Share News

హైప్డ్ సంవాదినితో సైబర్ మోసాలకు అడ్డుకట్ట

ABN , Publish Date - Mar 22 , 2026 | 09:38 AM

విదేశీ డిజిటల్ కమ్యూనికేషన్ ప్లాట్‌ఫామ్స్ వల్ల కోట్లాది మంది భారతీయులు సైబర్ నేరాలకు గురవుతున్నారు. ఈ నేరాలకు భారత్ అడ్డుకట్ట వేసింది. అందుకోసం రెండు యాప్‌లను ఏఐసీటీఈ అభివృద్ధి చేసింది.

హైప్డ్ సంవాదినితో సైబర్ మోసాలకు అడ్డుకట్ట
Hyped Samvadini, Desi GenZ Keyboard

ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతం దేశంలో 80 కోట్ల మందికి పైగా భారతీయ పౌరులు విదేశీ డిజిటల్ కమ్యూనికేషన్ ప్లాట్‌ఫారంపై ఆధారపడి ఉన్నారు. వీటి వల్ల భారీగా వివిధ మార్గాల్లో సైబర్ మోసాలు జరుగుతున్నాయి. వీటికి అడ్డుకట్ట వేసేందుకు ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) ఆధ్వర్యంలో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఏఐ అనువాదిని ‘హైప్డ్ సంవాదిని’ (Hyped Samvadini), ‘దేశీ ఏఐ జెన్‌జీ కీ బోర్డు’ (Desi AI GenZ Keyboard) పేర్లతో రెండు అత్యాధునిక యాప్‌లను అభివృద్ధి చేసింది. ఇవి సాంకేతికంగా అభివృద్ధి చెందడమే కాకుండా.. వినియోగాదారుల భద్రత, గోప్యతతోపాటు భాషా సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఏఐసీటీఈ రూపొందించింది.


వీటిని ఆండ్రాయిడ్, ఐఓఎస్ వినియోగదారులంతా డౌన్‌లోడ్ చేసుకుని వినియోగించుకోవచ్చు. అయితే హైప్డ్ సంవాదిని వాట్సప్ తరహాలో ఎండ్- టు- ఎండ్ ఎన్‌క్రిప్టెడ్‌గా ఉంటుంది. అడ్వాన్స్‌డ్ యాంటీస్పామ్ మెకానిజాన్ని ఇందులో పొందుపరిచారు. ఇది సైబర్ మోసాలను నియంత్రిస్తోందని కేంద్రం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ హైప్డ్ సంవాదినిలో వన్ టు వన్, గ్రూప్, బ్రాడ్ కాస్ట్ మెసేజ్‌లు భద్రంగా పంపుకోవచ్చు. ఆడియో, వీడియో కాల్స్ సైతం చేసుకోవచ్చు. 55కి పైగా భాషల్లో రియల్‌టైమ్ ట్రాన్స్‌లేషన్ అందుబాటులో ఉంటుంది.


బహుభాషా సామర్థ్యాన్ని కలిగి ఉండడం వీటి ప్రత్యేకత. అనువాదిని ఏఐ అత్యాధునిక సాంకేతికత ద్వారా 22 భారతీయ, 37 విదేశీ భాషల్లో రీయల్ టైమ్ టెక్ట్స్‌తోపాటు వాయిస్ అనువాదాన్ని అందిస్తుంది. ఇది ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిని మరింత బలపరుస్తుంది. ఏఐ ద్వారా అభివృద్ధి చేసిన ఈ రెండు యాప్‌లు పూర్తి స్వదేశీ డిజిటల్ పరిష్కారాలని స్పష్టం చేస్తున్నారు. ఇవి భారతదేశంలోని భాషా శక్తి, సాంకేతిక సామర్థ్యంతోపాటు ఆవిష్కరణలను ప్రతిబింబిస్తాయి. అలాగే భారతదేశం డిజిటల్ భవిష్యత్తు వైపు సాగుతోందని దీని ద్వారా స్పష్టమవుతుంది.

Updated Date - Mar 22 , 2026 | 12:14 PM