కొత్త భవనంలో..సరికొత్త ప్రస్థానం!
ABN , Publish Date - Oct 22 , 2026 | 03:10 AM
మీడియా రంగంలో ఒక సంచలనంగా 2002లో విజయదశమి పర్వదినాన పునఃప్రారంభమైన ఆంధ్రజ్యోతి దినపత్రిక, పదిహేడేళ్ల క్రితం పురుడుపోసుకున్న ఏబీఎన్-ఆంధ్రజ్యోతి న్యూస్ చానల్ కలిసి కొత్త భవనంలోకి అడుగుపెట్టాయి
రజతోత్సవ వేళ ఒకేచోటికి ఆంధ్రజ్యోతి-ఏబీఎన్
అత్యాధునిక సాంకేతిక హంగులతో కేంద్ర కార్యాలయం
ఘనంగా ప్రారంభించిన చైర్మన్ వేమూరి రాధాకృష్ణ
హైదరాబాద్ ఫిల్మ్‌నగర్ ప్రధాన రహదారిలో
నవ నిర్మాణ శైలిలో బహుళ అంతస్తుల భవనం
న్యూజనరేషన్ టెక్నాలజీతో నవీకరించిన ఏబీఎన్
కొత్త భవనం నుంచి విధులకు శ్రీకారం
హైదరాబాద్, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): మీడియా రంగంలో ఒక సంచలనంగా 2002లో విజయదశమి పర్వదినాన పునఃప్రారంభమైన ఆంధ్రజ్యోతి దినపత్రిక, పదిహేడేళ్ల క్రితం పురుడుపోసుకున్న ఏబీఎన్-ఆంధ్రజ్యోతి న్యూస్ చానల్ కలిసి కొత్త భవనంలోకి అడుగుపెట్టాయి. ఆంధ్రజ్యోతి రజతోత్సవసంవత్సరంలోకి అడుగుపెట్టిన వేళ బుధవారం నుంచి ఒకేచోట కలిసి పని చేయడం ప్రారంభించాయి. అత్యాధునిక సదుపాయాలు, అధునాతన స్టూడియోలతో రూపు దిద్దుకున్న నూతన కార్యాలయంలో తమ ప్రయాణాన్ని ఆరంభించాయి. తమ ప్రస్థానంలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టాయి. హైదరాబాద్ ఫిల్మ్‌నగర్ ప్రధాన రహదారి(రోడ్ నంబర్ 82)లో నవ నిర్మాణ శైలిలో బహుళ అంతస్తులతో నిర్మించిన ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ ప్రధాన కార్యాలయాన్ని సంస్థల చైర్మన్ వేమూరి రాధాకృష్ణ బుధవారం ఉదయం పూజా కార్యక్రమాల అనంతరం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఛైర్మన్‌తో పాటు మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి ఆదిత్య, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ అనూష, డైరెక్టర్ శ్రుతికీర్తి, పబ్లిషర్ కోగంటి శేషగిరిరావు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. నవయుగ సంస్థల చైర్మన్ చింతా విశ్వేశ్వర్‌రావు, స్నేహితులు, శ్రేయోభిలాషులు ఈ కార్యక్రమానికి హాజరై వేమూరి రాధాకృష్ణను నూతన కార్యాలయంలోని ఆయన చాంబర్‌లో చైర్మన్ సీట్లో కూర్చోబెట్టారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ సంస్థలలోని వివిధ విభాగాల అధిపతులు, ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొని, చైర్మన్‌కు అభినందనలు తెలిపారు.

ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ సంస్థల అన్ని విభాగాల ఉద్యోగులు తమదైన ఈ పండుగలో ఆనందోత్సాహాలతో పాల్పంచుకున్నారు.


వెన్నుచూపని నైజం...!
కాలక్రమంలో అనేక ఒత్తిడులు ఎదురైనా, ఒడిదుడుగులకు లోనైనా ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ సంస్థలు సాహసిక దృక్పథంతో వాటన్నింటినీ అధిగమిస్తూ ఎదుర్కొని ప్రజల పక్షాన నిలబడి, పాలకులను, ప్రభుత్వాలనూ ప్రశ్నిస్తూనే ఉన్నాయి. తప్పొప్పులు చెప్పడంలో వెనకడుగు వేయకుండా పురోగమిస్తూనే ఉన్నాయి. ఈ నైజంతోనే ఆంధ్రజ్యోతి ప్రజల గుండెల్లో, తెలుగు పత్రికారంగంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. సంచలనాత్మకకథనాలతో ప్రభుత్వాలు, రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసిన సందర్భాలు అనేకం. ఆంధ్రజ్యోతి తన స్వతంత్ర సంపాదకీయ వైఖరిని కొనసాగిస్తూ ప్రజల గొంతుకగా నిలవడమే లక్ష్యంగా సాగుతోంది.

ఈ వార్తలను కూడా చదవండి..
టీవీ చానెళ్లు ప్రసార కార్యక్రమాల్లో నియమావళి పాటించాలి.. కేంద్రం అడ్వైజరీ
ఆర్‌ఎస్‌ఎస్‌పై రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు.. పిల్ల చేష్టలని కొట్టిపడేసిన బీజేపీ