బీఆర్‌ఎస్ నేతలను వేధిస్తే ఊరుకోం.. తగిన మూల్యం తప్పదు: హరీశ్ రావు
ABN , Publish Date - Feb 19 , 2026 | 03:29 PM
బాల్క సుమన్ అరెస్ట్ దుర్మార్గపు చర్య అని మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలే పథకం ప్రకారం దాడి చేసి అక్రమ కేసులు పెట్టించారని ఆరోపించారు..
ఆదిలాబాద్, ఫిబ్రవరి 19: రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని మాజీ మంత్రి హరీశ్ రావు (Former Minister Harish Rao) వ్యాఖ్యలు చేశారు. గురువారం జిల్లా జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను హరీశ్ పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బాల్క సుమన్ అరెస్ట్ దుర్మార్గపు చర్య అని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలే పథకం ప్రకారం దాడి చేసి బీఆర్‌ఎస్ నేతలపై అక్రమ కేసులు పెట్టించారని ఆరోపించారు. బలం లేని చోట కాంగ్రెస్ ఎలా గెలుస్తుందో సీఎం రేవంత్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు.
మంత్రి వివేక్ వెంకటస్వామి తీరు జుగుప్సాకరంగా ఉందని హరీశ్ విమర్శించారు. క్యాతనపల్లిలో మహిళా కౌన్సిలర్లపై దాడి జరిగితే పోలీసులు ఫిర్యాదు తీసుకోలేదని.. బీఆర్‌ఎస్ నేతల వాహనాలు ధ్వంసమైనా ఫిర్యాదు తీసుకోలేదని మండిపడ్డారు. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోస్టింగ్‌ల కోసం బీఆర్‌ఎస్ నేతలను వేధిస్తే ఊరుకునేది లేదని.. బీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చాక తగిన మూల్యం చెల్లించుకుంటారని పోలీసులను మాజీ మంత్రి హెచ్చరించారు. కాంగ్రెస్ పాలనపై ప్రజల తిరుగుబాటు మొదలైందన్నారు. ‘రాహుల్ గాంధీ.. మీ రాజ్యాంగం ఏమైందో చెప్పాలి’ అని డిమాండ్ చేశారు.
క్యాతనపల్లి ఇన్సిడెంట్‌పై గవర్నర్ రిపోర్ట్ తెప్పించుకోవాలని హరీశ్ రావు కోరారు. ‘వినాశకాలే విపరీత బుద్ధి.. పోలీసులూ తస్మాత్ జాగ్రత్త’ అంటూ మాజీ మంత్రి హరీశ్ రావు వార్నింగ్ ఇచ్చారు. కాగా, జైల్లో ఉన్న బాల్కసుమన్‌ను హరీశ్ రావుతో పాటు ఎమ్మెల్యేలు అనిల్ జాదవ్, కోవా లక్ష్మీ, మాజీ మంత్రి రామన్న పరామర్శించారు.
ఇవి కూడా చదవండి..
ఈనెల 26 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. బడ్జెట్ ఎప్పుడంటే
కొత్త పార్టీపై కవిత కీలక ప్రకటన
Read Latest Telangana News And Telugu News