ఒమన్‌లో చిక్కుకున్న 150 మంది తెలంగాణవాసులు.. స్వదేశానికి తీసుకురావాలని వినతి
ABN , Publish Date - Sep 16 , 2026 | 06:03 PM
ఏజెంట్ల మోసాలకు తెలంగాణ వలస కార్మికులు బలవుతున్నారు. ఓ ఏజెంట్ చేసిన మోసానికి 150 మంది తెలంగాణ వలస కార్మికులు ఒమన్‌లో చిక్కున్నారు. తమ వారిని స్వదేశానికి తీసుకురావాలని బాధిత కుటుంబ సభ్యులు జగిత్యాల ఎస్పీని ఆశ్రయించారు.
జగిత్యాల, సెప్టెంబర్ 16: ఏజెంట్ల మోసాలకు తెలంగాణ వలస కార్మికులు బలవుతున్నారు. గంగాధర్ అనే ఏజెంట్ చేసిన మోసానికి 150 మంది జగిత్యాల జిల్లావాసులు ఒమన్‌లో చిక్కున్నారు.
గంగాధర్ అనే ఏజెంట్ గల్ఫ్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామని ఒక్కొక్కరి నుంచి రూ.2 లక్షలు వసూలు చేశారని బాధితులు ఆరోపించారు. తమను మోసం చేసి గల్ఫ్‌కు పంపినట్లు వారు తెలిపారు. ఒక పని అని చెప్పిన గల్ఫ్ కంపెనీ తమతో వేరే పని చేయిస్తున్నట్లు బాధితులు వాపోతున్నారు. ఆ పనికి కూడా సరిగా జీతాలు ఇవ్వడంలేదని, తిండి కూడా పెట్టడం లేదని వారు గోడు వెళ్లబోసుకున్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ సహకారంతో కొంత మంది సొంత ఖర్చులతో స్వదేశానికి తిరిగి వచ్చారని వారు తెలిపారు. అంత పెద్ద మొత్తంలో తాము ఖర్చు పెట్టుకోలేమని.. తమను స్వదేశానికి తీసుకు వచ్చేలా ప్రభుత్వమే ఏర్పాట్లు చేయాలని బాధితులు ఆవేదన వెల్లగక్కారు.
ఈ మేరకు బాధిత కుటుంబాలు జిల్లా ఎస్పీ అశోక్‌కుమార్‌ను కలిసి, తమ కుటుంబసభ్యులను స్వదేశానికి తిరిగి తీసుకురావాలని విన్నవించుకున్నారు. ఏజెంట్ గంగాధర్‌పై ఇప్పటికే చాలా కేసులున్నాయని బాధితులు ఆరోపిస్తున్నారు. గతంలో అతడిని అరెస్ట్ చేసి 104 పాస్‌పోర్టులను స్వాధీనం చేసుకుని, పలువురి వీసాలు సీజ్ చేశారని.. అయినప్పటికీ గంగాధర్ కన్సెల్టెన్సీ పేరు మార్చి మళ్లీ మోసాలకు పాల్పడుతున్నాడని బాధితులు ఆరోపిస్తున్నారు. అతడిని అరెస్ట్ చేసి తగిన శిక్ష విధించాలని వారు డిమాండ్ చేశారు.
Also Read:
గ్యాస్, గుండెపోటు మధ్య తేడా ఏంటి? ఈ విషయాలు తెలుసుకోండి
నిద్రలో చెమటలు పడుతున్నాయా? కారణం ఇదే కావచ్చు!