Share News

ఊరి కోసం ఊరంతా..

ABN , Publish Date - Nov 23 , 2026 | 04:16 AM

పది రూపాయలు.. ఇటీవల కాలంలో చాలాచాలా చిన్నమొత్తం.. రూ.10 పోగొట్టుకుంటే.. పదేగా పోతే పోయిందిలే అని అనుకునే వాళ్లు ఎక్కువైపోయారు. కానీ ఆ పదికి మరో పది..

ఊరి కోసం ఊరంతా..

  • వారానికి రూ.10 చొప్పున కొన్నేళ్లుగా 128 ఆదివాసీ కుటుంబాల పొదుపు

  • తమ గ్రామాల అభివృద్ధికి, కష్టంలో ఉన్నవారిని ఆదుకునేందుకు ఆ నిధుల వినియోగం

  • చేయిచేయి కలిపి గ్రామాల అభివృద్ధికి బాటలు

  • ఆదర్శ గ్రామాలుగా ఆదిలాబాద్‌ జిల్లాలోని జామడ, పూసిగూడ

ఆదిలాబాద్‌, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): పది రూపాయలు.. ఇటీవల కాలంలో చాలాచాలా చిన్నమొత్తం.. రూ.10 పోగొట్టుకుంటే.. పదేగా పోతే పోయిందిలే అని అనుకునే వాళ్లు ఎక్కువైపోయారు. కానీ ఆ పదికి మరో పది.. కాదు 128 పదులు తోడైతే.. అది పెద్ద మొత్తమే అవుతుంది కదా..!! ఎక్కడో అడవిలో విసిరి పారేసినట్టుగా.. ఆదిలాబాద్‌ జిల్లా నార్నూర్‌ మండలంలో ఉన్న మారుమూల గిరిజన గ్రామాలైన జామడ, పూసిగూడ గ్రామాల ప్రజలు ఈ సూత్రాన్ని బాగా అర్థం చేసుకున్నారు. ఐకమత్యమే మహాబలం అని నమ్మి చేయిచేయి కలిపారు. కొన్నేళ్లుగా ప్రతీ ఇంటి నుంచి వారానికి రూ.10 చొప్పున విరాళం తీసుకుంటూ ఓ నిధిని ఏర్పాటు చేసుకున్నారు. తమ గ్రామాల్లో అభివృద్ధి పనుల నిర్వహణకు, కష్టాల్లో ఉన్నవారిని ఆదుకునేందుకు ఆ డబ్బును వినియోగిస్తూ ఎంతటి కష్టాన్నైనా కలిసికట్టుగా సులభంగా అధిగమిస్తున్నారు. కలిసి ఉంటే కలదు సుఖమని నిరూపిస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.


10 కిలోల పత్తితో మొదలై..

జామడ గ్రామ పంచాయతీ పరిధిలో 68 కుటుంబాలు, దాని అనుబంధ గ్రామమైన పూసిగూడలో 60 కుటుంబాలున్నాయి. రెండు గ్రామాల్లో కలిపి మొత్తం 604 మంది జనాభా నివసిస్తున్నారు. ఈ ఆదివాసీ గ్రామాల్లో పొదుపు అలవాటు 10 కిలోల పత్తి పంటతో మొదలైంది. కొన్నేళ్ల క్రితం గ్రామ పెద్దల నిర్ణయం మేరకు ప్రతి ఇంటి నుంచి 10 కిలోల పత్తి పంటను సేకరించి విక్రయించారు. అలా వచ్చిన డబ్బును గ్రామాభివృద్ధి పనులకు, వైద్య ఖర్చులకు డబ్బు లేక గ్రామంలో సాయం కోసం చూస్తున్న వారి కోసం ఉపయోగించేవారు. పత్తి బదులుగా ప్రస్తుతం ప్రతి ఇంటి నుంచి వారానికి రూ.10 సేకరిస్తున్నారు. కుల పెద్దలు నిర్ణయించిన వ్యక్తి ప్రతి సోమవారం ఇంటింటికీ వెళ్లి విరాళాలు సేకరిస్తారు.


ప్రతి నెల 1న గ్రామంలోని హనుమాన్‌ మందిరంలో అంద రూ సమావేశమవుతారు. సేకరించిన డబ్బును ఎలాంటి పనులకు ఉపయోగించాలనే దానిపై నిర్ణయం తీసుకుంటారు. ఇలా సేకరించిన నిధుల్లో నుంచి రూ.20లక్షలకు పైగా కేటాయిం చి ఆంజనేయ స్వామి ఆలయాన్ని నిర్మించుకున్నారు. పేద కుటుంబంలో వివాహాలు, అత్యవసర సమయంలో దవాఖానాల ఖర్చులు, చిన్న సన్నకారు రైతులకు వానాకాలం, యాసంగి సీజన్‌లో ఎరువులు, విత్తనాలు, స్ర్పే పంపులు కొనుగోలుకు అవసరమైన డబ్బును ఈ నిధుల నుంచి సమకూర్చుతుంటారు. ప్రస్తుతం రూ.10 లక్షల వరకు పొదుపు డబ్బులు ఉన్నాయని గ్రామస్థులు చెబుతున్నారు.


కళాబాయిని మామూలు మనిషిని చేసుకున్నారు

ఈ ఫొటోలో ఉన్న మహిళ పేరు పూసం కళాబాయి. నాలుగైదు నెలల క్రితం ఉన్నట్టు ఉండి మతిస్థిమితం పూర్తిగా కోల్పోయింది. కుటుంబ సభ్యులు స్థానికంగా ఎన్ని ఆస్పత్రుల్లో వైద్యం చేయించిన పరిస్థితి మెరుగుపడలేదు. కళాబాయి ఆరోగ్య పరిస్థితి రోజురోజుకు క్షీణిస్తూ వచ్చింది. గమనించిన గ్రామ పెద్దలు కళాబాయికి మరో వ్యక్తిని తోడుగా ఇచ్చి హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ ఆస్పత్రికి పంపించారు. అక్కడ రెండు నెలల వైద్యం అనంతరం కళాబాయి కోలుకుంది. ప్రస్తుతం అందరితో కలిసి వ్యవసాయ పనులకు కూడా వెళ్లివస్తోంది


అందరం ఐకమత్యంతో ఉంటాం

జామడ, పూసిగూడ ప్రజలందరం ఐకమత్యంతో ఉంటాం. గ్రామపెద్దల నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. గ్రామస్థులంతా కలిసిపొదుపు చేసుకుంటున్న డబ్బుతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాం. ఆపదలో ఉన్న వారికి అండగా నిలుస్తూ వస్తున్నాం. ముఖ్యంగా వైద్య ఖర్చులు, పంటల సాగుకు అవసరమైన పెట్టుబడి, ఇతర అత్యవసర ఖర్చుల కోసం పొదుపు డబ్బులను గ్రామస్థులకు అందిస్తున్నాం

- మెస్రం చంద్రశవ్‌, జామడ గ్రామ సర్పంచ్‌


ఈ వార్తలూ చదవండి

పార్టీకి నష్టపరిచేలా మాట్లాడితే చర్యలు.. సీఎం స్ట్రాంగ్ వార్నింగ్

పది లక్షల పుస్తకాల సేకరణే లక్ష్యం!

Updated Date - Nov 23 , 2026 | 04:16 AM