Share News

లేవలేక.. నడవలేక..

ABN , Publish Date - Nov 13 , 2026 | 03:01 AM

ఆడుతూ పాడుతూ తిరగాల్సిన ఓ 12 ఏళ్ల చిన్నారి.. ఐదు నెలలుగా ఆస్పత్రి మంచానికే పరిమితమై మృత్యువుతో పోరాడుతోంది.

లేవలేక.. నడవలేక..
pongulati

5 నెలలుగా ఆ చిన్నారి నరకయాతన!

కామాంధుడి పైశాచికత్వానికి బలైన ఖమ్మం బాలిక

లైంగికదాడికి యత్నించి.. భవనం పైనుంచి తోసివేత

హైదరాబాద్‌ నిమ్స్‌లో మృత్యుపోరాటం

నడుం కింద నుంచి స్పర్శ కోల్పోయిన దుస్థితి

ఆపరేషన్‌ చేసినా కాళ్లలో చలనం లేని వైనం

ఖమ్మం రూరల్‌, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): ఆడుతూ పాడుతూ తిరగాల్సిన ఓ 12 ఏళ్ల చిన్నారి.. ఐదు నెలలుగా ఆస్పత్రి మంచానికే పరిమితమై మృత్యువుతో పోరాడుతోంది. ఖమ్మం జిల్లాలో గత జూన్‌ నెలలో జరిగిన ఓ అఘాయిత్యంలో కామాంధుడి దాష్టీకానికి బలైన చిన్నారి.. లేవలేక, నడవలేక నరకయాతన అనుభవిస్తోంది. నడుం కింది భాగం నుంచి అరికాళ్ల వరకు పూర్తిగా స్పర్శ కోల్పోవడంతో.. కనీసం పక్క కూడా తిరగలేని నిస్పహాయ స్థితి నెలకొంది. పది రోజుల క్రితం వైద్యులు నడుముకు శస్త్రచికిత్స చేసినప్పటికీ, కాళ్లలో ఇంకా ఎలాంటి చలనం రాలేదు. చిన్నారి ఆరోగ్య స్థితిలో మార్పు రాకపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతుండగా, ఆమెను ఎలాగైనా తిరిగి నడిపించేందుకు వైద్యులు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు.


భవనం పైనుంచి తోసేసి..

ఖమ్మం రూరల్‌ మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక.. ఈ ఏడాది జూన్‌ 6న ఖమ్మం జిల్లా కేంద్రంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఆడుకుంటుండగా గౌస్‌ పాషా అనే దుర్మార్గుడు భవనం పైకి తీసుకెళ్లి లైంగిక దాడికి యత్నించాడు. చిన్నారి ప్రతిఘటించడంతో.. తన దుశ్చర్య ఎక్కడ బయట పడుతుందోనన్న భయంతో ఆ రాక్షసుడు పాపను భవనంపై నుంచి కిందకు తోసేసి ప్రమాదవశాత్తు పడినట్లు చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. ఈ దారుణ ఘటనలో బాలిక వెన్నుపూస, పక్కటెముకల్లో తీవ్ర గాయాలు కాగా, రెండు కాళ్లు విరిగిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. అప్పటివరకు ఆమె ఆడుకుంటూ ప్రమాదవశాత్తు కింద పడిందని అంతా భావించారు. కానీ, రెండు రోజుల తర్వాత స్పృహలోకి వచ్చిన చిన్నారి జరిగిన విషయాన్ని తల్లిదండ్రులు, పోలీసులకు వివరించడంతో ఖమ్మం రెండవ పట్టణ పోలీసులు నిందితుడిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. కామాంధుడు చేసిన పాపానికి ఆ చిన్నారి నడుం భాగం నుంచి అరికాళ్ల వరకు పూర్తిగా స్పర్శ కోల్పోయింది. పదిరోజుల క్రితం బాలికకు శస్త్రచికిత్స చేసినప్పటికీ, పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. దీంతో, ఆమెను తిరిగి నడిపించేందుకు వైద్యులు నిరంతరం కృషి చేస్తున్నారు


చిన్నారికి అండగా మంత్రి పొంగులేటి..

ఆపరేషన్‌కు నిధులు

విషయం తెలుసుకున్న రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని, ఖమ్మంలో చికిత్స పొందుతున్న చిన్నారిని వెంటనే ప్రత్యేక వాహనంలో హైదరాబాద్‌లోని నిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. నిమ్స్‌లో బాలికను, తల్లిదండ్రులను పరామర్శించి ధైర్యం చెప్పారు. చిన్నారి భవిష్యత్తు కోసం ప్రభుత్వం తరపున రూ.5 లక్షలు బ్యాంకులో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేయించారు. నడుం ఆపరేషన్‌కు రూ.15 లక్షల వరకు ఖర్చు అవుతుంద ని వైద్యులు తెలపగా, తక్షణమే ప్రభుత్వం నుంచి రూ.7.50 లక్షలు మంజూరు చేయించి శస్త్రచికిత్స చేయించారు. మిగిలిన రూ.7.50 లక్షలను కూడా త్వరలోనే అందిస్తామని, బాలిక కోలుకునే వరకు అయ్యే ఖర్చంతా తానే చూసుకుంటానని మంత్రి హామీ ఇచ్చారు. ప్రతీరోజు తల్లిదండ్రులు, వైద్యులతో మాట్లాడుతూ చికిత్సను పర్యవేక్షిస్తున్నారు.

ఇవి కూడా చదవండి..

మూడు టిమ్స్‌కు ఒకే రిక్రూట్‌మెంట్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

సోనియా ఆత్మకథపై పి. వి. నరసింహరావు మనవడు తీవ్ర విమర్శలు

Updated Date - Nov 13 , 2026 | 04:06 AM