Share News

రాష్ట్రంలో ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌

ABN , Publish Date - Feb 05 , 2026 | 04:38 AM

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం రేవంత్‌, రాహుల్‌ (ఆర్‌ఆర్‌) ట్యాక్స్‌ వసూలు చేస్తోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ ఆరోపించారు.

రాష్ట్రంలో ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌

  • రేవంత్‌, రాహుల్‌ ట్యాక్స్‌ వసూలు చేస్తున్న కాంగ్రెస్‌

  • కమీషన్ల ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకలించాలి

  • ఓ వర్గానికి కొమ్ముకాసేలా కాంగ్రెస్‌ పరిపాలన

  • ఆలయాలపై దాడులనూ పట్టించుకోవడం లేదు

  • హిందూ పండుగలపై ఆంక్షలు ఆపకపోతే..బీజేపీ కార్యకర్తలు తగిన సమాధానం చెబుతారు

  • అన్ని వర్గాలనూ మోసం చేసిన కాంగ్రెస్‌ సర్కారు

  • బడ్జెట్‌లో తెలంగాణకు ఎన్నడూ లేనన్ని నిధులు

  • మోదీకి ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆదరణ

  • ఆంక్షలు విధించిన అమెరికాయే తలవంచింది

  • పాలమూరు సభలో బీజేపీ అధ్యక్షుడు నితిన్‌నబీన్‌

  • కేసీఆర్‌, రాహుల్‌ మధ్య ఒప్పందాలు: కిషన్‌రెడ్డి

మహబూబ్‌నగర్‌, ఫిబ్రవరి 4 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం రేవంత్‌, రాహుల్‌ (ఆర్‌ఆర్‌) ట్యాక్స్‌ వసూలు చేస్తోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ ఆరోపించారు. పనులు మంజూరు చేయాలన్నా, బిల్లులు విడుదల చేయాలన్నా కమీషన్‌ వసూలు చేస్తున్నారని అన్నారు. కమీషన్ల కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెకలించాలని బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్టీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నితిన్‌ నబీన్‌ బుధవారం తొలిసారిగా తెలంగాణ పర్యటనకు వచ్చారు. మహబూబ్‌నగర్‌, చేవెళ్ల, నాగర్‌కర్నూలు పార్లమెంట్‌ స్థానాల పరిధిలోని బీజేపీ బూత్‌ స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బీఆర్‌ఎ్‌సను తిరస్కరించి కాంగ్రె్‌సకు అధికారం ఇచ్చారని, కానీ.. కాంగ్రెస్‌ ప్రభుత్వం మొత్తం కమీషన్‌రాజ్‌గా మారిపోయిందని ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి కొన్ని వర్గాలను బుజ్జగించేందుకు ప్రయత్నిస్తున్నారని, కాంగ్రెస్‌ అంటే ముస్లిం.. ముస్లిం అంటే కాంగ్రెస్‌ అనే వాదాన్ని వినిపిస్తున్నారని నితిన్‌ నబీన్‌ మండిపడ్డారు. హిందువుల సంస్కృతీ సంప్రదాయాలను, మనోభావాలను దెబ్బతీస్తూ.. ఒక వర్గాన్ని సంతృప్తి పరిచేందుకు పనిచేస్తున్నారని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు బడ్జెట్‌లో నిధులు కేటాయించడం లేదని, మైనారిటీలకు మాత్రమే ఎక్కువ నిధులు కేటాయిస్తున్నారని అన్నారు.


కేంద్ర ప్రభుత్వం వక్ఫ్‌బోర్డు చట్టాలను సవరించి పారదర్శకంగా తీసుకువస్తే.. కాంగ్రెస్‌ అడ్డుకుంటోందని తెలిపారు. రూ.లక్షల కోట్ల విలువ చేసే 77 వేల ఎకరాల భూమిని తెలంగాణలో వక్ఫ్‌ బోర్డుకు అప్పగించారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో రెండేళ్లుగా హిందూ ఆలయాలపై దాడులు జరుగుతున్నా.. ప్రభుత్వం నోరు మెదపడంలేదన్నారు. చెంగిచర్లలో గుంపుదాడి, ముత్యాలమ్మ ఆలయం, గాంధీనగర్‌ దేవాలయాన్ని అపవిత్రం చేసినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. హిందూ దేవుళ్లను, ఆలయాలను అవమానించడం, హిందూ పండుగలపై ఆంక్షలు విధించడాన్ని ఆపకపోతే కాంగ్రెస్‌ అధికారంలో కూడా ఉండదని, సనాతన ధర్మంపై దాడులు చేస్తే బీజేపీ కార్యకర్తలు తగిన రీతిలో సమాధానం చెబుతారని హెచ్చరించారు.

అన్ని వర్గాలకూ కాంగ్రెస్‌ మోసం..

మోదీ ప్రభుత్వం నారీ శక్తి పేరుతో అనేక కార్యక్రమాలు చేపడుతోందని నితిన్‌ నబీన్‌ తెలిపారు. తెలంగాణలో మాత్రం కాంగ్రెస్‌ ప్రభుత్వం మహిళలకు నెలకు రూ.2500 చొప్పున ఇస్తామని, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ కింద తులం బంగారం ఇస్తామని చెప్పి మోసం చేసిందని ఆరోపించారు. రైతులు, బడుగు, బలహీన వర్గాలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి వారిని కూడా మోసం చేసిందన్నారు. రైతు భరోసా కింద రూ.15 వేలు, వ్యవసాయ కూలీలకు రూ.12 వేలు ఇస్తామని చెప్పి ఇవ్వలేదని ధ్వజమెత్తారు. బీఆర్‌ఎస్‌ బాటలోనే కాంగ్రెస్‌ నడుస్తోందన్నారు. ఇటీవల కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు ఎన్నడూ లేనంతగా రూ.5,450 కోట్ల నిధులు మంజూరు చేశామని, అయినా కాంగ్రెస్‌ నాయకులు కూనిరాగాలు తీస్తున్నారని ఎద్దేవా చేశారు. రైల్వేకు సంబంధించి తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ నుంచి మూడు హైస్పీడ్‌ కారిడార్‌లను మంజూరు చేశామని గుర్తు చేశారు. వీటిద్వారా ఫార్మా, పారిశ్రామిక రంగాల్లో తెలంగాణ వృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు, మెగా టెక్స్‌టైల్‌ పార్కు, ఇండస్ర్టియల్‌ కారిడార్‌ ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ప్రధాని నరేంద్రమోదీ పట్ల, ఆయన నాయకత్వం పట్ల ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరుగుతోందని నితిన్‌ నబీన్‌ పేర్కొన్నారు. దేశం కోసం మోదీ అంకితభావంతో పనిచేస్తున్నారని, ‘మదర్‌ ఆఫ్‌ ఆల్‌ డీల్స్‌’ పేరుతో యూరోపియన్‌ యూనియన్‌తో ఒప్పందాలు చేసుకున్నారని తెలిపారు. భారత్‌పై ఆంక్షలు విధించిన అమెరికా కూడా తలవంచి దిగివచ్చిందని, టారి్‌ఫలను 18 శాతానికి తగ్గించిందని చెప్పారు.


రాష్ట్రంలో బీజేపీకి పెరిగిన ఓటింగ్‌..

తెలంగాణలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓటింగ్‌ శాతం కొంత పెరిగిందని నితిన్‌ నబీన్‌ అన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల నాటికి అది రెట్టింపు అయిందన్నారు. మునిసిపల్‌ ఎన్నికల్లో ప్రతి బూత్‌లోనూ 50 శాతం ఓట్లు సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా బీజేపీ గెలుస్తోందని, తెలంగాణ ప్రజలు కూడా ప్రధాని మోదీకి అండగా నిలవాలని కోరారు. ఈ ఎన్నికల్లో బీజేపీ పోరాటం అధికారం కోసమో, కుర్చీ కోసమో కాదని, తెలంగాణ గౌరవం కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసమని చెప్పారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. నిత్యం మహిళలకు ఉచిత బస్సుపై మాట్లాడే సీఎం రేవంత్‌రెడ్డి.. ఆ ఒక్కటి తప్ప ఏ హామీనీ నెరవేర్చలేదన్నారు. బీఆర్‌ఎస్‌ నేతలు అవినీతికి పాల్పడ్డారని, తాము అధికారంలోకి వచ్చాక వారు జైలులో ఉంటారని రేవంత్‌రెడ్డి చెబితే ప్రజలు నమ్మారని, కానీ.. రెండేళ్లు దాటిపోయినా ఎవరి మీదా చర్యలు తీసుకోలేదని ధ్వజమెత్తారు. కేసీఆర్‌, రాహుల్‌గాంధీ మధ్య ఎప్పుడో ఒప్పందాలు కుదిరాయని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గతంలో పౌరహక్కులను కాలరాస్తూ తమ ఫోన్లను విన్నదని కిషన్‌రెడ్డి మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పనిచేసే క్లర్క్‌ ఫోన్లును కూడా ట్యాప్‌ చేశారని తెలిపారు.

ఆలయాలపై మాట్లాడితే మతోన్మాదులమా?

బైంసాలో మత ప్రచారం చేస్తున్నామంటూ తమపై ఆరోపణలు చేస్తున్నారని, కానీ.. సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో మత రాజకీయాలు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ఆరోపించారు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక ప్రచారంలో కాంగ్రెస్‌ అంటే ముస్లిం.. ముస్లిం అంటే కాంగ్రెస్‌ అంటూ ముఖ్యమంత్రి మాట్లాడిన విషయాన్ని అందరూ గుర్తు చేసుకోవాలన్నారు. రాష్ట్రంలో ఎన్నో దేవాలయాలు కూల్చుతున్నా కాంగ్రెస్‌ మాట్లాడటం లేదని, వాటిపై ప్రశ్నిస్తే మతోన్మాదులం ఎలా అవుతామని నిలదీశారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు డీకే అరుణ, కె.లక్ష్మణ్‌, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఏవీఎన్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో నితిన్‌ నబీన్‌కు బీజేపీ నేతలు ఘనంగా స్వాగతం పలికారు.

2.jpg

Updated Date - Feb 05 , 2026 | 06:14 AM