ధ్రువ్ రాఠీకి అరెస్ట్ వారెంట్.. పరువు నష్టం కేసులో ఢిల్లీ కోర్టు కీలక ఆదేశాలు..
ABN , Publish Date - Nov 23 , 2026 | 04:30 PM
ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీకి ఢిల్లీ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. 2018 నాటి పరువు నష్టం కేసులో ఆయనపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఢిల్లీలోని సాకేత్ కోర్టుకు చెందిన జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ అనమ్ రయీస్ ఖాన్ సోమవారం ఈ ఆదేశాలు ఇచ్చారు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీకి ఢిల్లీ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. 2018 నాటి పరువు నష్టం కేసులో ఆయనపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఢిల్లీలోని సాకేత్ కోర్టుకు చెందిన జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ అనమ్ రయీస్ ఖాన్ సోమవారం ఈ ఆదేశాలు ఇచ్చారు. ఈ కేసులో తదుపరి విచారణను డిసెంబర్ 3కు వాయిదా వేశారు. 2018లో ధ్రువ్ తన యూట్యూబ్ ఛానెల్‌లో పోస్ట్ చేసిన వీడియో ఈ వివాదానికి మూల కారణం (Dhruv Rathee Arrest Warrant).
2018 మే నెలలో ధ్రువ్ రాఠీ తన యూట్యూబ్ ఛానల్‌లో 'బీజేపీ ఐటీ సెల్ పార్ట్-2' పేరుతో ఓ వీడియోను విడుదల చేశారు. అందులో బీజేపీ ఐటీ సెల్ తనను అప్రతిష్ఠపాలు చేసేందుకు లంచం ఇవ్వడానికి ప్రయత్నించిందని వికాస్ పాండే అనే బీజేపీ సోషల్ మీడియా మద్దతుదారు ఆరోపించినట్లు రాఠీ పేర్కొన్నారు. అయితే, ఈ ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని, తన ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఉన్నాయని వికాస్ పాండే అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో 2018లోనే ధ్రువ్ రాఠీపై క్రిమినల్ పరువు నష్టం కేసు దాఖలు చేశారు (Dhruv 2018 Defamation Case).
ధ్రువ్ రాఠీ రూపొందించిన ఈ వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. అప్పటి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా ఆ వీడియోను రీట్వీట్ చేశారు. దీంతో ధ్రువ్ రాఠీతో పాటు అరవింద్ కేజ్రీవాల్‌పైనా వికాస్ పాండే పరువు నష్టం చర్యలు ప్రారంభించారు. ఈ కేసులో వీడియోను రూపొందించి ప్రచురించిన రాఠీపై విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో ధ్రువ్ రాఠీకి గతంలోనూ కోర్టు పలుమార్లు సమన్లు జారీ చేసింది. 2019 జులైలో తొలిసారిగా ఆయనకు సమన్లు అందినట్లు కోర్టు రికార్డుల్లో పేర్కొన్నారు. అయితే ఆయన విదేశాల్లో నివసిస్తుండటంతో సమన్ల అందజేతలో ఇబ్బందులు ఎదురయ్యాయి (Non Bailable Warrant).
అక్టోబర్ 17న, 31న ధ్రువ్ రాఠీకి బెయిలబుల్ వారెంట్లు జారీ చేశారు. అయితే ఆయన కోర్టుకు హాజరుకాకపోవడం, గతంలో వారెంట్లు అమలు కాకపోవడం వంటి పరిణామాల నేపథ్యంలో తాజాగా నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది (Dhruv Rathee Defamation Case). డిసెంబర్ 3న ఈ కేసు మరోసారి విచారణకు రానుంది. కాగా, ధ్రువ్ రాఠీ సాధారణంగా ఆస్ట్రియాలో నివసిస్తారని ఆయన తరఫున న్యాయవాది కోర్టుకు గతంలో తెలిపారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నిరసన కార్యక్రమాల కోసం ధ్రువ్ భారత్‌కు వచ్చి వెళ్లారు.
ఇవి కూడా చదవండి..
స్టాక్ మార్కెట్ క్రాష్.. ఒక్కరోజే రూ.5 లక్షల కోట్లకు పైగా ఆవిరి..
గోద్రా రైలు దహనం కేసు.. 17 ఏళ్ల తర్వాత దోషికి బెయిల్..