్‌సఎమ్) 2.0లో తెలంగాణను భాగస్వామిగా చేయాలని ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. తద్వారా ఫ్యాబ్ ఇండస్ట్రీ, చిప్ డిజైన్ విభాగాల్లోనూ తెలంగాణ అగ్రగామిగా ఎదిగేందుకు మరింత అనుకూల వాతావరణం ఏర్పడుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న గ్లోబల్ సమ్మిట్ 2.0 లో పాల్గొనాలని ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు పారిశ్రామికవేత్తలను కోరారు.
ప్రధానిని ఆహ్వానించండి..
తెలంగాణలో ఖేలో ఇండియా గేమ్స్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ సూచించారు. గురువారం న్యూఢిల్లీలో కేంద్ర మంత్రి మాండవీయతో తెలంగాణ యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఖేలో ఇండియా గేమ్స్ సన్నద్ధత, వేదికల సిద్ధత, మౌలిక సదుపాయాలు, రవాణా, వసతి, భద్రత తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ రూపొందించిన కార్యాచరణ ప్రణాళికను అధికారులు కేంద్ర మంత్రికి వివరించారు. ఖేలో ఇండియా గేమ్స్ ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానించాలని మాండవీయను శ్రీహరి కోరారు. ప్రధాని హాజరైతే జాతీయస్థాయిలో ప్రాధాన్యం లభించడంతోపాటు యువతకు స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు
ఈ వార్తలు కూడా చదవండి..
ఉత్తర్‌ప్రదేశ్‌లో సంచలనం.. ఇంట్లో పాతిపెట్టిన మూడు డ్రమ్ముల్లో భారీగా నగదు..!
ఢిల్లీ టీటీడీలో వైభవంగా ప్రారంభమైన వార్షిక పవిత్రోత్సవాలు