Share News

వినేశ్ ఫొగాట్‌పై అనర్హత వేటు వేసిన రెజ్లింగ్ సమాఖ్య

ABN , Publish Date - May 09 , 2026 | 04:08 PM

స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌పై భారత రెజ్లింగ్ సమాఖ్య అనర్హత వేటు వేసింది. క్రమశిక్షణా రాహిత్యం, డోపింగ్ నిరోధక నిబంధనల ఉల్లంఘనకు పాల్పడ్డారన్న ఆరోపణలపై షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దీంతోపాటు జూన్ 26 వరకు దేశీయ పోటీల్లో పాల్గొనేందుకు అనర్హురాలిగా ప్రకటించింది.

వినేశ్ ఫొగాట్‌పై అనర్హత వేటు వేసిన రెజ్లింగ్ సమాఖ్య
Vinesh Phogat

ఇంటర్నెట్ డెస్క్: స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌పై భారత రెజ్లింగ్ సమాఖ్య అనర్హత వేటు వేసింది. క్రమశిక్షణా రాహిత్యం, డోపింగ్ నిరోధక నిబంధనల ఉల్లంఘనకు పాల్పడ్డారన్న ఆరోపణలపై షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దీంతోపాటు జూన్ 26 వరకు దేశీయ పోటీల్లో పాల్గొనేందుకు అనర్హురాలిగా ప్రకటించింది. ఆమె ఉత్తరప్రదేశ్‌లోని గొండాలో మే 10 నుంచి 12 వరకు జరగనున్న జాతీయ ఓపెన్ ర్యాంకింగ్ టోర్నీలోనూ పాల్గొనలేరని స్పష్టం చేసింది. దీంతో పారిస్ ఒలింపిక్స్ తర్వాత రీఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నిస్తోన్న వినేశ్‌కు తాజా పరిణామంతో షాక్ తగిలినట్లు అయింది.


‘అంతర్జాతీయ నిబంధనల ప్రకారం.. పదవీ విరమణ నుంచి తిరిగి పోటీల్లో పాల్గొనేందుకు అవసరమైన ఆరు నెలల నోటీస్ వ్యవధిని పూర్తి చేయడంలో వినేశ్ విఫలమైంది. ఆమె ప్రవర్తన భారత రెజ్లింగ్ ప్రతిష్ఠను దెబ్బతీసింది. వినేశ్ దేశం అవమానపడేలా వ్యవహరించింది. జాతీయ, అంతర్జాతీయ రెజ్లింగ్ నిబంధనలను కూడా ఉల్లంఘించింది’ అని డబ్ల్యూఎఫ్ఐ తెలిపింది. పారిస్ ఒలింపిక్స్ 2024లో అనర్హురాలిగా వేటు పడటంతోపాటు నాలుగు ప్రధాన ఆరోపణలపై వినేశ్ నుంచి రెజ్లింగ్ సమాఖ్య వివరణ కోరింది.


పారిస్ ఒలింపిక్స్ 2024 తర్వాత రెజ్లింగ్‌కు వీడ్కోలు పలికిన వినేశ్.. తన నిర్ణయాన్ని మార్చుకున్న సంగతి తెలిసిందే. గొండాలో జరగనున్న జాతీయ ఓపెన్ ర్యాంకింగ్ టోర్నీతో రీఎంట్రీ ఇవ్వాలని భావించింది. డబ్ల్యూఎఫ్ఐ మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ సొంత ఊరిలో పోటీలు జరుగుతున్నాయని.. ఆ ప్రాంతంలో పోటీపడటం తనను మానసిక ఒత్తిడికి గురిచేస్తోందని వినేశ్ ఇటీవలే ఆందోళన వ్యక్తం చేసింది. బ్రిజ్‌భూషణ్ తమపై లైంగిక వైధింపులకు పాల్పడ్డాడంటూ ఫిర్యాదు చేసిన ఆరుగురు మహిళల్లో తాను కూడా ఉన్నానని.. పోటీల సందర్భంగా తనకు లేదా తన జట్టు సభ్యులకు ఎలాంటి ప్రమాదం జరిగినా భారత ప్రభుత్వానిదే బాధ్యత అవుతుందంటూ హెచ్చరించింది. అయితే పోటీల ప్రారంభానికి ఒకరోజు ముందే డబ్ల్యూఎఫ్ఐ నుంచి ఈ ప్రకటన రావడం గమనార్హం.


ఇవి కూడా చదవండి:

టీమిండియా టీ20 కెప్టెన్‌గా సంజు శాంసన్!

చరిత్ర సృష్టించిన ఫిన్ అలెన్.. తొలి ప్లేయర్‌గా రికార్డ్!

Updated Date - May 09 , 2026 | 04:08 PM