వాట్సాప్ వెబ్ వాడుతున్నారా.. కేంద్రం కీలక హెచ్చరిక..
ABN , Publish Date - Nov 23 , 2026 | 06:28 PM
మీరు ఆఫీస్‌లోనో, సైబర్ కేఫ్‌లోనో కంప్యూటర్ ద్వారా వాట్సాప్ వెబ్ ఉపయోగిస్తున్నారా? అయితే జాగ్రత్తగా ఉండాల్సిందే. మీ వ్యక్తిగత సందేశాలు ఇతరుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఎదురు కావచ్చు.
ఇంటర్నెట్ డెస్క్: మీరు ఆఫీస్‌లోనో, సైబర్ కేఫ్‌లోనో కంప్యూటర్ ద్వారా వాట్సాప్ వెబ్ ఉపయోగిస్తున్నారా? అయితే జాగ్రత్తగా ఉండాల్సిందే. మీ వ్యక్తిగత సందేశాలు ఇతరుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఎదురు కావచ్చు. మీ వాట్సాప్ ఖాతాను ఇతరులు దుర్వినియోగం చేసి, మీ పేరుతో మోసాలకు పాల్పడే ప్రమాదం ఉందని కేంద్ర హోంశాఖకు చెందిన సైబర్ నేరాల విభాగం తాజాగా హెచ్చరించింది. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) పరిధిలోని నేషనల్ సైబర్ క్రైమ్ థ్రెట్ అనలిటిక్స్ యూనిట్ ఈ మేరకు తాజా సూచనలు జారీ చేసింది (WhatsApp Web Security Warning).
ఆఫీస్‌లో, పబ్లిక్ ప్రదేశాల్లో, ఇతరులతో పంచుకునే కంప్యూటర్లలో వాట్సాప్ వెబ్ ఉపయోగించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం తాజాగా సూచించింది. ఇతరులు వినియోగించే కంప్యూటర్లలో వాట్సాప్ వెబ్‌ను ఉపయోగిస్తే ఖాతా హ్యాక్ అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది. మీ వ్యక్తిగత సందేశాలను చదవడం, మీ పేరుతో నకిలీ మెసేజ్‌లను పంపడం, మీ పరిచయస్తులను మీ పేరుతో డబ్బులు అడగడం, నకిలీ లింకులు పంపి మోసాలకు పాల్పడడం వంటి ప్రమాదాలు సంభవించవచ్చు. చాలా మంది వాట్సాప్ వెబ్ వినియోగదారులు బ్రౌజర్ ట్యాబ్‌ను లేదా విండోను మూసేస్తే ఖాతా నుంచి బయటకు వచ్చినట్లేనని భావిస్తారు. అది సరికాదు (WhatsApp Web Scam).
వాట్సాప్ వెబ్ ఉపయోగించిన తర్వాత ప్రతిసారి తప్పనిసరిగా లాగ్ అవుట్ చేయాలని సైబర్ క్రైమ్ థ్రెట్ అనలిటిక్స్ యూనిట్ సూచించింది (WhatsApp Account Hacking). తప్పనిసరి పరిస్థితుల్లో రైల్వే స్టేషన్లు, హోటళ్లు, సైబర్ కేఫెలలో వాట్సాప్ వెబ్ వినియోగించాల్సి వస్తే ఇన్‌కాగ్నిటో మోడ్ లేదా ప్రైవేట్ బ్రౌజింగ్ విధానాన్ని ఉపయోగించాలి. పని పూర్తయిన వెంటనే ఖాతా నుంచి లాగ్ అవుట్ కావాలి. ప్రభుత్వ, ఆర్థిక, సంస్థలకు సంబంధించిన రహస్య సమాచారాన్ని కంప్యూటర్లలోని వాట్సాప్ వెబ్ ద్వారా పంపకూడదు.
ఇవి కూడా చదవండి..
స్టాక్ మార్కెట్ క్రాష్.. ఒక్కరోజే రూ.5 లక్షల కోట్లకు పైగా ఆవిరి..
గోద్రా రైలు దహనం కేసు.. 17 ఏళ్ల తర్వాత దోషికి బెయిల్..