Share News

కేటీఆర్‌కు సమన్లు

ABN , Publish Date - May 15 , 2026 | 05:06 AM

ఫార్ములా-ఈ రేసు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏసీబీ దాఖలు చేసిన చార్జిషీట్‌ను ఏసీబీ కోర్టు పరిగణనలోకి తీసుకుంటూ మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు సమన్లు జారీ చేసింది.

కేటీఆర్‌కు సమన్లు

  • జూలై 31న విచారణకు రావాలి

  • ఫార్ములా-ఈ కారు రేసు కేసులో ఏసీబీ కోర్టు ఆదేశం

  • చార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం

హైదరాబాద్‌, మే 14(ఆంధ్రజ్యోతి): ఫార్ములా-ఈ రేసు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏసీబీ దాఖలు చేసిన చార్జిషీట్‌ను ఏసీబీ కోర్టు పరిగణనలోకి తీసుకుంటూ మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు సమన్లు జారీ చేసింది. ఈ కేసులో ఏ1 అయిన కేటీఆర్‌, ఇతర నిందితులైన ఐఏఎస్‌ అధికారి అరవింద కుమార్‌, హెచ్‌ఏండీఎ మాజీ చీఫ్‌ ఇంజనీర్‌ బీఎల్‌ఎన్‌ రెడ్డి, స్పోర్ట్స్‌ కన్సల్టెంట్‌ కిరణ్‌ మల్లేశ్వరరావు, ఫార్ములా ఈ ఆపరేషన్స్‌ సంస్థ ఎఫ్‌ఈవో అల్బర్ట్‌లను జూలై 31న విచారణకు హాజరుకావాలని సమన్లలో పేర్కొంది. హైదరాబాద్‌లో ఫార్ములా ఈ కారు రేసు నిర్వహణకు 2023 అక్టోబరులో ప్రారంభమైన ఒప్పంద ప్రక్రియ తర్వాత ప్రభుత్వ అనుమతి లేకుండానే రూ.55 కోట్లు చెల్లించారన్న ఆరోపణలపై ఏసీబీ 2024 డిసెంబరులో కేసు నమోదు చేసింది. అధికార దుర్వినియోగం, ఆర్థిక అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై దర్యాప్తు ప్రారంభించిన ఏసీబీ అధికారులు కేటీఆర్‌ తదితరులను పలుమార్లు విచారించారు. పలువురు ఐఏఎస్‌, హెచ్‌ఎండీఏ, ఆర్థిక శాఖ అధికారులను ప్రశ్నించారు. నిధుల బదిలీలో ఆర్‌బీఐ నిబంధనల ఉల్లంఘన ఆరోపణలపై బ్యాంకుల అధికారులను కూడా విచారించారు. పలు కీలక పత్రాలు, డిజిటల్‌ ఆధారాలు, బ్యాంకు లావాదేవీలు, ఒప్పంద పత్రాలను ఏసీబీ స్వాధీనం చేసుకుంది. ఈ వ్యవహారంలో మనీలాండరింగ్‌ కోణం ఉందన్న ఆరోపణల నేపథ్యంలో రంగంలో దిగిన ఈడీ అధికారులు సైతం కేటీఆర్‌, అరవిందకుమార్‌, బీఎల్‌ఎన్‌ రెడ్డి తదితరులను విచారించారు. విదేశీ సంస్థకు జరిగిన చెల్లింపులు, నిధుల బదిలీ, ఒప్పందాలపై ఆరా తీశారు. దర్యాప్తులో సేకరించిన ఆధారాలు, వాంగ్మూలాలు, ఆర్థిక లావాదేవీల ప్రకారం గవర్నర్‌ అనుమతి వచ్చిన తర్వాత ఏసీబీ అధికారులు కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. దానిని పరిశీలించిన ఏసీబీ కోర్టు గురువారం అధికారికంగా విచారణకు స్వీకరించి నిందితులకు సమన్లు జారీ చేయడంతో ఈ కేసు రాజకీయంగా, న్యాయపరంగా మరో దశకు చేరుకుంది.

Updated Date - May 15 , 2026 | 05:06 AM