Share News

ఏఐతో చివరకు కంపెనీలకు ముప్పు!

ABN , Publish Date - Apr 30 , 2026 | 10:06 PM

ఏఐపై భారీగా పెట్టుబడులు పెడుతున్న కంపెనీలకు భవిష్యత్తులో చిక్కులు తప్పవని పరిశోధకులు తాజాగా తేల్చి చెప్పారు. ప్రజల ఆదాయం పడిపోతే కంపెనీల ఉత్పత్తులకు డిమాండ్ ఉండదని అంటున్నారు.

ఏఐతో చివరకు కంపెనీలకు ముప్పు!
AI layoffs impact

ఇంటర్నెట్ డెస్క్: ఏఐ వినియోగం అంతకంతకూ పెరుగుతోంది. కోడింగ్ మొదలు కస్టమర్ సపోర్టు వరకూ అనేక విభాగాల్లోని ఏఐ క్రమంగా వేళ్లూనుకుంటోంది. ఈ క్రమంలో ఉద్యోగుల తొలగింపులు ఎక్కువ అవుతున్నాయి. అయితే, ఈ ట్రెండ్ దీర్ఘకాలంలో కంపెనీలపైనే ప్రభావం చూపుతుందని యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా, బోస్టన్ యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు. ఈ మేరకు వారు ‘ది ఏఐ లేఆఫ్స్ ట్రాప్’ అనే పరిశోధన పత్రాన్ని ప్రచురించారు.

పరిశోధకుల ప్రకారం, ప్రస్తుతం అనేక సంస్థలో ఏఐ రేసులో దూసుకెళ్లేందుకు ఒకదానితో మరొకటి పోటీ పడుతున్నాయి. ఏఐ వినియోగాన్ని పెంచుతూ వర్కర్లను పక్కనపెడుతున్నాయి. దీర్ఘకాలంలో ఇది కంపెనీలపైనే ప్రభావం చూపుతుందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. తొలగింపుల కారణంగా ప్రజల ఆదాయాలు తగ్గి కంపెనీల ఉత్పత్తులు, సేవలకు డిమాండ్ పడిపోతుందని అంచనా వేస్తున్నారు. చివరకు కంపెనీల ఆదాయాలు తగ్గుతాయని అంటున్నారు. తొలగింపులకు అనుగుణంగా సర్దుబాటు చేసుకునే అవకావం సమాజానికి దక్కకపోతే చివరకు కంపెనీల ఉత్పత్తులకు డిమాండ్ తగ్గుతుందని తెలిపారు.


మరి ఈ విషయాలు కంపెనీలకు తెలియవా? అంటే తెలుసనే అంటున్నారు పరిశోధకులు. లేఆఫ్స్ ద్వారా ఖర్చులు తగ్గి కంపెనీల స్వల్పకాలిక లాభాలు పెరుగుతాయి. ఇక లేఆఫ్స్‌తో తగ్గే ప్రజల ఆదాయంతో పాటు డిమాండ్ వస్తుసేవలకు పడిపోతే ఆ భారం మాత్రం యావత్ ఆర్థికవ్యవస్థపై పడుతుంది. ఫలితంగా సంస్థలపై స్వల్ప కాలంలో ఒత్తిడి కాస్త తక్కువగా ఉంటుంది. అయితే, దీర్ఘకాలంలో మాత్రం ప్రతికూల ఫలితాలు వస్తాయని పరిశోధకులు అంచనా వేశారు. ఏఐ రేసులో వెనకబడవద్దన్న పట్టుదలతో ఉన్న కంపెనీలు.. ఏఐపై విషయంలో మరో ఆలోచన లేకుండా ముందుకు వెళుతున్నాయని అంటున్నారు.

అయితే, ఏఐ వల్ల కొన్ని ఉద్యోగాలు తగ్గుతున్నప్పటికీ, కొత్త రకాల ఉద్యోగాలు (AI ట్రైనింగ్, డేటా అనలిసిస్, ఆటోమేషన్ మేనేజ్‌మెంట్) కూడా పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. కొన్ని సంస్థలు పూర్తిగా ఉద్యోగులను తొలగించడం కాకుండా, AIతో కలిసి పనిచేసే విధానాలను అమలు చేస్తున్నాయి. కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడల్లా ఈ మార్పులు కనిపించినప్పటికీ అంతిమంగా సమాజం తనని తాను కొత్త పరిస్థితులకు అనుగుణంగా సర్దుబాటు చేసుకుందని కూడా చెబుతున్నారు. ఇక ఏఐతో ఉత్పాదకత పెరగడం వల్ల కొత్త మార్కెట్లు, సేవలు కూడా ఉనికిలోకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

Updated Date - May 01 , 2026 | 09:29 AM