Share News

నాకేం తెలియదు

ABN , Publish Date - Nov 24 , 2026 | 05:21 AM

హైదరాబాద్‌ మెట్రోకు ‘ఇండియన్‌ రైల్వే ఫైనాన్స్‌ కార్పొరేషన్‌’ (ఐఆర్‌ఎఫ్‌సీ) రుణం గురించి తనకు తెలియదని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు

నాకేం తెలియదు
Ashwini Vaishnaw

  • హైదరాబాద్‌ మెట్రోకు ఐఆర్‌ఎఫ్‌సీ రుణం అంశం నా పరిధిలోనిది కాదు

  • రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌

  • రుణం విడుదల, మెట్రో విస్తరణపై జూన్‌లో అశ్వినీతో సీఎం రేవంత్‌ భేటీ

  • సమావేశంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డీ..మరుసటి రోజు ముగ్గురూ కలిసికేంద్రమంత్రి ఖట్టర్‌తో సమావేశం

  • కేంద్రం, రాష్ట్రం కలిసి మెట్రో 1, 2లను చేపట్టాలని నిర్ణయం!

  • తాజాగా తనకేం తెలియదన్న వైష్ణవ్‌

న్యూఢిల్లీ, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ మెట్రోకు ‘ఇండియన్‌ రైల్వే ఫైనాన్స్‌ కార్పొరేషన్‌’ (ఐఆర్‌ఎఫ్‌సీ) రుణం గురించి తనకు తెలియదని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. సోమవారం ఢిల్లీలో మీడియాతో నిర్వహించిన ఇష్టాగోష్ఠిలో ఆయన పలు అంశాలపైమాట్లాడారు. ఈ సందర్భంగా, హైదరాబాద్‌ మెట్రోకు ఐఆర్‌ఎఫ్‌సీ నుంచి విడుదల కావాల్సిన రూ.13,600 కోట్ల రుణం గురించి విలేకరులు ప్రస్తావించగా.. దాని గురించి తనకేమీ తెలియదన్నారు. అది తన శాఖ పరిధిలోని అంశం కాదని చెప్పారు. కాగా, హైదరాబాద్‌ మెట్రో రెండో దశ విస్తరణకు అనుమతులు, నిధులు మంజూరు చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో కలిసి అశ్వినీ వైష్ణవ్‌తో ఈ ఏడాది జూన్‌ 22న ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మరుసటి రోజు ముగ్గురూ కలిసి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌తో భేటీ అయ్యారు. మెట్రో విస్తరణ, రాష్ట్ర ప్రభుత్వానికి జపాన్‌ సంస్థ అందించిన రూ.13,600 కోట్ల రుణాన్నిఐఆర్‌ఎఫ్‌సీ విడుదల చేయటం తదితర అంశాలపైనే ఈ సమావేశాల్లో ప్రధానంగా చర్చించారు. అంతకుముందు, జూన్‌ 9వ తేదీన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, మెట్రో ఫేజ్‌-2 విస్తరణకు మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపారని చెప్పారు. అయితే, తాజాగా అశ్వినీ వైష్ణవ్‌.. మెట్రోకు ఆర్థిక సహకారం, ఐఆర్‌ఎ్‌ఫసీ రుణం సంగతి తనకు తెలియదని, అది తన పరిధిలోకి రాదని పేర్కొనడం గమనార్హం.


ఇదీ నేపథ్యం

హైదరాబాద్‌ నగరంలో పెరుగుతున్న జనాభా దృష్ట్యా.. ఎల్‌అండ్‌టీ కంపెనీ ఆధ్వర్యంలో నడుస్తున్న మెట్రోను విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అయితే, తొలిదశ మెట్రో నిర్వహణతోనే తమకు ఏటా రూ.300-400 కోట్ల నష్టాలు వస్తున్నాయని, విస్తరణను తాము చేపట్టలేమని ఎల్‌అండ్‌టీ చెప్పటంతో.. మెట్రో-1ను ఆ సంస్థ నుంచి కొనుగోలు చేసి, రెండోదశ విస్తరణను తానే చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు, ఎల్‌అండ్‌టీ తీసుకున్న రూ.13,600 కోట్ల రుణాన్ని ప్రభుత్వమే తీసుకోవాలని నిర్ణయం జరిగింది. ఈ రుణం చెల్లింపు కోసం జపాన్‌తో సంప్రదింపులు జరపగా, రుణం ఇవ్వటానికి జపాన్‌ ఆమోదం తెలిపింది. రుణం కూడా విడుదలై.. కేంద్రసంస్థ అయిన ఐఆర్‌ఎఫ్‌సీ ద్వారా ఈ రుణం బదిలీ కావాల్సినప్పటికీ చివరి నిమిషంలో నిలిచిపోయింది. దీనిపై సీఎం రేవంత్‌రెడ్డికి, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి మధ్య తీవ్ర విమర్శలు, ప్రతివిమర్శలు కొంతకాలంపాటు నడిచిన అనంతరం.. ఇద్దరూ కలిసి రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను, కేంద్ర పట్టాణాభివృద్ధిమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ను కలిసి చర్చించారు. ఈ నేపథ్యంలో.. మొత్తంగా మెట్రో1, 2 ఫేజ్‌లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టాలన్న నిర్ణయం జరిగింది. దీనికోసం కన్సల్టెన్సీ సంస్థగా ఎస్‌బీఐ క్యాప్స్‌ను నియమించారు. రెండు ఫేజ్‌లకు సంబంధించిన రుణాలను కేంద్రప్రభుత్వమే చొరవ తీసుకొని ఇప్పిస్తుందని అప్పట్లో వార్తలు వెలువడ్డాయి. కానీ, దీనిపై అడుగులు ముందుకు పడలేదు. తాజాగా, రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ఐఆర్‌ఎఫ్ సీ రుణం గురించి తనకేమీ తెలియదని చెప్పటం కొసమెరుపు.


వేగంగా బుల్లెట్‌ ట్రెయిన్‌ పనులు

ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన అహ్మదాబాద్‌-ముంబయి బుల్లెట్‌ రైలు కారిడార్‌ పనులు వేగంగా కొనసాగుతున్నాయని అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. సూరత్‌-బిలిమోరా సెక్షన్‌లో దాదాపు 50 కి.మీ.ల మేర ట్రాక్‌, విద్యుదీకరణ పనులు పూర్తయ్యాయని, ఇదే వేగంతో మిగిలిన అన్ని సెక్షన్లలోనూ పనులను పూర్తి చేస్తామన్నారు. వచ్చే ఏడాది మే నెలలో బుల్లెట్‌ రైలు ట్రయల్‌ రన్‌ నిర్వహిస్తామని చెప్పారు. గంటకు 250 కి.మీ.ల వేగంతో ఈ రైలు ప్రయాణిస్తుందని, 2029 నాటికి బుల్లెట్‌ రైలు సేవలు ఠాణే వరకు అందుబాటులోకి వస్తాయని రైల్వే మంత్రి వెల్లడించారు

ఈ వార్తలు కూడా చదవండి...

పార్టీకి నష్టం చేసేలా మాట్లాడితే చర్యలు.. సీఎం రేవంత్‌రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

హైదరాబాద్‌లో ఉగ్రదాడుల హెచ్చరిక.. పోలీసుల హై అలర్ట్!

Updated Date - Nov 24 , 2026 | 05:23 AM