Share News

'సుప్రీం' జోక్యంతో డబ్ల్యూఎఫ్‌ఐ యూటర్న్.. 53 కేజీల ట్రయల్స్‌లోకి ఎంట్రీ

ABN , Publish Date - May 30 , 2026 | 12:30 PM

ఈ ఏడాది జరిగే ఆసియా క్రీడల సెలక్షన్ ట్రయల్స్‌‌లో పాల్గొనేందుకు భారత రెజ్లర్‌ వినేశ్ ఫొగాట్‌కు మార్గం మరింత సుగమమైంది. సుప్రీం కోర్టు జోక్యం అనంతరం తన నిర్ణయాన్ని మార్చుకున్న డబ్ల్యూఎఫ్ఐ.. 53 కేజీల్లో ఆమె పోటీపడేందుకు అనుమతించింది.

'సుప్రీం' జోక్యంతో డబ్ల్యూఎఫ్‌ఐ యూటర్న్.. 53 కేజీల ట్రయల్స్‌లోకి ఎంట్రీ
WFI allows Vinesh Phogat

ఇంటర్నెట్ డెస్క్: భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ చుట్టూ కొద్దిరోజులుగా సాగుతున్న వివాదానికి తాత్కాలిక ముగింపు లభించింది. ఆసియా క్రీడల సెలక్షన్ ట్రయల్స్‌లో 53 కేజీల విభాగంలో వినేశ్ పోటీపడేందుకు భారత రెజ్లింగ్ సమాఖ్య(WFI) అనుమతించింది. తొలుత ఆమె కేవలం 50 కేజీల విభాగంలోనే పోటీచేయాలని స్పష్టం చేసిన డబ్ల్యూఎఫ్ఐ.. తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవడం, ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడంతో తన నిర్ణయాన్ని మార్చుకుంది.


ఆసియా క్రీడల సెలక్షన్ ట్రయల్స్‌కు ముందు వినేశ్‌ 50 కేజీల విభాగంలో మాత్రమే పోటీచేయాలని డబ్ల్యూఎఫ్‌ఐ అధికారులు సూచించారు. కొంతకాలంగా ఆమె అంతర్జాతీయ స్థాయిలో అదే విభాగంలో పోటీపడుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. అయితే.. తాను 53 కేజీల విభాగంలో పోటీ చేయాలనుకుంటున్నానని వినేశ్ స్పష్టం చేసింది. తనకు ఇష్టమైన విభాగంలో పోటీచేసే అవకాశాన్ని నిరాకరించడం వివక్ష కిందకు వస్తుందని ఆమె అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ అంశం ట్రయల్స్ వేదిక వద్ద ఉద్రిక్తతకు దారితీయగా.. డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడు సంజయ్ సింగ్ జోక్యంతో ఈ సమస్య పరిష్కారమైంది. వినేశ్ బరువు ఆధారంగా.. ఆమెను 53 కేజీల విభాగంలో చేర్చారు. దీంతో ఆమెకు అధికారికంగా ఆ విభాగంలో పోటీచేసే అవకాశం లభించింది.


ఈ పరిణామానికి ముందు న్యాయస్థానాల్లోనూ కీలక పోరాటం సాగింది. వినేశ్‌ ట్రయల్స్‌లో పాల్గొనేందుకు అనుమతిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇటీవల తీర్పు వెలువరించగా.. దాన్ని సవాలు చేస్తూ డబ్ల్యూఎఫ్‌ఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే హైకోర్టు ఉత్తర్వులను నిలిపివేయడానికి నిరాకరించిన అత్యున్నత న్యాయస్థానం.. వినేశ్ ట్రయల్స్‌లో పాల్గొనేందకు మార్గం సుగమం చేసింది. దీంతో ప్రస్తుతం అందరి దృష్టి ఆసియా సెలక్షన్ ట్రయల్స్‌పైనే ఉంది. ఎన్నో పోరాటల అనంతరం బరిలోకి దిగనున్న వినేశ్.. యువ రెజ్లర్లను తట్టుకుని తన ప్రతిభతో మళ్లీ జాతీయ జట్టులో స్థానం సంపాదిస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది.


ఇవీ చదవండి:

ఫైనల్ చేరలేకపోయిన రాజస్థాన్ రాయల్స్.. కన్నీళ్లు పెట్టుకున్న వైభవ్

జైస్వాల్‌కు క్షమాపణ చెప్పాలి.. రోహిత్ ఎంపికపై మంజ్రేకర్ తీవ్ర ఆగ్రహం

Updated Date - May 30 , 2026 | 12:33 PM