Share News

జైలుకు బండి భగీరథ్‌

ABN , Publish Date - May 17 , 2026 | 05:57 AM

పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కుమారుడు బండి భగీరథ్‌ను సైబరాబాద్‌ పోలీసులు శనివారం రాత్రి అరెస్టు చేశారు. నార్సింగి పరిధిలోని టీఎస్‌పీఏ వద్ద.....

జైలుకు బండి భగీరథ్‌

టీజీపీఏ వద్ద అరెస్టు చేశామన్న పోలీసులు.. పేట్‌బషీరాబాద్‌ పీఎస్‌కు తరలింపు

డీసీపీ ఆధ్వర్యంలో రెండున్నర గంటలపాటు విచారణ

వైద్య పరీక్షల అనంతరం మెజిస్ట్రేట్‌ ఎదుట హాజరు

14 రోజుల రిమాండ్‌.. చర్లపల్లి జైలుకు తరలింపు

ఉదయం నుంచే ‘ఆపరేషన్‌ భగీరథ్‌’ పేరిట వేట

లుకౌట్‌ నోటీసు జారీ.. విమానాశ్రయాల్లో అప్రమత్తం

భగీరథ్‌ బంధువులు, స్నేహితుల ఇళ్లలో సోదాలు

కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ఇంట్లో గాలింపు

సంజయ్‌ బంధువులు, భగీరథ్‌ స్నేహితులను స్టేషన్‌కు పిలిపించి విచారించిన పోలీసులు

పేట్‌ బషీరాబాద్‌/హైదరాబాద్‌ సిటీ/హైదరాబాద్‌, మే 16 (ఆంధ్రజ్యోతి): పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కుమారుడు బండి భగీరథ్‌ను సైబరాబాద్‌ పోలీసులు శనివారం రాత్రి అరెస్టు చేశారు. నార్సింగి పరిధిలోని టీఎస్‌పీఏ వద్ద రాత్రి 8:15 గంటలకు భగీరథ్‌ను అరెస్టు చేసినట్లు, విచారణ నిమిత్తం ఎస్‌వోటీ పోలీసుల బృందం అతణ్ని పేట్‌బషీరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్లు సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ ఎం.రమేష్‌ తెలిపారు. శనివారం రాత్రి 9:05 గంటలకు బండి భగీరథ్‌ ముఖానికి మాస్కు, తెల్లని హుడీ ధరించి పేట్‌బషీరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నాడు. మఫ్టీలో ఉన్న పోలీసుల సమక్షంలో నాలుగు వాహనాల్లో ఐదుగురు న్యాయవాదులతో కలిసి పోలీసుల ఎదుట హాజరయ్యాడు. భగీరథ్‌ వచ్చిన ఐదు నిమిషాలకు విచారణాధికారి, కూకట్‌పల్లి డీసీపీ రితిరాజ్‌ పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. రెండున్నర గంటలపాటు భగీరథ్‌ను విచారించారు. అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి.. అర్ధరాత్రి మేడ్చల్‌ జిల్లా మెజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపరిచారు. కేసు పూర్వాపరాలను, పోలీసుల రిపోర్టును పరిశీలించిన మెజిస్ట్రేట్‌ భగీరథ్‌కు 14 రోజుల రిమాండ్‌ విధించారు. అనంతరం పోలీసులు అతణ్ని చర్లపల్లి జైలుకు తరలించారు. దీంతో శనివారం ఉదయం నుంచి బండి భగీరథ్‌ అరెస్టుపై నెలకొన్న ఉత్కంఠ వీడింది. తొలుత తానే స్వయంగా పోలీసుల ఎదుట లొంగిపోతానన్న సంకేతాలు భగీరథ్‌ నుంచి పోలీసు వర్గాలకు అందినట్లు తెలిసింది. ఇందుకు తగ్గట్లుగానే ఉదయం పేట్‌బషీరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి, రెట్టింపు సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. అయితే అనూహ్య రీతిలో పోలీసులే అతణ్ని అరెస్టు చేశారు. బండి భగీరథ్‌ పోలీసుల ఎదుట లొంగిపోతున్నాడని శనివారం ఉదయం నుంచి ప్రచారం జరిగింది. దాంతో పేట్‌ బషీరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ వద్ద తీవ్ర ఉత్కంఠ నెలకొంది. పోలీసులు ముందుగానే రోడ్డుపై ఎలాంటి ఇబ్బందుల్లేకుండా పీఎస్‌ ఎదుట బారికేడ్లు ఏర్పాటు చేశారు. భగీరథ్‌ పోలీసుల ఎదుట లొంగిపోతే పంచనామా నిర్వహించగానికిగాను కుత్బుల్లాపూర్‌ రెవెన్యూ కార్యాలయం రికార్డు అసిస్టెంట్‌ బాలప్రసాద్‌, వీఆర్‌ఏ.. మధ్యాహ్నం నుంచి పోలీస్‌స్టేషన్‌ వద్దే వేచి ఉన్నారు. వీరితోపాటు.. భగీరథ్‌ను మెజిస్ట్రేట్‌ ముందు హాజరుపరచడానికి తీసుకెళ్లే ముందు వైద్య పరీక్షలు నిర్వహించడానికిగాను ఇద్దరు ప్రభుత్వ వైద్యులు రాత్రి 8:00 గంటలకు (భగీరథ్‌ పోలీస్‌ స్టేషన్‌కు చేరుకోవడానికి అరగంట ముందే) వచ్చినట్లు తెలిసింది.

2.jpg


మరోవైపు సాయంత్రం 6:30 నుంచి పోలీస్‌స్టేషన్‌ గేట్లు మూసివేశారు. మీడియాను లోపలికి అనుమతించలేదు. మొత్తమ్మీద శనివారం ఉదయం నుంచి రాత్రి 9 గంటల వరకు పోలీస్‌స్టేషన్‌ వద్ద మీడియా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో వేచి ఉండటంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. రాత్రి 9:05 గంటలకు మేడ్చల్‌ రోడ్డు మార్గం గుండా భగీరథ్‌ పీఎస్‌కు చేరుకున్నారు.

రెండున్నర గంటలపాటు విచారణ..

శనివారం రాత్రి పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన బండి భగీరథ్‌ను విచారణ పర్యవేక్షణాధికారి రితిరాజ్‌ బృందం రెండున్నర గంటలపాటు విచారించారు.‘‘పోక్సో కేసు బాధితురాలు ఎంతకాలంగా పరిచయం? ఎలా పరిచయం? మీ మధ్య ఎలాంటి స్నేహం ఉంది? బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డారా? ఆమె మైనర్‌ అని తెలియదా? ఘటనా స్థలంలో అసలేం జరిగింది? బాధితురాలు సమర్పించిన ఆధారాలకు మీ సమాధానమేంటి? కేసు నమోదైన విషయం తెలిసిన తర్వాత చట్టానికి దొరక్కుండా ఎందుకు తప్పించుకున్నారు?’’ అంటూ పోలీసులు భగీరథ్‌పై ప్రశ్నల వర్షం కురిపించి సమాధానాలు రాబట్టడంతోపాటు అతని స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. డీసీపీ రితిరాజ్‌ వెంట ఎస్‌వోటీ డీసీపీ శోభన్‌, పేట్‌బషీరాబాద్‌ ఏసీపీ శంకర్‌రెడ్డి, ఇన్‌స్పెక్టర్‌ విజయ్‌వర్థన్‌ ఇతర పోలీస్‌ బృందం ఉన్నారు. కాగా, నిందితుడు నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. అతనికి వైద్య పరీక్షలు నిర్వహించి మేడ్చల్‌ జిల్లా మెజిస్ట్రేట్‌ ఇంటి వద్ద హాజరుపరిచారు. అయితే, భగీరథ్‌ న్యాయపోరాటం చేస్తున్నాడని అతని తరపు న్యాయవాది కరుణాసాగర్‌ అన్నారు. అతను ఎలాంటి తప్పు చేయలేదన్నారు. తామే భగీరథ్‌ను ఎస్‌ఓటీ పోలీసులకు అప్పగించామని, వారు పేట్‌బషీరాబాద్‌ పోలీసులకు అప్పగించారని తెలిపారు. పూర్తి విచారణకు సహకరిస్తామన్నారు. త్వరలోనే బెయిల్‌ పిటిషన్‌ వేస్తామని, భగీరథ్‌ను నిర్ధోషిగా బయటకు తీసుకువస్తామని చెప్పారు.


ఆపరేషన్‌ భగీరథ్‌ పేరిట వేట..

బండి భగీరథ్‌ పోలీసు విచారణకు హాజరు కాకపోవడం, అతనికి ముందస్తు బెయిల్‌ విషయంలో ఎలాంటి రక్షణ కల్పించని విధంగా శుక్రవారం హైకోర్టులో ఆదేశాలు రావడంతో శనివారం తెల్లవారుజాము నుంచే పోలీసులు అతని కోసం వేట ముమ్మరం చేశారు. ఆపరేషన్‌ భగీరథ్‌ పేరిట అతణ్ని పట్టుకోవడం కోసం దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సైబరాబాద్‌ స్పెషల్‌ టీమ్స్‌ శనివారం ఉదయం నుంచి తీవ్ర స్థాయిలో గాలింపు చేపట్టాయి. హైదరాబాద్‌, ఢిల్లీ, కరీంనగర్‌, పుణె, బెంగళూరులో 14 పోలీసు బృందాలు భగీరథ్‌ కోసం రంగంలోకి దిగాయి. కరీంనగర్‌, హైదరాబాద్‌లోని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ ఇంటికి, ఆయన సన్నిహిత బంధువుల ఇళ్లకు వెళ్లాయి. భగీరథ్‌ పరారీలో ఉన్న విషయాన్ని ఆయా ఇళ్లలోని వారికి చెప్పి.. అన్ని గదుల్లోనూ తనిఖీలు చేశాయి. మరోవైపు భగీరథ్‌ మిత్రుల ఇళ్లలోనూ పోలీసులు తనిఖీలు చేశారు. భగీరథ్‌పై లుకౌట్‌ నోటీసు సైతం జారీ చేశారు. అతడు విదేశాలకు పారిపోకుండా విమానాశ్రయాల ఇమిగ్రేషన్‌ విభాగాలను అప్రమత్తం చేశామని సైబరాబాద్‌ సీపీ రమేష్‌ తెలిపారు.

బాధితుల వాంగ్మూలం సేకరణ..

పోక్సో కేసుకు సంబంధించి ఫిర్యాదుదారులైన బాలిక తల్లి, బాధిత బాలిక వాంగ్మూలాలను పోలీసు అధికారులు శనివారం మేడ్చల్‌ కోర్టులో మెజిస్ట్రేట్‌ సమక్షంలో నమోదు చేయించారు. భగీరధ్‌తో పరిచయం దగ్గర్నుంచి అతడు వివిధ సందర్భాల్లో శారీరకంగా కలవడానికి ఒత్తిడి తేవడం, మొయినాబాద్‌ ఫాంహౌస్‌లో బలహీన స్ధితిలో ఉన్నప్పుడు లైంగికదాడికి ప్రయత్నించిన విషయం, బలవంతంగా బాలికకు మద్యం తాగించిన విషయాన్ని, కేసు నమోదైనప్పటి నుంచి తాము ఎదుర్కొంటున్న బాధ, ఎదురవుతున్న ఒత్తిళ్లకు సంబంధించి పూర్తి సమాచారాన్ని తల్లీకూతుళ్లు తమ వాంగ్మూలంలో వివరించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ కేసుకు సంబంధించిన కీలక ఎలక్ర్టానిక్‌, డిజిటల్‌ ఆధారాలు, వాట్సాప్‌ చాట్‌లను బాలిక నుంచి సేకరించిన డీసీపీ రితిరాజ్‌ బృందం.. వాటిని కోర్టు అనుమతితో ఫోరెన్సిక్‌ సైన్స్‌ లేబొరేటరీకి పంపడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ ఆధారాలను పరిరక్షించాలని, తారుమారు కాకుండా చూడాలని బాధిత బాలిక తల్లి బహిరంగ లేఖలో విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు తమ వద్ద ఉన్న ఆధారాలపై సమీక్ష నిర్వహించినట్లు తెలుస్తోంది.


ఠాణాలో భగీరథ్‌ మిత్రులు...

భగీరథ్‌తో కలిసి ఉన్న స్నేహితులను పోలీసు స్టేషన్‌కు అధికారులు పిలిపించి విచారించారు. అలాగే భగీరథ్‌కు మద్దతుగా బాధితురాలి ఫొటోలు, వీడియోలను సోషల్‌ మీడియాలో వైరల్‌ చేసిన మిత్రులను పోలీసులు విచారించారు. ఆ ఫొటోలు, వీడియోలు మీకు ఎప్పుడు వచ్చాయి? ఎవరు పంపించారు? ఏయే ఫోన్‌ నెంబర్ల నుంచి భగీరథ్‌ మీతో టచ్‌లో ఉన్నాడు? వంటి వివరాలను పోలీసు అధికారులు తెలుసుకున్నారు. మరోవైపు బండి సంజయ్‌ సన్నిహిత బంధువులను సైతం పోలీసు స్టేషన్‌కు పిలిపించి పోలీసులు విచారించారు.

Updated Date - May 17 , 2026 | 05:57 AM