Share News

ఫీజులు కట్టలేక మద్యం అక్రమ రవాణా!

ABN , Publish Date - May 06 , 2026 | 06:56 AM

హైదరాబాద్‌కు చెందిన ఓ ఇంజనీరింగ్‌ విద్యార్థి చండీగఢ్‌లోని కాలేజీలో బీటెక్‌లో చేరాడు. ఫీజులు కట్టే స్థోమత లేకపోవడంతో అక్రమంగా మద్యం విక్రయించాలని...

ఫీజులు కట్టలేక మద్యం అక్రమ రవాణా!

  • చండీగఢ్‌ నుంచి హైదరాబాద్‌కు తెచ్చి విక్రయాలు

  • బీటెక్‌ విద్యార్థి నుంచి 15 ఖరీదైన బాటిళ్లు స్వాధీనం, స్కూటీ సీజ్‌

హైదరాబాద్‌ సిటీ, మే 5(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌కు చెందిన ఓ ఇంజనీరింగ్‌ విద్యార్థి చండీగఢ్‌లోని కాలేజీలో బీటెక్‌లో చేరాడు. ఫీజులు కట్టే స్థోమత లేకపోవడంతో అక్రమంగా మద్యం విక్రయించాలని, వచ్చే ఆ డబ్బుతో ఫీజు కట్టాలని అనుకున్నాడు. ఆ ప్రయత్నాల్లో కటకటాలపాలయ్యాడు. నిందితుడు నగరానికి చెందిన మునకాల చరణ్‌(22). అతడు చండీగఢ్‌లో తక్కువ ధరకు దొరికే ఖరీదైన మద్యాన్ని హైదరాబాద్‌కు సరఫరా చేస్తున్నట్లు ఎక్సైజ్‌ పోలీసులకు సమాచారం అందింది. సికింద్రాబాద్‌ ఎక్సైజ్‌ డీటీఎఫ్‌ సీఐ సౌజన్య బృందం రంగంలోకి దిగి నిఘా పెట్టింది. సికింద్రాబాద్‌ ప్రాంతంలో బాటిళ్లు అమ్మడానికి చరణ్‌ ప్రయత్నిస్తుండగా అతడిని పోలీసులు పట్టుకున్నారు. అతడి వద్ద నుంచి వివిద బ్రాండ్లకు చెందిన 15 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకొని, స్కూటీని సీజ్‌ చేశారు.. ఉన్నత చదువులకు అవసరమైన ఫీజులు చెల్లించే స్థోమత కుటుంబసభ్యులకు లేకపోవడంతో స్నేహితుల సలహా మేరకు చండీగఢ్‌లో తక్కువ ధరకు దొరికే ఖరీదైన మద్యాన్ని హైదరాబాద్‌కు తెచ్చి విక్రయిస్తున్నానని, ఆ డబ్బుతో చదువు కొనసాగిస్తున్నానని విచారణ సందర్భంగా చరణ్‌ చెప్పాడు.

Updated Date - May 06 , 2026 | 07:06 AM