Share News

వాడకం అంటే ఇదీ.. ఏఐతో పావురాల బెడదకు చెక్

ABN , Publish Date - May 15 , 2026 | 12:47 PM

బాల్కనీలో పావురాల బెడదకు ఏఐతో ఒక వ్యక్తి చెక్ పెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం విపరీతంగా వైరల్ అవుతోంది. జనాలు అబ్బురపడేలా చేస్తోంది.

వాడకం అంటే ఇదీ.. ఏఐతో పావురాల బెడదకు చెక్
AI controlled Water Gun for Pigeion Menace

ఇంటర్నెట్ డెస్క్: కృత్రిమ మేధతో సాధించలేనిది ఏదీ లేదన్న భావన బలపడేలా రోజుకో కొత్త ఉదంతం వెలుగులోకి వస్తోంది. ఇందుకు తాజా ఉదాహరణగా ఒక వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ఏఐ సాయంతో ఒక వ్యక్తి పావురాల బెడదకు చెక్ పెట్టిన తీరు చూసి జనాలు అబ్బురపడుతున్నారు.

అపార్ట్‌మెంట్‌లల్లో నివసించే వారు పావురాలతో ఎంత ఇబ్బంది పడుతుంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీటికి చెక్ పెట్టేందుకు అనుసరించే చిట్కాలతో ఒక్కోసారి ఆశించిన ఫలితం ఉండదు. ఇలాంటి ఇబ్బంది ఎదుర్కొన్న ఒక వ్యక్తి పావురాలకు ఏఐతో చెక్ పెట్టారు. పావురాయి కనిపించగానే దానిపై నీరు చల్లి వెళ్లగొట్టేలా ఏఐ ఆధారిత వాటర్ గన్ వ్యవస్థను రూపొందించారు. యూఎస్‌బీ కెమెరా, పావురాలను గుర్తించేందుకు యోలో వరల్డ్ వీ2 ఏఐ విజన్ సాఫ్ట్‌వేర్, పావురాలను టార్గెట్ చేసేందుకు ప్రత్యేక మోటర్స్‌పై అమర్చిన వాటర్ గన్ సాయంతో ఈ వ్యవస్థను రూపొందించారు. తన వద్ద ఉన్న ఆరెంజ్ పీఐ 5 కంప్యూటర్ సాయంతో ఈ ఏఐ మోడల్‌ను రన్ చేస్తున్నట్టు చెప్పారు.


కెమెరా నుంచి వచ్చే డేటా‌ను ఏఐ సాఫ్ట్‌వేర్ విశ్లేషించి పావురాలను గుర్తిస్తుంది. అనంతరం వాటర్ గన్‌‌ను వాటిపై గురిపెట్టి నీటిని జల్లుతుంది. బాల్కనీలో ఈ వ్యవస్థను అమర్చాక పక్షులు అక్కడ ఉండలేక చెల్లాచెదురుగా ఎగిరిపోతున్న వీడియోను కూడా సదరు యూజర్ షేర్ చేశారు. పావురాలనే కాకుండా ఉడతలు, పిల్లుల వంటి అవాంఛనీయ అతిథులు అన్నిటినీ ఈ వ్యవస్థతో వెళ్లగొట్టవచ్చని ఆ యూజర్ చెప్పారు. తమ అవసరాల మేరకు ఏఐలో టార్గెట్‌ను సెట్ చేసుకుంటే సరిపోతుందని వివరించారు.

ఈ వీడియోపై జనాల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ఏఐని ఎలా వాడాలో తెలిసిన వారికి లైఫ్ చాలా సింపుల్ అయిపోతుందని కొందరు కామెంట్ చేశారు. ఇలాంటి చిన్న విషయాలకు కూడా ఏఐ వాడగలుగుతున్నామంటే ఈ సాంకేతికత సామాన్యులకు ఎంతలా అందుబాటులోకి వచ్చిందో అర్థం చేసుకోవచ్చని మరికొందరు అభిప్రాయపడ్డారు. ఇంట్లోని సాధారణ కంప్యూటర్లతో ఏఐని వాడుకునే స్థాయికి టెక్నాలజీ అభివృద్ధి చెందుతోందని అన్నారు. వీడియో కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి


ఈ వార్తలనూ చదవండి:

ఏఐతో చివరకు కంపెనీలకే ముప్పు!

కంప్యూటర్ సైన్స్ కోర్సు తీసుకుంటున్నారా.. రెప్లిట్ సంస్థ సీఈఓ చెప్పేదేంటంటే..

Updated Date - May 15 , 2026 | 01:12 PM