Share News

ఏఐను తట్టుకునేవి ఈ మూడు వర్గాలే.. మెటా మాజీ అధికారి ఏం చెప్పారంటే..

ABN , Publish Date - Oct 08 , 2026 | 06:17 PM

: కృత్రిమ మేధస్సు (AI) వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో ఉద్యోగాల పరిస్థితి ఎలా ఉండబోతోందనే చర్చ ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతోంది. గతంలో సేల్స్‌ఫోర్స్, మెటా ఏఐ విభాగాల్లో కీలక బాధ్యతలు నిర్వహించిన క్లారా షిహ్ ఈ చర్చపై ఆసక్తికరంగా స్పందించారు.

ఏఐను తట్టుకునేవి ఈ మూడు వర్గాలే.. మెటా మాజీ అధికారి ఏం చెప్పారంటే..
Clara Shih

ఇంటర్నెట్ డెస్క్: కృత్రిమ మేధస్సు (AI) వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో ఉద్యోగాల పరిస్థితి ఎలా ఉండబోతోందనే చర్చ ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతోంది. గతంలో సేల్స్‌ఫోర్స్, మెటా ఏఐ విభాగాల్లో కీలక బాధ్యతలు నిర్వహించిన క్లారా షిహ్ ఈ చర్చపై ఆసక్తికరంగా స్పందించారు. భవిష్యత్తులో ఉద్యోగాలు ప్రధానంగా మూడు రకాలుగా ఉండే అవకాశం ఉందని ఆమె అంచనా వేశారు (Jobs that will survive AI).


క్లారా షిహ్ ప్రకారం.. ఏఐని తయారు చేసే వారు, ఏఐని ఉపయోగించే వారు, ఏఐ పర్యవేక్షణలో పనిచేసేవారు అనే మూడు వర్గాల ఉద్యోగాలు మాత్రమే భవిష్యత్తులో ఉండొచ్చు. మొదటి వర్గంలో ఏఐ వ్యవస్థలు, ఉత్పత్తులు, సాంకేతికతలను అభివృద్ధి చేసే ఉద్యోగాలు ఉంటాయి. ఏఐ నమూనాలను రూపొందించడం, శిక్షణ ఇవ్వడం, ఏఐ ఆధారిత ఉత్పత్తులను అభివృద్ధి చేయడం వంటి పనులు ఈ విభాగంలోకి వస్తాయి. ఏఐ రంగం విస్తరిస్తున్న కొద్దీ ఈ నైపుణ్యాలకు డిమాండ్ కొనసాగుతుందని క్లారా అభిప్రాయపడ్డారు (Artificial intelligence jobs).


రెండో వర్గంలో తమ పనిని మరింత వేగంగా, సమర్థంగా చేయడానికి ఏఐ సాధనాలను ఉపయోగించే ఉద్యోగులు ఉంటారు. చాలా మంది ఉద్యోగులు ఈ వర్గంలోనే ఉండే అవకాశం ఉందని షిహ్ చెప్పారు. అయితే ఏఐని ఉపయోగించే ఉద్యోగుల సంఖ్య చాలామంది ఊహించినంత పెద్దగా ఉండకపోవచ్చని, ఈ వర్గం కూడా క్రమంగా చిన్నదవుతోందని ఆమె పేర్కొన్నారు (Future of jobs).


ఇక, మూడో వర్గంలో ఏఐ ఆధారిత వ్యవస్థల ద్వారా పనితీరును పర్యవేక్షించే ఉద్యోగాలు ఉంటాయని క్లారా చెప్పారు (AI impact on jobs). ఇప్పటికే ఉబర్ డ్రైవర్లు, డోర్‌డాష్ డెలివరీ కార్మికులు వంటి ఉద్యోగాల్లో అలాంటి వ్యవస్థలు ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. కస్టమర్ సపోర్ట్, సేల్స్ డెవలప్‌మెంట్ వంటి కొన్ని పరిజ్ఞాన ఆధారిత ఉద్యోగాల్లోనూ ఏఐ ఆధారిత పర్యవేక్షణ పెరుగుతోందని తెలిపారు. మొత్తం మీద ఏఐ అభివృద్ధితో ఉద్యోగాలు పూర్తిగా అంతరించిపోతాయని చెప్పడం కంటే, ఉద్యోగాల స్వరూపం మారే అవకాశం ఉందన్నది క్లారా అభిప్రాయం.


ఇవి కూడా చదవండి..

ఢిల్లీలో ప్రతిపక్షాల నిరసన.. మోదీ జిందాబాద్ అంటూ నినాదాలు చేసిన వ్యక్తిపై దాడి..


సెన్సెక్స్ 1,100 పాయింట్లు పతనం.. రూ.8 లక్షల కోట్లు ఆవిరి..

Updated Date - Oct 08 , 2026 | 06:17 PM