డబ్ల్యూపీఎల్-2026: సెంచరీతో చెలరేగిన సీవర్.. ఆర్సీబీ ముందు భారీ టార్గెట్
ABN , Publish Date - Jan 26 , 2026 | 09:20 PM
మహిళల ప్రీమియర్ లీగ్-2026లో భాగంగా వడోదర వేదికగా ఆర్సీబీతో జరుగుతోన్న మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ భారీ స్కోరు చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. వన్‌డౌన్‌లో వచ్చిన నాట్ సీవర్ బ్రంట్ (100*; 57 బంతులు) శతకంతో ఆకట్టుకుంది.
స్పోర్ట్స్ డెస్క్: మహిళల ప్రీమియర్ లీగ్ (WPL 2026)లో భాగంగా వడోదర వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో(MI VS RCB) జరుగుతున్న మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ భారీ స్కోరు చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగిన ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. వన్‌డౌన్ బ్యాటింగ్‌కు వచ్చిన నాట్ సీవర్ బ్రంట్(Nat Sciver Brunt) (100*; 57 బంతులు) శతకంతో ఆకట్టుకుంది. నాట్‌తో పాటు ఓపెనర్ హేలీ మాథ్యూస్ (56; 39 బంతులు) అర్ధ శతకంతో రాణించింది.
కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(Harmanpreet Kaur) (20; 12 బంతుల్లో) దూకుడుగా ఆడినా చివరి వరకు క్రీజులో నిలదొక్కుకోలేకపోయింది. నాట్ సీవర్, హేలీ రెండో వికెట్‌కు 73 బంతుల్లో 131 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ జోడీని విడదీసేందుకు ఆర్సీబీ బౌలర్లు తీవ్రంగా శ్రమించారు. శ్రేయాంక వేసిన 12వ ఓవర్‌లో నాట్ సీవర్ వరుసగా మూడు ఫోర్లు బాదింది. ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో నాలుగో బంతికి నాట్ సెంచరీ పూర్తి చేసుకుంది. ఇక ఆర్సీబీ బౌలర్లలో లారెన్ బెల్(Lauren Bell) 2 వికెట్లు సాధించింది. అలానే నదైన్ డి క్లర్క్, శ్రేయాంక పాటిల్ ఒక్కో వికెట్ పడగొట్టారు. మొత్తంగా ఆర్సీబీ ముందు 200 పరుగుల భారీ టార్గెట్‌ను ముంబై ఇండియన్స్ ఉంచింది.
ఇక ఈ మ్యాచ్ ముంబై(Mumbai Indians)కి చాలా కీలకమైనది. ఇందులో గెలిస్తేనే ఆ జట్టు ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంటాయి. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లు ఆడిన ముంబై ఇండియన్స్.. రెండింటిలో మాత్రమే గెలిచింది. మిగతా నాలుగు మ్యాచ్‌ల్లో ఓడింది. మరోవైపు బెంగళూరు జట్టు ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ఐదు గెలిచి.. ఒకటి ఓడింది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆర్సీబీ మాత్రమే ప్లే ఆఫ్స్ బెర్తును ఖరారు చేసుకుంది. మిగిలిన రెండు స్థానాల కోసం తీవ్రమైన పోటీ ఉంది.
ఇవి కూడా చదవండి:
మా వాళ్లతో జాగ్రత్త.. పాక్‌కు టీమిండియా మాజీ క్రికెటర్ వార్నింగ్
అరుదైన చెత్త రికార్డుతో కోహ్లీ సరసన చేరిన సంజూ