Share News

కంప్యూటర్ సైన్స్ కోర్సు తీసుకుంటున్నారా.. రెప్లిట్ సంస్థ సీఈఓ చెప్పేదేంటంటే..

ABN , Publish Date - Apr 30 , 2026 | 08:28 PM

మంచి శాలరీలు వస్తాయన్న ఆశతో కంప్యూటర్ కోర్సును ఎంచుకోవడం మూర్ఖత్వమని రెప్లిట్ సంస్థ సీఈఓ అభిప్రాయపడ్డారు. అమితాసక్తి ఉన్న వారే ఈ రంగాన్ని ఎంచుకోవాలని స్పష్టం చేశారు.

కంప్యూటర్ సైన్స్ కోర్సు తీసుకుంటున్నారా.. రెప్లిట్ సంస్థ సీఈఓ చెప్పేదేంటంటే..
Future of Software Engineering

ఇంటర్నెట్ డెస్క్: మంచి జీతాలు వస్తాయన్న ఒకే ఒక కారణంతో కంప్యూటర్ సైన్స్ కోర్సుల్లో చేరవద్దని రెప్లిట్ సంస్థ సీఈఓ అమ్జద్ మసాద్ తాజాగా విద్యార్థులను హెచ్చరించారు. అలా చేయడం మూర్ఖత్వమని హెచ్చరించారు. యూనివర్సిటీల్లో కొత్తగా చేరే వారికి ఈ వార్నింగ్ ఇచ్చారు.

‘దీపం వైపు మిడతలు ఆకర్షితులైనట్టుగా మీకు కంప్యూటర్ సైన్స్‌పై ఆసక్తి ఉంటేనే ఆ కోర్సులో చేరండి. లేకపోతే వద్దు. గూగుల్‌లో జాబ్ కొడితే భారీగా డబ్బులు వస్తాయని ఎవరో చెప్పారంటూ ఈ కోర్సులో చేరవద్దు. ఆసక్తి లేనప్పుడు ఈ సబ్జెక్టును ఎంచుకోవడం చాలా మూర్ఖపు పని’ అని ఆయన స్పష్టం చేశారు.


కంప్యూటర్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలన్న ఆసక్తి ఉన్నవారు ఒకప్పుడు కంప్యూటర్ కోర్సుల్లో చేరే వారని రెప్లిట్ సీఈఓ తెలిపారు. కాలక్రమంలో ఆ రంగంలో శాలరీలు పెరగడంతో విద్యార్థులు ఆకర్షితులయ్యారని అన్నారు. అయితే, ఏఐ రాకతో ఈ రంగంలో మళ్లీ మార్పులు మొదలయ్యాయని చెప్పారు. పని తీరులో మార్పు వచ్చినా ఇప్పటికీ ఈ రంగంలో అనేక అవకాశాలు ఉన్నాయని అన్నారు. ‘మీకు ఆసక్తి ఉంటే ఇప్పటికీ ఈ రంగాన్ని ఎంచుకోవచ్చు. మెషీన్ లర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సులు చేసి పెద్ద లాబ్స్ లేదా సంస్థల్లో చేరవచ్చు’ అని చెప్పారు. అయితే, డేటా స్ట్రక్చర్లు, ఆల్గోరిథమ్స్‌ వంటి మౌలిక అంశాలపై విద్యార్థులకు కచ్చితంగా పట్టు ఉండాలని అన్నారు.

Updated Date - Apr 30 , 2026 | 08:53 PM