Share News

గాలిస్తాం.. అనుమతించండి.. చైనా అధికారులను అభ్యర్థించిన సద్గురు

ABN , Publish Date - Aug 27 , 2026 | 11:07 AM

టిబెట్‌లోని గ్యిరాంగ్‌ ప్రాంతంలో సంభవించిన వరదల్లో గల్లంతైన కైలాష్‌ మానస సరోవర్‌ యాత్రికుల ఆచూకీ కోసం ఆధ్యాత్మిక గురువు, ఇషా ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

గాలిస్తాం.. అనుమతించండి.. చైనా అధికారులను అభ్యర్థించిన సద్గురు
Sadhguru appeal

ఇంటర్నెట్ డెస్క్: నేపాల్-టిబెట్ సరిహద్దు ప్రాంతంలో సంభవించిన భారీ ఆకస్మిక వరదలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. టిబెట్‌లోని గ్యిరాంగ్‌ ప్రాంతంలో సంభవించిన వరదల్లో గల్లంతైన కైలాష్‌ మానస సరోవర్‌ యాత్రికుల ఆచూకీ కోసం ఆధ్యాత్మిక గురువు, ఇషా ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. గ్యిరాంగ్‌కు వెళ్లి గాలింపు చర్యల్లో సహకరించేందుకు అనుమతించాలని చైనా అధికారులను ప్రత్యేక అనుమతి కోరారు (Tibet floods Sadhguru appeal).


తమ బృందానికి చెందిన 80 మంది ఆచూకీ తెలియడం లేదని సద్గురు జగ్గీ వాసుదేవ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. వీరిలో 77 మంది యాత్రికులు గ్యిరాంగ్‌లోని ఇమ్మిగ్రేషన్‌ కేంద్రంలో ఉన్న సమయంలో అకస్మాత్తుగా వరదలు రావడంతో వారితో సంబంధాలు తెగిపోయాయన్నారు. ప్రస్తుతం తాను సాగా ప్రాంతంలో ఉన్నానని, వరద ప్రభావిత గ్యిరాంగ్‌కు వెళ్లేందుకు అనుమతి లభిస్తే గల్లంతైన వారి కోసం గాలింపులో సహకరిస్తామని సద్గురు తెలిపారు (Gyirong flash floods).


రెస్క్యూ సిబ్బంది చేస్తున్న సహాయక చర్యలకు ఎలాంటి ఆటంకం కలిగించబోమని సద్గురు స్పష్టం చేశారు (Kailash Mansarovar pilgrims). తమవారి కుటుంబాలకు ఏదైనా సమాచారం అందించేందుకు, గాలింపు చర్యల్లో తమ వంతు సహాయం చేసేందుకు అనుమతించాలని చైనా అధికారులకు విజ్ఞప్తి చేశారు.


ఇషా ఫౌండేషన్‌ తెలిపిన వివరాల ప్రకారం, మొత్తం 21 బృందాలు కైలాష్‌ యాత్రలో పాల్గొన్నాయి. వారిలో 495 మంది సురక్షితంగా తిరిగి వచ్చారు. 743 మంది టిబెట్‌లో, 148 మంది నేపాల్‌లో ఉండిపోయారు. వారిలో 77 మంది గ్యిరాంగ్‌ ఇమ్మిగ్రేషన్‌ కేంద్రంలో ఉండగా భారీ వరదలు ముంచెత్తాయి. దీంతో వారి గురించి సమాచారం లేకుండా పోయింది.


ఇవి కూడా చదవండి..

నేపాల్‌లో ఆకస్మిక వరదలు.. 133 మంది భారతీయ యాత్రికుల గల్లంతు..


స్థిరంగా పసిడి ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

Updated Date - Aug 27 , 2026 | 11:50 AM