WPL 2026: ముగిసిన ముంబై బ్యాటింగ్.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే..
ABN , Publish Date - Jan 20 , 2026 | 09:41 PM
మహిళా ప్రీమియర్ లీగ్- 2026లో ఇవాళ (మంగళవారం) ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ తలపడుతున్నాయి. వడోదర వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన ముంబై ఇండియన్స్ స్వల్ప స్కోర్కే పరిమితమైంది.
స్పోర్ట్స్ డెస్క్: మహిళా ప్రీమియర్ లీగ్-2026 (WPL) ఇవాళ (మంగళవారం) ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ తలపడుతున్నాయి. వడోదర వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ కు దిగిన ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. నాట్ సీవర్ బ్రంట్ (65 నాటౌట్) అజేయ అర్ధ శతకంతో రాణించింది.
బ్రంట్‌కు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (41) సహకరించింది. వీరిద్దరు సత్తా చాటడంతో ముంబై ఇండియన్స్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. సంజీవన్ సజనా (9), హేలీ మాథ్యూస్ (12), నికోలా కేరీ (12), అమన్‌జోత్ కౌర్ (3) స్వల్ప స్కోర్లకే పరిమితమయ్యారు. ఆఖర్లో సంస్కృతి గుప్త (10 నాటౌట్) బ్యాట్ ఝులిపించింది. ఇక ఢిల్లీ బౌలర్లలో శ్రీ చరణి 3, మారిజాన్ కాప్, నందిని శర్మ తలో ఒక వికెట్ తీశారు. షఫాలీ వర్మ ఓ ఓవర్ వేసి 14 పరుగులు సమర్పించుకుంది.
కాగా, ప్రస్తుత ఎడిషన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగిన ముంబై ఆ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతుంది. ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో రెండే విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. నెట్ రన్ రేట్ కారణంగానే ఆ జట్టు రెండో స్థానంలో ఉంది. మరో రెండు జట్లు కూడా సమాంతర పాయింట్లు కలిగి ఉన్నాయి. యూపీ, గుజరాత్ కూడా ఐదు మ్యాచ్‌ల్లో తలా రెండేసి విజయాలు సాధించి మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ విషయానికొస్తే.. 4 మ్యాచ్‌ల్లో ఒకే ఒక విజయంతో చివరి స్థానంలో ఉంది.