Share News

యూట్యూబ్‌కి పోటీగా బిలిబిలి.. క్రియేటర్లకు భారీ ఆఫర్.!

ABN , Publish Date - Aug 27 , 2026 | 11:21 AM

చైనా ప్రముఖ వీడియో షేరింగ్‌ వేదిక బిలిబిలి పాశ్చాత్య దేశాల మార్కెట్లపై దృష్టి సారించింది. యూట్యూబ్‌కు ప్రత్యామ్నాయంగా ఎదిగిన ఈ సంస్థ.. అంతర్జాతీయంగా కంటెంట్‌ క్రియేటర్లను ఆకర్షించేందుకు అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ప్రతి 1,000 వ్యూస్‌కు సుమారు 0.70 డాలర్‌ చెల్లించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

యూట్యూబ్‌కి పోటీగా బిలిబిలి..  క్రియేటర్లకు భారీ ఆఫర్.!
Bilibili Global Expansion

బీజింగ్: చైనా ప్రముఖ వీడియో షేరింగ్‌ వేదిక బిలిబిలి పాశ్చాత్య దేశాల మార్కెట్లపై దృష్టి సారించింది. యూట్యూబ్‌కు ప్రత్యామ్నాయంగా ఎదిగిన ఈ సంస్థ.. అంతర్జాతీయంగా కంటెంట్‌ క్రియేటర్లను ఆకర్షించేందుకు అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ప్రతి 1,000 వ్యూస్‌కు సుమారు 0.70 డాలర్‌ (దాదాపు రూ.60) చెల్లించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ చెల్లింపులపై బిలిబిలి అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.


ఈ విషయంపై సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. యూట్యూబ్‌తో పోలిస్తే క్రియేటర్లకు మెరుగైన ఆదాయం అందించేందుకు బిలిబిలి ప్రయత్నిస్తోందనే చర్చ మొదలైంది. స్పానిష్‌ భాషా ఖాతా ఎల్‌ డుయి కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ బిలిబిలి ప్రతి 1,000 వ్యూస్‌కు సుమారు 0.70 డాలర్‌ చెల్లించనుందని తెలిపింది. ఈ వేదిక ఇప్పటికే 37 కోట్లకు పైగా నెలవారీ వినియోగదారులను కలిగి ఉందని పేర్కొంది. అంతర్జాతీయ క్రియేటర్ల కోసం మానిటైజేషన్‌ అవకాశాలను తెరుస్తోందని తెలిపింది. అంతర్జాతీయ వెర్షన్‌లో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను సులభతరం చేయడంతో పాటు.. తప్పనిసరి గుర్తింపు ధ్రువీకరణను తొలగించే అవకాశం ఉందని ఓ అంతర్జాతీయ కథనం పేర్కొంది. అలాగే, విదేశీ వినియోగదారులకు అనుగుణంగా స్థానిక కంటెంట్‌, ప్రత్యేక ఫీచర్లను అందించేందుకు సంస్థ సిద్ధమవుతున్నట్లు చెప్పుకొచ్చింది.


కాగా, చైనాలో 2009లో ప్రారంభమై యూట్యూబ్‌కు ప్రత్యామ్నాయంగా బిలిబిలి ఎదిగింది. ప్రస్తుతం దీనికి 35 కోట్లకు పైగా నెలవారీ యాక్టివ్‌ యూజర్లు ఉన్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. యూట్యూబ్‌ స్టార్‌ మిస్టర్‌బీస్ట్‌ వంటి ప్రముఖ క్రియేటర్లు ఇప్పటికే ఈ వేదికపై తమ కంటెంట్‌ను అందిస్తున్నారు. అయితే, బిలిబిలి ముందు అనేక సవాళ్లు ఉన్నా కొత్త ప్రేక్షకులను చేరుకునే అవకాశం, పోటీగా మెరుగైన చెల్లింపులు అందించే ప్రయత్నం కలిసొచ్చే అంశాలుగా మారవచ్చు. యూట్యూబ్‌ ఆధిపత్యానికి సవాల్‌ విసురుతూ చైనా నుంచి వస్తున్న ఈ కొత్త పోటీ.. అంతర్జాతీయ క్రియేటర్లను ఎంతవరకు ఆకర్షిస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.


ఈ వార్తలు కూడా చదవండి

రష్యాలోని ఏజీసీసీ ప్లాంట్‌లో భారీ పేలుడు.. ఏడుగురి మృతి, 152 మందికి గాయాలు..

గ్యిరాంగ్‌లోకి అనుమతించండి.. గల్లంతైన 80 మంది యాత్రికుల కోసం సద్గురు ఆందోళన..

Updated Date - Aug 27 , 2026 | 12:22 PM